న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ కంపెనీ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ దక్షిణాది మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో పంపిణీదారుల చానల్‌ను ఏర్పాటు చేసుకోనున్నట్టు సంస్థ ప్రకటించింది. ‘‘దక్షిణ భారత్ అంతటా మేము విస్తరిస్తున్నాం. టీ, కాఫీ, ఉప్పు, మసాలా దినుసులను దక్షిణాది కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని విడుదల చేస్తున్నాం’’అని టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ తన తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది.
కాఫీ, టీ ఉత్పత్తుల్లో ఈ సంస్థ దక్షిణాదిన మార్కెట్ వాటా పెంచుకుంటోంది. టీ విభాగంలో చక్రాగోల్డ్, కనన్ దేవాన్ బ్రాండ్ల వాటా క్రమంగా పెరుగుతుండగా.. టాటా కాఫీ గ్రాండ్ నూతన ప్యాకేజింగ్ డిజైన్‌తో మార్కెట్లోకి వచ్చింది. ‘‘గ్రామీణ మార్కెట్‌లో అవకాశాలున్నట్టు గుర్తించాం. గ్రామీణ, చిన్న పట్టణాల్లో పంపిణీదారులను నియమించుకుంటున్నాం’’అని వివరించింది. ఇక టాటా సంపన్న్ బ్రాండ్ కింద మసాలా దినుసులను ప్రత్యేకంగా విడుదల చేసింది.
ప్రస్తుత విభాగాల్లో అగ్రగామి ఎఫ్‌ఎంసీజీ కంపెనీగా ఎదగడంతోపాటు, కొత్త విభాగాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నట్టు వాటాదారులకు తెలిపింది. 2022–23లో డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ 15 శాతం పెరిగి, దేశవ్యాప్తంగా 1.5 మిలియన్ అవుట్‌లెట్లకు చేరుకుంది. మరిన్ని సంఖ్యలో రిటైల్ స్టోర్లకు సంస్థ ఉత్పత్తులను చేరువ చేయడానికి ఇది సాయపడింది. సంస్థ ఈ కామర్స్ అమ్మకాల చానల్ వేగంగా వృద్ధి చెందుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆధునిక అంగళ్లు ద్వారా అమ్మకాలు 21 శాతం పెరిగాయి.
ఇదీ చదవండి: మహిళా ఇంజనీర్లకు టాటా టెక్నాలజీస్ ప్రాధాన్యం.. కొత్తగా 1000 ఉద్యోగాలు
Comments
Please login to add a commentAdd a comment