
యాభై ఏళ్ల క్రితం మిలియనీర్ అంటే మహాగొప్ప. ఇప్పుడు బిలియనీర్లు కూడా వందల సంఖ్యలో వచ్చేశారు. కానీ ఇప్పటి వరకు వ్యక్తిగత ఆస్తుల్లో ట్రిలియనీర్ అయిన వ్యక్తి లేరు. కానీ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలిస్తే అతి త్వరలో ఓ వ్యక్తి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఉందని తిపాల్టీ అప్రూవ్ సంస్థ తేల్చి చెబుతోంది.
ప్రస్తుతం ప్రపంచంలో నంబర్ వన్ కుబేరిగా ఎలన్ మస్క్ కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ పత్రిక అంచనాల ప్రకారం ఆయన సంపద 260 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయన తర్వాతి స్థానంలో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బేజోస్ 190 బిలియన్ డాలర్లతో ఉన్నాడు. మొదటి రెండు స్థానాల మధ్య సుమారు 70 బిలియన్ డాలర్ల వత్యాసం ఉంది.
జెఫ్ బేజోస్‌కి అందనంత ఎత్తులో ఉండటమే కాదు లాభాలు అందిపుచ్చుకోవడంలోనూ ఎలన్ మస్క్ దూకుడుగా ఉన్నారు. 2017 నుంచి ప్రతీ ఏడు ఎలన్ మస్క్ సంపద వృద్ధి 127 శాతంగా ఉంది. పైగా టెస్లా కార్లకు తోడు స్పేస్‌ఎక్స్ సంస్థ నుంచి కూడా అతి త్వరలోనే లాభాలు అందుకోనున్నాడు ఎలన్ మస్క్. ఈ రెండు సంస్థలు కనుకు అంచనాలకు తగ్గట్టుగా లాభాలు అందిస్తే 2024 నాటికి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు ఎలన్ మస్క్.
ఎలన్ మస్క్ తర్వాత ప్రపంచ కుబేరుడు అయ్యే ఛాన్స్ ఉన్న వ్యక్తిగా ఝాంగ్ యామింగ్ ఉన్నారు. టిక్‌టాక్ అండతో ఆయన వేగంగా దూసుకువస్తున్నారు. ప్రస్తుతం టిక్‌టాక్ సాధిస్తున్న వృద్ధి ఇదే తీరుగా కొనసాగితే 2026 కల్లా ఝాంగ్‌యామింగ్ రెండో ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఉందని అంచనా. ట్రిలియనీర్ అయ్యే నాటికి ఝాంగ్ యామింగ్ వయస్సు కేవలం 42 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం.
ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న జెఫ్ బేజోస్ ట్రిలియనీర్ అయ్యేందుకు 2030 వరకు వేచి ఉండక తప్పదంటున్నాయి నివేదికలు. ఈ కామర్స్ రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీ జెఫ్ బేజోస్ సంపదకు కోత పెడుతుండటమే ఇందుకు కారణం. అయితే ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం తారాస్థాయిలో కొనసాగుతోంది. దీని ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటే ప్రస్తుత అంచనాలు తారుమారు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.