ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కేక పెట్టించాయి. సాధారణంగా ఐటీ కంపెనీలకు డిసెంబర్ క్వార్టర్ బలహీనంగా ఉంటుంది. దీనికి తోడు కరోనా కల్లోలం ప్రభావం కొనసాగుతున్నా, టీసీఎస్ క్యూ3 ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించి పోయాయి. గత తొమ్మిదేళ్లలో ఇవే అత్యుత్తుమ క్యూ3 ఫలితాలని కంపెనీ పేర్కొంది. ఆధ్వాన పరిస్థితులు అంతమయ్యాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రెండంకెల వృద్ధిని సాధించగలమని కంపెనీ పేర్కొంది.
రూ.8,701 కోట్ల నికర లాభం....
టీసీఎస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో 7 శాతం వృద్ధితో రూ.8,701 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) ఇదే క్వార్టర్‌లో నికర లాభం రూ.8,118 కోట్లుగా ఉంది. సీక్వెన్షియల్‌గా చూస్తే 16 శాతం వృద్ధి సాధించింది. ఇక ఆదాయం రూ.39,854 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.42,015 కోట్లకు పెరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన కూడా 5 శాతం వృద్ధిని సాధించింది. ఇక డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం సీక్వెన్షియల్‌గా 5 శాతం వృద్ధితో 57,020 డాలర్లకు పెరిగింది.
రూ. 6 మధ్యంతర డివిడెండ్...: ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.6 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి రికార్డ్ డేట్ ఈ నెల 16. వచ్చే నెల 3న చెల్లింపులు జరుగుతాయి. నిర్వహణ లాభం 6 శాతం వృద్ధితో (సీక్వెన్షియల్‌గా) రూ.11,184 కోట్లకు పెరిగింది. ఈ క్యూ2లో 26.2 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్ ఈ క్యూ3లో 26.6 శాతానికి పెరిగింది. ఉద్యోగులకు వేతనాలు పెంచినప్పటికీ, గత ఐదేళ్లలోనే అత్యధిక నిర్వహణ లాభ మార్జిన్‌ను ఈ క్యూ3లోనే సాధించింది. నికర మార్జిన్ 20.7 శాతంగా ఉంది. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి కంపెనీ వద్ద రూ.65,000 కోట్ల నగదు నిల్వలున్నాయి.
అన్ని విభాగాలూ జోరుగానే....
అన్ని విభాగాల్లో పటిష్టమైన వృద్ధిని సాధించామని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి. రామకృష్ణన్ చెప్పారు. ఈ క్యూ3లో కొత్తగా 15,721 మందికి ఉద్యోగాలిచ్చామని, గత ఏడాది డిసెంబర్ నాటికి కంపెనీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.69 లక్షలకు పెరిగిందన్నారు. ఆట్రిషన్ రేటు(ఉద్యోగుల వలస) జీవిత కాల కనిష్ట స్థాయి....7.6 శాతానికి తగ్గిపోయిందని తెలిపారు. ప్రస్తుతం 3.4 శాతం మంది మాత్రమే ఆఫీసులకు వచ్చి పనిచేస్తున్నారు. మిగిలిన వాళ్లంతా వర్క్ ఫ్రమ్ హోమ్ వినియోగించుకుంటున్నారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత, రెండు నెలల పిదప వర్క్ ఫ్రమ్ హోమ్ విషయమై సమీక్ష జరుపుతారు.
ఆల్‌టైమ్ హైకి టీసీఎస్...
మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై ఆశావహ అంచనాలతో ఇటీవలి కాలంలో ఈ షేర్ జోరుగా పెరుగుతోంది. ఇంట్రాడేలో రూ.3,128 వద్ద ఆల్‌టైమ్ హైను తాకిన ఈ షేర్ చివరకు 3 శాతం లాభంతో రూ.3,120 వద్ద ముగిసింది. గత ఏడాది ఈ షేర్ 32 శాతం లాభపడింది.
ఆశావహంగా కొత్త ఏడాదిలోకి
సీజనల్ సమస్యలున్నా ఈ క్యూ3లో అత్యుత్తమ ఆర్థిక ఫలితాలు సాధించాం. కీలకమైన ట్రాన్స్‌ఫార్మేషన్ సర్వీసులకు డిమాండ్ పెరగడం, గతంలో కుదుర్చుకున్న భారీ డీల్స్ సాకారం కావడం దీనికి ప్రధాన కారణాలు. కొత్త ఏడాదిలోకి ఆశావహంగా అడుగిడుతున్నాం. గతంలో కంటే మార్కెట్ స్థితి మరింతగా పటిష్టమయింది. డీల్స్, ఆర్డర్లు మరింతగా పెరగడంతో మా విశ్వాసం మరింతగా పెరిగింది. క్లౌడ్ సర్వీసెస్, అనలిటిక్స్ అండ్ ఇన్‌సైట్స్, కాగ్నిటివ్ బిజినెస్ ఆపరేషన్స్, ఐఓటీ, క్వాలిటీ ఇంజినీరింగ్‌అండ్ ట్రాన్స్ ఫార్మేషన్ ప్లాట్‌ఫార్మ్ సర్వీసెస్‌ల కారణంగా మంచి వృద్ధిని సాధించాం.
–రాజేశ్ గోపీనాథన్, సీఈఓ, టీసీఎస్
టీసీఎస్.. భేష్!
Published Sat, Jan 9 2021 5:32 AM | Last Updated on Sat, Jan 9 2021 5:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment