
వరుసగా ఆరో రోజు హుషారుగా ప్రారంభమైన మార్కెట్లలో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో మార్కెట్లకు షాక్ తగిలింది. ప్రస్తుతం సెన్సెక్స్ 674 పాయింట్లు పతనమైంది. 38,793కు చేరింది. వెరసి ఇంట్రాడే గరిష్టం 40,010 నుంచి 1,200పాయింట్లు పడిపోయింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 195 పాయింట్లు కోల్పోయి 11,452 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో గరిష్టంగా 11,794ను తాకింది. లడఖ్ తూర్పు ప్రాంతంలో తిరిగి చైనా బలగాలతో సైనిక వివాదం తలెత్తినట్లు వెలువడిన వార్తలు సెంటిమెంటుకు షాకిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనికితోడు ఆరు రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు తెరతీసినట్లు తెలియజేశారు.
అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మీడియా, ఫార్మా, మెటల్, బ్యాంకింగ్, ఆటో, రియల్టీ 5-2.5 శాతం మధ్య పతనమయ్యాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, కొటక్ బ్యాంక్, ఐషర్, బజాజ్ ఫిన్, ఎస్‌బీఐ, శ్రీ సిమెంట్, జీ, సిప్లా, ఎల్‌అండ్‌టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ, యాక్సిస్ 6-3 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఓఎన్‌జీసీ, ఇన్‌ఫ్రాటెల్, విప్రో మాత్రమే 2.5-1 శాతం మధ్య బలపడ్డాయి. అదానీ పోర్ట్స్ 0.3 శాతం పుంజుకుంది.
పతన బాటలో
డెరివేటివ్ కౌంటర్లలో ఎన్‌ఎండీసీ, పీవీఆర్, ఐబీ హౌసింగ్, పిరమల్, శ్రీరామ్ ట్రాన్స్, ఫెడరల్ బ్యాంక్, భెల్, డీఎల్‌ఎఫ్, బాష్, జీఎంఆర్, ఆర్‌బీఎల్ బ్యాంక్, అరబిందో, మదర్‌సన్, ఐసీఐసీఐ ప్రు, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, మెక్‌వోవెల్, దివీస్ 9.3-5 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా.. గోద్రెజ్ ప్రాపర్టీస్, ఇండిగో, వేదాంతా, ఐడియా మాత్రమే 4-1 శాతం మధ్య పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 3-4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 2278 నష్టపోగా... కేవలం 466 లాభాలతో ట్రేడవుతున్నాయి.