ఆకాశం మస్క్‌ హద్దురా! | Tesla Chief Elon Musk Is Now 2nd Richest In World | Sakshi
Sakshi News home page

ఆకాశం మస్క్‌ హద్దురా!

Published Wed, Nov 25 2020 4:54 AM | Last Updated on Wed, Nov 25 2020 8:13 AM

Tesla Chief Elon Musk Is Now 2nd Richest In World - Sakshi

న్యూఢిల్లీ: ‘స్పేస్‌ఎక్స్‌’ రాకెట్‌ ఒకపక్క అంతరిక్ష యాత్రల్లో సంచలనాలు నమోదుచేస్తుంటే... దాన్ని సృష్టించిన ఎలాన్‌ మస్క్‌ సంపద కూడా ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది! ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ తాజాగా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ను అధిగమించారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం సుమారు 128 బిలియన్‌ డాలర్ల సంపదతో రెండో స్థానానికి ఎగబాకారు. సోమవారం టెస్లా షేరు ధర ఎగియడంతో ఒకే రోజున ఆయన నికర విలువ 7.2 బిలియన్‌ డాలర్లు పెరిగింది.

ఈ ఏడాది ఇప్పటిదాకా ఆయన సంపద 100.3 బిలియన్‌ డాలర్ల మేర ఎగిసింది. దీనితో ఈ సంవత్సరం జనవరిలో 35వ స్థానంలో ఉన్న మస్క్‌ ప్రస్తుతం రెండో స్థానానికి దూసుకొచ్చారు. టెస్లా మార్కెట్‌ విలువ దాదాపు 500 బిలియన్‌ డాలర్ల దరిదాపుల్లో ఉంది. మస్క్‌ సంపదలో సింహభాగం టెస్లాలో ఆయనకున్న షేర్ల ద్వారా వచ్చినదే. టెస్లాతో పాటు స్పేస్‌ఎక్స్‌ పేరిట అంతరిక్ష ప్రయోగాల సంస్థ కూడా మస్క్‌కి ఉంది. కంపెనీల షేర్ల ధరల రోజువారీ మార్పుల ప్రకారం వాటి అధినేతల సంపదను లెక్కించడం ద్వారా బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ర్యాంకులు ఇస్తుంది. ఈ ఏడాది కరోనా మహమ్మారి ప్రతికూల ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉన్నప్పటికీ.. సంపన్నుల సంపద మాత్రం భారీగానే పెరిగింది. సంవత్సరం ప్రారంభమైనప్పట్నుంచీ చూస్తే బ్లూమ్‌బర్గ్‌ సూచీలోని సభ్యుల సంపద విలువ 23 శాతం (సుమారు 1.3 ట్రిలియన్‌ డాలర్లు) ఎగిసింది. 

టాప్‌లో అమెజాన్‌ బెజోస్‌ 
బ్లూమ్‌బర్గ్‌ సూచీలో ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు, ఈ సూచీ ప్రారంభించిన ఎనిమిదేళ్లలో గేట్స్‌ రెండో స్థానానికన్నా కిందకి పడిపోవడం ఇది రెండోసారి. 2017లో అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ అగ్రస్థానాన్ని దక్కించుకునే దాకా ఆయనే టాప్‌లో కొనసాగారు. సూచీ తాజా గణాంకాల ప్రకారం గేట్స్‌ సంపద విలువ సుమారు 127.7 బిలియన్‌ డాలర్లు. సేవా కార్యకలాపాలకు విరాళాలు గానీ ఇవ్వకుండా ఉండి ఉంటే ఇది మరింత ఎక్కువే ఉండేదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. 2006 నుంచి ఆయన దాదాపు 27 బిలియన్‌ డాలర్లు విరాళాలిచ్చారు.  

టాప్‌–100 అపర కుబేరుల్లో భారత్‌ నుంచి నలుగురు...
ఇక తాజా బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీలోని టాప్‌ 10 సంపన్నుల్లో దేశీ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చోటు దక్కించుకున్నారు. 74 బిలియన్‌ డాలర్ల సంపదతో ఆయన 10వ స్థానంలో నిల్చారు. భారత్‌ నుంచి టాప్‌ 100లో మరో ముగ్గురు దిగ్గజాలు చోటు దక్కించుకున్నారు. అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ 40వ ర్యాంకులో (32.1 బిలియన్‌ డాలర్లు), విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ 56వ స్థానంలో (23.4 బిలియన్‌ డాలర్లు), హెచ్‌సీఎల్‌ చీఫ్‌ శివ్‌ నాడార్‌ 71వ ర్యాంకులో (21.4 బిలియన్‌ డాలర్లు) నిలిచారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement