Telangana Govt Plans For RRTS Corridor For Hyderabad To Warangal, Details Inside In Telugu - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ టూ వరంగల్‌.. రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌..

Published Mon, Feb 21 2022 2:54 PM | Last Updated on Mon, Feb 21 2022 4:16 PM

Telangana Plans RRTS Corridor to Link Warangal And Hyderabad - Sakshi

నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ పరిధిలో ఉన్న రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఆర్‌ఆర్‌టీఎస్‌) రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలి దశలో హైదరాబాద్‌ - వరంగల్‌, మలి దశలో హైదరాబాద్‌ - విజయవాడల మధ్య ఈ ట్రాన్సిట్‌ కనెక్టివిటీ అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం ఢిల్లీ- ఘజియాబాద్‌ - మీరట్‌ మార్గంలో రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ (ఆర్‌ఆర్‌టీఎస్‌) నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఆర్‌ఆర్‌టీఎస్‌ విధానం రెగ్యులర్‌ రైల్వే నెట్‌వర్క్‌, సబర్బన్‌ మెట్రో రైల్‌లకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రెండు నగరాల మధ్య వేగంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రత్యేక ట్రాక్‌లను, నియంత్రణ వ్యవస్థలను నిర్మిస్తారు. ఈ మార్గంలో రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది

ప్రస్తుతం నేషనల్ క్యాపిటల్‌ రీజియన్‌ పరిధిలో ఢిల్లీ నుంచి హర్యాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌లలో పలు నగరాలను కలుపుతూ మూడు కారిడార్లలో ఆర్‌ఆర్‌టీఎస్‌ పనులు సాగుతున్నాయి. ఈ మేరకు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ట్రాన్సిట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు ఈ ప్రాజెక్టుకి నిధులు సమకూరుస్తున్నాయి. ఇదే పద్దతిలో తెలంగాణలోనూ ఆర్‌ఆర్‌టీఎస్‌ను చేపట్టాలని ఇక్కడి సర్కార్‌ నిర్ణయించింది.

ఆర్‌ఆర్‌టీఎస్‌ నెట్‌వర్క్‌పై చర్చించేందుకు తెలంగాణకు చెందిన వివిధ విభాగాల అధికారులు ఆర్‌ఆర్‌టీఎస్‌కి సంబంధించి అంచనా వ్యయం, వనరుల లభ్యత తదితర అంశాలపై పూర్తి వివరాలను అధ్యయనం చేయనున్నారు. ఈ మేరకు త్వరలో అధికారుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్టు సమాచారం. వీరు సమర్పించే నివేదిక ఆధారంగా ఈ ప్రాజెక్టు చేపట్టాలా వద్దా అనేది తేలనుంది

దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్స్‌ పార్క్‌ని వరంగల్‌లో ప్రారంభించారు. వివిధ దేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడ తమ యూనిట్లను నిర్మిస్తున్నాయి. అయితే వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్‌ లేకపోవడం లోటుగా మారింది. ఎయిర్‌పోర్ట్‌ పునరుద్ధరణకు తెలంగాణ సర్కార్‌ ఓ వైపు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరోవైపు ఆర్‌ఆర్‌టీఎస్‌ వంటి నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ - వరంగల్‌ల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. పారిశ్రామికంగా వరంగల్‌కు ఇది ఎంతో ఉపయోగకరం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement