'అమ్మ' అనే పదాన్ని వర్ణించడానికి పదాలు చాలవు, శ్లోకాలు చాలవు ఆఖరికి గ్రంధాలు కూడా చాలవు. ఎంత చెప్పినా తక్కువే. భగవంతుడు సైతం అమ్మ ప్రేమకు బానిస అవుతాడు అనేది శాసనం. ఏ రంగంలో అయినా, ఏ సందర్భంలో అయినా.. భూమి నుంచి ఆకాశం వరకు ఏదైనా చెయ్యగలిగే శక్తి మాతృమూర్తి సొంత. ఇక వ్యాపార రంగంలో అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 'మాతృ దినోత్సవం' సందర్భంగా వ్యాపార ప్రపంచంలో దూసుకెళ్తున్న నలుగురు తల్లీ కూతుళ్ళ ప్రయాణం గురించి ప్రత్యేక కథనం..
ఫల్గుణి & అద్వైత నాయర్
అమెరికాలో ఉద్యోగం వదిలి తన తల్లి ఫల్గుణి నాయర్ సహాయంతో వ్యాపార రంగంలో ప్రయాణం మొదలు పెట్టి ఈ రోజు వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించింది. ఫల్గుణి నాయర్ భారతదేశంలోనే అత్యంత ధనవంతురాలు. ఆమె 2021లో చాలా విజయవంతమైన IPO తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 36,000 కోట్లకు పైగా ఉన్న Nykaa CEO కూడా. ఈ కంపెనీకి అద్వైత నాయర్ నేతృత్వంలోని Nykaa ఫ్యాషన్ అనే ఫ్యాషన్ విభాగం తోడైంది. ఉన్నత చదువులు చదువుకున్న అద్వైత కంపెనీ అభివృద్ధికి ఎంతగానో సహాయపడింది. 10 మందితో ప్రారంభమైన వీరి కంపెనీ ఇప్పుడు 3000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది.
తల్లీ, కూతుళ్లు నైకా బ్రాండ్ కింద అనేక ఉత్పత్తులు విక్రయిస్తూ విజయాల బాటలో ప్రయాణిస్తున్నారు. 2022 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో వీరి ఆదాయం రూ. 724 కోట్ల కంటే ఎక్కువ. రానున్న రోజుల్లో ఈ ఆదాయాన్ని మరింత పెంచడానికి కృషి చేయడానికి కావలసిన ఎన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం మీద ఫల్గుణి నాయర్ & అద్వైత భారతదేశంలో అత్యంత ధనవంతులైన మహిళల్లో ఒకరుగా ఉన్నారు. వీరి నికర ఆస్తుల విలువ రూ.20,000 కోట్లు.
షహనాజ్ హుస్సేన్ & నెలోఫర్ కర్రింబోయ్
షహనాజ్ హుస్సేన్ భారతదేశంలోని షహనాజ్ హుస్సేన్ గ్రూప్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్. ఈమె హెర్బల్ బ్యూటీ కేర్ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించినందుకు, ఆయుర్వేదంలో భారతీయ మూలికా వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లినందుకు అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. వాణిజ్య పారిశ్రామిక రంగంలో షహనాజ్ కృషికి భారత ప్రభత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది.
షహనాజ్ హుస్సేన్ కుమార్తె నెలోఫర్ కర్రింబోయ్ కూడా తల్లి మార్గంలోనే ముందుకు సాగుతోంది. ఈ తల్లీ కూతుళ్ల ద్వయానికి చెందిన బ్రాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. టెక్నాలజీ పట్ల నీలోఫర్స్‌కు ఉన్న ఆసక్తి ఆయుర్వేదం, బ్యూటీ రంగంలో మరింత మంచి భవిష్యత్తుకు మార్గదర్సకం కానుంది.
శోభన కామినేని & ఉపాసన కామినేని కొణిదెల
అపోలో హాస్పిటల్ సామ్రాజ్య స్థాపనకు కారకులైన కుటుంబానికి చెందిన శోభన కామినేని & ఉపాసన కామినేని కూడా చెప్పుకోదగ్గ వ్యక్తులు. అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ 'శోభనా కామినేని', అపోలో హాస్పిటల్స్‌లోని CSR వైస్ చైర్‌పర్సన్‌గా 'ఉపాసన కామినేని' పనిచేస్తున్నారు. ఉపాసన ప్రజలకు ఆరోగ్యం మీద శ్రద్ద వహించే మెళుకులను తెలియజేస్తూ.. మెగా కోడలిగా తన బాధ్యతలను నిర్వరిస్తోంది.
జయ & శ్వేతా శివకుమార్
వై సో బ్లూ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ వ్యాపారాన్ని ప్రారంభించి ప్రముఖ వ్యాపారవేత్తలుగా మారిన తల్లీ కూతుళ్లే జయ & శ్వేతా శివకుమార్. వారి కుటుంభంలో ఒక విషాద సంఘటన జరిగిన తరువాత వారు ఈ సంస్థకు ప్రాణం పోశారు. ఆధునిక కాలంలో అద్భుతమైన డ్రెస్ బ్రాండ్ ప్రారంభించి వీరి జీవిత కాల కళను నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం వారు అద్భుతమైన పర్యావరణ స్పృహతో కూడిన కాటన్ దుస్తుల బ్రాండ్‌ను సృష్టించి మంచి లాభాలను గడిస్తున్నారు.
నాస్తి మాతృ సమం దైవం, నాస్తి మాతృ సమః పూజ్యో, నాస్తి మాతృ సమో బంధు, నాస్తి మాతృ సమో గురుః. (అమ్మతో సమానమైన పూజ్యులు గానీ దైవంగానీ లేరు. తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు) అన్న మాటలు ఇప్పటికే నిత్య సత్యాలే.. మాతృదినోత్సవం సందర్భంగా ప్రతి తల్లికి సాక్షి బిజినెస్ తరపున శుభాకంక్షాలు.
Comments
Please login to add a commentAdd a comment