ఆగస్టు 15న తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ పాలన చేపట్టినప్పటి నుంచి కాబూల్ పౌరులు తమ బ్యాంకుల నుంచి నగదును విత్ డ్రా చేసుకోలేకపోయారు. అప్పటి నుంచి నిత్యావసరాల ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్కడ ప్రధానమైన ఆహార గోధుమ ధరలు రెట్టింపు అయ్యాయి. తనను తాను 'ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్' అని పిలుచుకునే తాలిబన్లు గత కొన్ని రోజులుగా అక్కడ పరిస్థితిని చక్కబెట్టడానికి అనేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో ప్రధానంగ దేశ కేంద్ర బ్యాంకు తాత్కాలిక గవర్నర్ నియామకం కూడా ఉంది. గత అఫ్గన్ ప్రభుత్వంలో గవర్నర్ గా పనిచేసిన అజ్మల్ అహ్మదీ తిరుగుబాటు తర్వాత అకస్మాత్తుగా కాబూల్ నుంచి పారిపోయాడు.
"ప్రభుత్వ సంస్థలు, బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి, ప్రజల ఆర్ధిక సమస్యలను పరిష్కరించడానికి ఇస్లామిక్ ఎమిరేట్ నాయకత్వం హాజీ మొహమ్మద్ ఇద్రీస్ డా అనే వ్యక్తిని ఆఫ్ఘనిస్తాన్ బ్యాంక్ తాత్కాలిక గవర్నర్ గా నియమించారు" అని ఆగస్టు 23న 'ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్' ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ట్వీట్ చేశారు. అసలు ఇద్రీస్ కు ఉన్న అర్హతల గురించి ఎవరికి పెద్దగా తెలియదు. ఇంతకముందు తాలిబన్ ఆర్థిక కమిషన్ అధిపతి, జావ్జ్జాన్ ప్రావిన్స్ గవర్నర్ గా పనిచేశారు. ఇక గుల్ ఆఘా అనే వ్యక్తిని ఆర్థిక మంత్రిగా ప్రకటించారు. కానీ, ఇద్రీస్ వలె ఇతని గురించి కూడా పెద్దగా వివరాలేమీ తెలియదు.
మునిగిపోతున్న నావను నడుపుతున్నారు
అక్రమ మైనింగ్, నల్లమందు ఉత్పత్తి ఆదాయ వనరులు దేశాన్ని నడపడానికి సరిపోవని 'ఫైనాన్షియల్ టైమ్స్'లో ఒక వ్యాసంలో అహ్మదీ చెప్పారు. "అక్రమ మైనింగ్, నల్లమందు ఉత్పత్తి లేదా వాణిజ్య మార్గాల ద్వారా ఆదాయాలు పెద్దవిగా ఉన్నట్లు కనిపించడం వల్ల కొందరు అవి ఆర్థిక సమస్యను తగ్గిస్తాయని భావిస్తున్నారు. అలాగే, చైనా లేదా రష్యా పెద్ద పెద్ద పెట్టుబడులు పెడుతారని ఆశిస్తున్నారు. కానీ, అది ఒక ఆశ మాత్రమే. నిజం చెప్పాలంటే తాలిబన్లు మునిగిపోతున్న నావను నడుపుతున్నారు. తిరుగుబాటు చేసేటప్పుడు అటువంటి తాలిబన్ ఆదాయ వనరులు సాపేక్షంగా పెద్దవిగా కనిపిస్తాయి. ఒక ప్రజా ప్రభుత్వాన్ని నడపడానికి అవి పూర్తిగా సరిపోవు" అని అజ్మల్ అహ్మదీ అన్నారు.(చదవండి: తాలిబన్లతో చర్చలు.. చైనా కీలక వ్యాఖ్యలు)
అంతర్జాతీయ ఆంక్షలు, ప్రధాన దాతల నుంచి సహాయాన్ని నిలిపివేయడం వల్ల ప్రజలు బాధపడుతున్నారు. "ప్రియమైన దేశవాసులారా ఆఫ్ఘనిస్తాన్ నుంచి డాలర్లు, పురాతన వస్తువులను వాయు, భూ మార్గం ద్వారా బదిలీ చేయకూడదు అని మేము మీకు తెలియజేస్తున్నాము. మేము పేర్కొన్న వాటిని మీరు బదిలీ చేసేటప్పుడు గుర్తిస్తే వాటిని వెంటనే జప్తు చేసి, బదిలీదారులతో చట్టబద్ధంగా వ్యవహరిస్తాము" అని ముజాహిద్ ట్వీట్ చేశారు.
సహాయం నిలిపివేత
అమెరికా ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ కేంద్ర బ్యాంకులకు చెందిన 9.4 బిలియన్ డాలర్ల నిల్వలను ఫ్రీజ్ చేయగా, ప్రధాన దాతలు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు కూడా ఆఫ్ఘనిస్తాన్ కు సహాయాన్ని నిలిపివేశాయి. ప్రధాన ఆదాయాలు అన్నీ తాలిబన్లు కోల్పోతున్నారని అహ్మదీ హెచ్చరిస్తున్నారు. దీనివల్ల దేశంలోని 38 మిలియన్ల ప్రజలకు మరింత బాధ కలుగుతుంది. "తాలిబన్ల రాజ్యంలో ప్రభుత్వ ఆదాయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. దాతలు ఆర్థిక సహాయం నిలిపివేయడం వల్ల ప్రభుత్వ సేవలను తగ్గించాల్సి ఉంటుంది. చాలా మ౦ది ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోతారు, మిగిలి వారికి జీతాలు చాలా తక్కువగా ఉ౦టాయి" అన్నారు.(చదవండి: కశ్మీర్ అంశంలో తాలిబన్ల సాయం తీసుకుంటాం: పాక్)
పోషకాహార లోపం
అనుభవలేమి గల తాలిబన్ల ఆర్థిక బృందం చేసే పొరపాట్లు, ఆంక్షలు వల్ల సాధారణ అఫ్గన్ ప్రజలు బాధలు పెరుగుతాయి. మే 2021లో ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నివేదికలో ముగ్గురు ఆఫ్ఘన్లలో ఒకరు తీవ్రంగా ఆహార కోసం అలమటిస్తున్నారని తెలిపింది. "రాబోయే అనిశ్చితికి ముందే మనం ఇప్పుడు చర్య తీసుకోవాలి, ప్రజల ఇళ్లకు ఆహారాన్ని దగ్గర చేయాలి, తల్లులు, పిల్లల్లో కోలుకోలేని పోషకాహార లోపాన్ని తగ్గించాలి. వారు ఎక్కువగా ప్రభావితం అవుతారు కాబట్టి మేము వేచి చూడలేము" అని ఆఫ్ఘనిస్తాన్ లోని డబ్ల్యుఎఫ్‌పీ ప్రతినిధి మేరీ-ఎల్లెన్ మెక్ గ్రోర్టీ తిరుగుబాటుకు మూడు నెలల ముందు చెప్పారు. మరి ప్రస్తుత కఠిన పరిస్థితులను చక్కదిద్ది అఫ్గన్‌ను తాలిబన్లు ఎలా పాలిస్తారో మనం వేచి చూడాలిక!.
Comments
Please login to add a commentAdd a comment