2022–23 క్యూ4 ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్న సంస్థకు కాబోయే ఎండీ, సీఈవో కృతివాసన్, (ఎడమ వ్యక్తి), ప్రస్తుత ఎండీ, సీఈవో రాజేష్ గోపినాథన్
ముంబై: సాఫ్ట్‌వేర్ సేవల నంబర్‌వన్ దేశీ దిగ్గజం టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 15 శాతం ఎగసి రూ. 11,392 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 9,959 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం బలపడి రూ. 59,162 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 50,591 కోట్ల ఆదాయం నమోదైంది. రూ. 41,440 కోట్ల ఫ్రీ క్యాష్‌ఫ్లోను ఆర్జించినట్లు కంపెనీ వెల్లడించింది.
పూర్తి ఏడాదికి
మార్చితో ముగిసిన గతేడాదికి టీసీఎస్ 10 శాతం అధికంగా రూ. 42,147 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 2,25,458 కోట్లను తాకింది. కాగా.. కొత్త సీఈవో, ఎండీగా ఎంపికైన కె.కృతివాసన్ ప్రస్తుత సీఈవో రాజేష్ గోపీనాథన్ నుంచి జూన్1న బాధ్యతలు స్వీకరించనున్నట్లు టీసీఎస్ పేర్కొంది.
ఆర్డర్ బుక్ జోరు
గతేడాది ఆర్డర్‌బుక్ 34.1 బిలియన్ డాలర్లకు చేరినట్లు టీసీఎస్ వెల్లడించింది. క్యూ4లో 10 బిలియన్ డాలర్లు జమైనట్లు తెలియజేసింది. చరిత్రాత్మక స్థాయిలో భారీ డీల్స్ సాధించినట్లు పేర్కొంది. 10 కోట్లకుపైగా డాలర్ల క్లయింట్ల సంఖ్య 60కు చేరింది. బ్యాంకింగ్ రంగం సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ఉత్తర అమెరికా నుంచి 15 శాతంపైగా వృద్ధి సాధించినట్లు పేర్కొంది.
ఇతర హైలైట్స్
► షేరుకి రూ. 24 తుది డివిడెండ్ ప్రకటించింది.
► నిర్వహణ లాభ మార్జిన్లు 24.1 శాతం నుంచి 24.5 శాతానికి బలపడ్డాయి.
► నికర మార్జిన్లు సైతం 18.7 శాతం నుంచి 19.3 శాతానికి మెరుగుపడ్డాయి.
► క్యూ4లో నికరంగా 821మందిని, పూర్తిఏడాదిలో 22,600 మందిని జమ చేసుకుంది.
► మొత్తం సిబ్బంది సంఖ్య 6,14,795ను తాకింది. దీనిలో మహిళల వాటా 35.7 శాతం.
► ఉద్యోగ వలసల రేటు 20.1%గా నమోదైంది.
► ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) 40,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించనుంది.
ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం బలపడి రూ. 3,246 వద్ద ముగిసింది.
మరోసారి పటిష్ట ఫలితాలు ప్రకటించినందుకు సంతృప్తిగా ఉన్నాం. మా సర్వీసులకున్న డిమాండును ఆర్డర్‌బుక్ ప్రతిఫలిస్తోంది. రిటైల్, కన్జూమర్, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ విభాగాలు 13–12 శాతం వృద్ధిని సాధించాయి. బీఎఫ్‌ఎస్‌ఐ 9 శాతంపైగా పుంజుకుంది.
– రాజేష్ గోపీనాథన్, సీఈవో, టీసీఎస్
Comments
Please login to add a commentAdd a comment