ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ విలువను 7.85 బిలియన్ డాలర్లు (రూ.65,000 కోట్లు)గా అమెరికా ఫండ్ మేనేజర్ ఇన్వెస్కో అంచనా వేసింది. ఈ ఏడాది జులై 31 నాటికి 5.5 బిలియన్ డాలర్లుగా స్విగ్గీ విలువను తేల్చిన ఇన్వెస్కో ప్రస్తుత విలువను ప్రకటించింది. గతంతో పోలిస్తే ప్రస్తుత అంచనా విలువ 42 శాతం ఎక్కువ. 2022 జనవరిలో స్విగ్గీ విలువను 10.7 బిలియన్ డాలర్లుగా పరిగణనలోకి తీసుకున్నారు. అప్పటితో పోలిస్తే తాజా అంచనా విలువ 30 శాతం తక్కువగానే ఉంది. ఆ సమయంలో ఇన్వెస్కో నేతృత్వంలో జరిగిన 700 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ ప్రక్రియ కోసం, స్విగ్గీ విలువను 10.7 బిలియన్ డాలర్ల విలువగా పరిగణనలోకి తీసుకున్నారు.
వచ్చే ఏడాదిలో పబ్లిక్ ఇష్యూకు రావాలని భావిస్తున్న స్విగ్గీ.. తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు చర్యలు చేపడుతోంది. స్విగ్గీలో ఇన్వెస్కోకు 24,844 షేర్లు ఉన్నాయి. సంస్థ విలువలో మార్సును పరిగణనలోకి తీసుకోమని, వినియోగదార్ల సేవలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని స్విగ్గీ చెబుతోంది.
అయితే స్విగ్గీ పోటీ సంస్థ జొమాటో విలువను గత జులైలో 7.7 బిలియన్ డాలర్లుగా లెక్కించడం గమనార్హం. ఆ తర్వాత జొమాటో షేరు 30 శాతం పెరగడంతో, ప్రస్తుతం ఆ సంస్థ విలువ ప్రస్తుతం 11 బిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా.
Comments
Please login to add a commentAdd a comment