టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ
బార్సిలోనా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో 7 బిలియన్ డాలర్ల ఆదాయం(రన్ రేటు)ను అందుకోగలమని ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తాజాగా అభిప్రాయపడ్డారు. దీనిలో టెలికం విభాగం నుంచి 3 బిలియన్ డాలర్లు సమకూరగలదని అంచనా వేశారు. టెలికం కంపెనీలకు అందించే 5జీ సొల్యూషన్ల నుంచి ఇప్పటికే బిలియన్ డాలర్ల(రూ. 8,300 కోట్లు) రన్ రేటును సాధించినట్లు వెల్లడించారు. 6.6 బిలియన్ డాలర్ల రన్ రేటును అందుకున్న తాము త్వరలోనే 7 బిలియన్ డాలర్ల(సుమారురూ. 58,000 కోట్లు)కు చేరుకోగలమని తెలియజేశారు. ఇక్కడ జరుగుతున్న 2023 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా గుర్నానీ ఈ వివరాలు వెల్లడించారు.
లాభం డౌన్
ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో టెక్ మహీంద్రా కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం నీరసించి రూ. 1,297 కోట్లకు పరిమితమైంది. అయితే ఆదాయం మాత్రం 20 శాతం ఎగసి రూ. 13,735 కోట్లకు చేరింది. అమెరికా ప్రాంతాల నుంచే ఆదాయంలో 50 శాతం లభిస్తున్నట్లు కంపెనీ సీఎంఈ బిజినెస్ ప్రెసిడెంట్, నెట్‌వర్క్ సర్వీసుల సీఈవో మనీష్ వ్యాస్ తెలియజేశారు. యూరప్ నుంచి 30 శాతం, మిగిలిన ప్రపంచ దేశాల నుంచి 20 శాతం చొప్పున టర్నోవర్ నమోదవుతున్నట్లు వివరించారు. ఆయా ప్రాంతాలలో పెట్టుబడులు చేపడుతున్న నేపథ్యంలో ఈ ట్రెండ్ కొనసాగనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఫైబర్, ఫిక్స్‌డ్ వైర్‌లెస్.. తదితర టెలికం సంబంధ అన్ని విభాగాలలోనూ వృద్ధి నమోదుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు అనిశ్చితికి కారణమవుతున్నట్లు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment