సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ప్రాపర్టీ షో నిరుత్సాహంగా మొదలైంది. ఇప్పటివరకు ట్రెడా 10 ప్రాపర్టీ షోలు జరిగాయి. ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఓ సినీ నటుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రాపర్టీ షోను ప్రారంభించారు. సాధారణం గా ఏ డెవలపర్ల సంఘం ప్రాప ర్టీ షో నిర్వహించినా నిర్మాణ రంగానికి సంబంధించిన మంత్రులనో లేదా ప్రభుత్వ అధికారులనో ముఖ్య అతిథిగా హాజరవటం ఆనవాయితీ. కానీ, ట్రెడా ఈ ఆనవాయితీని పాటించలేదు. సదరు నిర్వాహకులు ప్రభుత్వాధికారులు లేదా రాజకీయ నేతలను ముఖ్య అతిథిగా ఆహ్వానించగా.. ఎవరూ సరిగా స్పందించలేదని ట్రెడా సభ్యుడు ఒకరు తెలిపారు.
నిర్మాణ సంస్థలు, బ్యాంక్‌లు కలిపి మొత్తం 105 స్టాల్స్‌ను ఏర్పాటు చేయగా.. ఇందులో 20–25 కంపెనీలు మినహా మిగిలిన స్టాల్స్ అన్నీ చిన్నా చితక నిర్మాణ సంస్థలకు చెందినవే. ఎక్కువగా ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన స్టాల్సే. చాలా వరకు స్టాళ్లు ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చాయి. ప్రతి ఏటా అక్టోబర్–నవంబర్ మధ్య కాలంలో ట్రెడా ప్రాపర్టీ షో నిర్వహించాలి కాబట్టి ఏదో మొక్కుబడిగా నిర్వహించినట్లు కనిపించింది. తొలి రోజు పైగా వర్కింగ్ డే కాబట్టి పెద్దగా సందర్శకులు రాలేదని.. శని, ఆది వారాలు సెలవు రోజులు కావటంతో సందర్శకులు వచ్చే అవకాశం ఉందని ఓ స్టాల్ నిర్వాహకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రదర్శనలో అనుమతులు లేని ప్రాజెక్ట్‌లు కూడా..
నిర్మాణ అనుమతులు రాని ప్రాజెక్ట్‌లు, భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన కరపత్రాలు, హోల్డింగ్స్ ప్రదర్శిస్తూ ట్రెడా ప్రాపర్టీ షోలో స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. రెరా నిబంధనల ప్రకారం రెరా అనుమతి తీసుకోకుండా ప్రాజెక్ట్‌లను ప్రకటనలు చేయడం, ప్రదర్శించడం నేరం. కానీ నిర్వాహకులు ఇవేవి పట్టించుకోలేదు. పైగా ఆయా స్టాళ్ల వద్దకు వచ్చిన సందర్శకులతో ‘త్వరలోనే ప్రాజెక్ట్‌ను లాంచింగ్ చేయనున్నాం. ఇప్పుడే కొనుగోలు చేస్తే ధర తక్కువకు వస్తుందని ప్రీలాంచ్‌లో బుకింగ్ చేసుకోండని’ సదరు నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ నిర్వాహకులు చెబుతున్నారు. యూడీఎస్ విధానంలో ఫ్లాట్లను విక్రయిస్తున్న ఓ కంపెనీ ఏకంగా స్పాన్సర్లలో ఒకటిగా నిలిచింది. సందర్శకులను ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా స్టాల్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment