ఎగిసిపడే అగ్నిని తలకిందులుగా పట్టుకున్నా జ్వాల పైకే లేస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయి చేరుకోవాలనే తపన ఉన్న వ్యక్తుల చుట్టూ వ్యతిరేక పరిస్థితులు ఎక్కువగా కాలం అడ్డుగా నిలవలేవు. సమయస్ఫూర్తి, పట్టుదల, ఓపిక ఉంటే చదువు, డబ్బుతో పని లేకుండా బిజినెస్‌లు చేయవచ్చు అనేందుకు వికేశ్ షా జీవితం ఓ ఉదాహారణ. పేరుతో ఆయన్ని గుర్తు పట్టడం కష్టం, కానీ 99 ప్యాన్‌కేక్ అంటే గుర్తు పట్టడం తేలిక. డిగ్రీ కూడా చేయని అతను దేశంలోనే ఓ ఫుడ్ ఫ్రాంచైజీకి యాజమాని స్థాయికి ఎలా ఎదిగాడు ?
99 Pancakes Founder Vikesh Shah Success Story: ముంబైకి చెందిన వికేశ్ షాది చిన్నప్పుడు కలిగిన కుటుంబమే. తండ్రి వజ్రాల వ్యాపారిగా బాగానే సంపాదించాడు, అయితే వికేశ్ పదో తరగతిలో ఉన్నప్పుడు తండ్రికి వ్యాపారంలో తీవ్ర నష్టం వచ్చింది. ఉన్న ఆస్తులన్నీ పోయాయి. రెండు గదుల ఇంటికి మారాల్సి వచ్చింది. ఆ దిగులుతో తండ్రి మంచం పట్టగా కుటుంబం గడవడం కోసం తల్లి ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది. ఆ సంపాదన సరిపోక, ఇంటర్‌లోనే చదువుకి పులిస్టాప్ పెట్టి.. దగ్గరల్లో ఉన్న ఓ బేకరిలో బాయ్‌గా 1995లో వికేశ్‌షా చేరాడు. నెల జీతం రూ. 700 ఆ సమయంలో ఆ సంపాదన ఆ కుటుంబానికి ఎంతో అవసరం.
బాయ్ టూ మేనేజర్
ఇంటర్‌తోనే చదువు ఆపేసినా చుట్టూ పరిస్థితులను అంచనా వేయడంలో వికేశ్ దిట్ట. బేకరీకి ఎలాంటి కస్టమర్లు వస్తున్నారు... ఏ ఐటమ్స్ ఎక్కువగా తింటున్నారు. అందులో వాళ్లకి ఏం నచ్చుతుందో పసిగట్టాడు. ఓనర్‌కి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండటంతో రెండేళ్లలోనే ఆ బేకరీలో బాయ్ నుంచి మేనేజర్‌గా ఎదిగాడు.
కేటరింగ్
జీవితంలో పైకి ఎదగాలన్న తపన్న ఉన్న వాళ్లు చిన్న చిన్న విజయాలకే సంతృప్తి పడిపోరు. వికేశ్‌లో పైకి ఎదగాలన్న పట్టుదల ఎక్కువ. అందుకే మేనేజర్‌గా పని చేస్తుండగా ఉన్న పరిచయాలు ఆధారంగా చేసుకుని క్యాటరింగ్ సర్వీస్ ప్రారంభించాడు. బర్త్‌డేలు, కిట్టీ పార్టీలకు క్యాటరింగ్ ప్రారంభించారు. అలా పదేళ్లలో నాలుగు లక్షల రూపాయలు పోగేశాడు
మరోమెట్టు
కష్టపడే తత్వం, తన కాళ్లపై తాను నిలబడాలనే కోరిక బలంగా ఉన్న వికేశ్ స్వంతంగా బేకరీ ప్రారంభించాలని డిసైడ్ అయ్యాడు. తన దగ్గరున్న డబ్బులు బేకరీ స్టార్ట్ చేసేందుకు సరిపోకపోవడంతో స్నేహితులు, పరిచయస్తులను పార్టనర్లుగా చేర్చుకుని బిజినెస్ ప్రారంభిద్దామన్నాడు.
నీకు బిజినెస్ ఎందుకురా?
‘నువ్వు కనీసం డిగ్రీ కూడా చేయలేదు. ఏదో కలుపుగోలుగా ఉన్నాం కదా అని బిజినెస్ అదీ అంటూ మాట్లాడకు. కేటగింగ్ ఏదో నడుస్తుంది కదా చూసుకో చాలు.. పెద్ద పెద్ద కలలు కనకు’ అంటూ వికేశ్‌ని నిరుత్సాహపరిచారు. ఆ సమయంలో ఆత్మ విశ్వాసం తప్ప వికేశ్‌కి తోడుగా ఎవ్వరూ నిలవలేదు. తీవ్ర సందిగ్ధం మధ్య తన డ్రీమ్‌ను నెరవేర్చుకోవాలనే డిసైడ్ అయ్యాడు. అలా బంధువులు, స్నేహితుల దగ్గర చేసిన అప్పుతో 2007లో హ్యాపినెస్ డెలీ పేరుతో బేకరీ ప్రారంభించాడు.
నల్లేరు మీద నడక
బేకరీ బాయ్‌గా ఉన్నప్పుడే కస్టమర్ల పల్స్ తెలుసుకున్న వికేశ్‌కి హ్యపినెస్ డెలీ బేకరీ నిర్వాహణ నల్లేరు మీద నడకే అయ్యింది. చూస్తుండగానే బేకరీ బిజినెస్ ఊపందుకుంది. జీవితంలో సకల సౌకర్యాలు ఒక్కొక్కటిగా సమకూరాయి. ఒకప్పటి ఆర్థిక సమస్యలు ఇప్పుడు లేవు. దీంతో వెకేషన్‌కి కుటుంబంతో కలిసి 2014లో యూరప్ టూర్‌కి వెళ్లాడు.
తొలిసారి అక్కడే
యూరప్ పర్యటనలో ఉండగా అక్కడ ప్యాన్‌కేక్ కాన్సెప్టు వికేశ్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. వెస్ట్రన్ కంట్రీస్‌లో స్ట్రీట్ ఫుడ్ నుంచి మెయిన్ రెస్టారెంట్ల వరకు ప్యాన్‌కేక్‌లు విపరీతంగా అమ్ముడైపోవడం చూశాడు. ఇరవై ఏళ్లుగా బేకరీ ఫీల్డ్‌లో ఉన్న తనకీ వాటి రుచి నచ్చింది.
ఆచరణలో
ముంబైకి వచ్చిన వెంటనే బేకరీ ఫీల్డులో ఉన్న చెఫ్‌లను పిలిపించి పాన్ కేక్ కాన్సెప్టు చెప్పాడు. చాలా మంది ఇదిక్కడ సక్సెస్ కాదంటూ పెదవి విరిచారు. వాళ్ల మాటలు లెక్క చేయకుండా బేకరీలోనే పాన్ కేక్‌ను తయారు చేసి కస్టమర్లు అందించాడు. అందులో ఓ వెస్ట్రన్ లేడీ ‘ పాన్ కేక్ బాగుందని.. ఎక్స్‌క్లూజివ్‌గా ఓ స్టోర్ ఓపెన్ చేయమని’ సలహా ఇచ్చింది.
నమ్మకంతో
ఇండియాలో ప్యాన్‌కేక్ కాన్సెప్టు కొత్త .. ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ఓపెన్ చేస్తే జనాల ఆదరణ లభిస్తుందా లేదా అనే సందేహం. ఎందుకంటే ఒకప్పుడు వజ్రాల వ్యాపారిగా లక్షలు గడించిన తండ్రి ఒక్క దెబ్బతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. కుటుంబం రోడ్డు మీదికొచ్చిన పరిస్థితి కళ్ల ముందు కదలాడుతోంది. జీవితంలో అంతా బాగుంది అనుకునే సమయంలో రిస్క్ ఎందుకు అనే భయం మధ్య ఊగిలసాట ఏడాది పాటు కొనసాగింది, చివరకు కలను నిజం చేసుకునేందుకు రిస్క్ చేసినా పర్వాలేదనే నమ్మకంతో 99 ప్యాన్‌కేక్ పేరుతో ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ని 2017లో కాలాగోడా సెంటర్‌లో ఓపెన్ చేశాడు వికేశ్. ఒక్క కేక్ ధర రూ.99 కావడంతో 99 పాక్‌కేక్స్‌గా పేరు పెట్టారు.
భయపడ్డట్టే
పాన్ కేక్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లో తొలి వారం అమ్ముడైన కేకులు కేవలం రూ. 500లవే. ఆ తర్వాత రెండు వారాలు ఒక్క కేకు అమ్ముడు పోలేదు. ఇదే సమయంలో ఆ షాప్ ముందు ముంబై మున్సిపాలిటీ వాళ్లు మరమ్మత్తుల పేరుతో రోడ్డు తవ్వేయడంతో నెల రోజుల పాటు బిజెనెస్ డల్‌గా మారింది
పట్టు వదల్లేదు
ప్యాన్‌కేక్ అనే పేరు కొత్త, పైగా ఖాళీ కుర్చీలు కనిపిస్తుండటంతో కష్టమర్లు రావట్లేదని గమనించాడు. వెంటనే కష్టమర్లతో నిండిపోయినట్టుగా కనిపించేలా రోజు ప్యాన్‌కేక్ స్టోర్‌కి వచ్చి కూర్చోవాలంటూ తన స్నేహితులు, కుటుంబ సభ్యులను కోరాడు. వారికే ఆర్డర్లు సర్వ్ చేసేవాడు. ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యింది. వారం తిరిగే సరికి స్నేహితులు రావాల్సిన అవసరం తప్పింది. నెల రోజుల్లో టేబుల్స్ ఖాళీగా లేని స్థితికి చేరుకుంది.
దేశవ్యాప్తంగా
2017లో వికేశ్ ఇండియాకు తీసుకువచ్చిన ప్యాన్‌కేక్‌లు మూడేళ్లు తిరిగే సరికి దేశవ్యాప్తంగా ఫేమస్ ఫుడ్ ఐటమ్‌గా మారిపోయాయి. ముంబైతో పాటు పద్నాలుగు సిటీల్లో 65 స్టోర్లు ఓపెన్ చేసే స్థితికి చేరుకుంది. హైదరాబాద్‌లో కూడా 99 ప్యాన్‌కేక్ స్టోర్ ఉంది. కేవలం రెండేళ్లలోనే రూ. 16 కోట్ల టర్నోవర్ సాధించే స్థితికి 99 ప్యాన్‌కేక్ చేరుకుంది. ఇరవై ఐదేళ్ల కిందట ఇంటర్ పూర్తి చేసి తప్పనిసరి పరిస్థితుల్లో బేకరీ బాయ్‌గా చేరిన వ్యక్తి నేడు కోట్లకు అధిపతి కావడమే కాకుండా ఎందరికో ఉపాధిని కల్పిస్తున్నాడు.
సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం
చదవండి : ఒంటరి మహిళల ఉమ్మడి శక్తి
Comments
Please login to add a commentAdd a comment