సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం టీసీఎస్ గతేడాది చివరి క్వార్టర్‌లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం దాదాపు 15 శాతం ఎగసి రూ. 9,246 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 8,049 కోట్లు నమోదైంది. మొత్తం ఆదాయం 9.4 శాతం పెరిగి రూ. 43,705 కోట్లకు చేరింది. గత క్యూ4లో రూ. 39,946 కోట్ల టర్నోవర్ సాధించింది. వాటాదారులకు షేరుకి రూ. 15 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది.
పూర్తి ఏడాదికి
మార్చితో ముగిసిన పూర్తి ఏడాది(2020–21)లో టీసీఎస్ నికర లాభం రూ. 32,340 కోట్ల నుంచి రూ. 33,388 కోట్లకు బలపడింది. ఇది న్యాయపరమైన క్లెయిముల ప్రొవిజన్లు మినహాయించి ప్రకటించిన నికర లాభంకాగా.. నికరంగా చూస్తే రూ. 32,430 కోట్లు ఆర్జించింది. ఎపిక్ సిస్టమ్స్ కార్పొరేషన్‌కు సంబంధించిన న్యాయవివాదానికి కంపెనీ రూ. 1,218 కోట్లు(16.5 కోట్ల డాలర్లు) కేటాయించింది. ఇక మొత్తం ఆదాయం 4.6 శాతం పుంజుకుని రూ. 1,64,717 కోట్లయ్యింది. అంతక్రితం ఏడాది రూ. 1,56,949 కోట్ల టర్నోవర్‌ను సాధించింది.
ఆర్డర్‌బుక్ జోరు
క్యూ4లో ఆర్డర్‌బుక్ 9.2 బిలియన్ డాలర్లకు చేరినట్లు టీసీఎస్ వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలో ఒక త్రైమాసికంలోనే అత్యధికంకాగా.. 2021 మార్చికల్లా మొత్తం ఆర్డర్ బుక్ విలువ 17.1 శాతం వృద్ధితో 31.6 బిలియన్ డాలర్లను తాకినట్లు తెలియజేసింది. క్యూ4లో కొత్తగా 19,388 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 4,88,649కు చేరింది. ఐటీ సర్వీసులలో వలసల రేటు 7.2 శాతంగా నమోదైనట్లు టీసీఎస్ తెలియజేసింది.
కోవిడ్–19..
గత మూడు త్రైమాసికాలుగా కోవిడ్–19 నేపథ్యంలోనూ పటిష్ట ఫలితాలను సాధించడం ద్వారా గత ఆర్థిక సంవత్సరాన్ని ప్రోత్సాహకరంగా ముగించినట్లు టీసీఎస్ సీఎఫ్‌వో వి.రామకృష్ణన్ పేర్కొన్నారు. మెగా డీల్స్, పరిశ్రమను మించిన వృద్ధి, సిబ్బంది, కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు తదితరాలకు క్యూ4లో సాధించిన మార్జిన్లు విలువను చేకూర్చినట్లు వ్యాఖ్యానించారు.
కంపెనీ మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 3,250 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,338 వద్ద గరిష్టాన్ని, రూ. 3,213 వద్ద కనిష్టాన్ని తాకింది.
కొత్త ఏడాదిలోనూ..
గత దశాబ్దంలో కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు, పరిశోధన, నవీకరణ వంటి అంశాలు భవిష్యత్‌లోనూ సాంకేతిక సేవలలో భారీ అవకాశాలకు దారి చూపనున్నాయి. వృద్ధి, ట్రాన్స్‌ఫార్మేషన్‌లలో మరింత వాటాను సాధించనున్నాం. కొత్త ఏడాది(2021–22)లో క్లయింట్ల పురోగతి ప్రణాళికలకు సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతికతల ద్వారా మద్దతివ్వడంలో దృష్టిపెట్టనున్నాం. – టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపీనాథన్
Comments
Please login to add a commentAdd a comment