ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది అంటుంటారు.. కానీ టక్కర్ బడ్జిన్ అనే ఈ కుక్కకు సంవత్సరమంతా దానిదే.. ఎందుకంటే సంవత్సరంలో ఇది సంపాదించిన మొత్తం ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు.
అమెరికాలోని మిచిగాన్‌లో టక్కర్ బడ్జిన్ అనే కుక్క మిలియన్ డాలర్ల సంపాదనతో సోషల్ మీడియా టాప్ డాగ్‌గా ఉద్భవించింది. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్‌బుక్, టిక్‌టాక్, యూట్యూబ్.. ఒక్కటేమిటి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోనూ ఈ కుక్కకు పేజీలు ఉన్నాయి. మిలియన్లకొద్దీ ఫాలోవర్లు ఉన్నారు.
ప్రింటెడ్ పెట్ మెమోరీస్ అనే సంస్థ నిర్వహించిన పరిశోధన ప్రకారం.. టక్కర్ అనే ఈ ఐదేళ్ల కుక్క.. రెండు ఏళ్ల వయసు నుంచే సంపాదించడం మొదలు పెట్టింది. తన సోషల్ మీడియా పేజీల్లో ప్రకటనలు, పెయిడ్ పోస్ట్‌లు, ఇతర మార్గాల ద్వారా ఒక మిలియన్ యూఎస్ డాలర్లు (రూ.8 కోట్లకుపైనే) సంపాదించగలిగింది.
ఈ కుక్కను పెంచుతున్న కోర్ట్నీ బడ్జిన్ అది సోషల్ మీడియా ద్వారా ఎంత సంపాదిస్తోందో వివరించారు. యూట్యూబ్ పెయిడ్ పోస్ట్‌కు గానూ 30 నిమిషాల ప్రీ-రోల్ కోసం 40,000 నుంచి 60,000 డాలర్లు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే 3 నుంచి 8 కథనాలకు దాదాపు 20,000 డాలర్లు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కుక్కను చూసుకునేందుకు కోర్ట్నీ, ఆమె భర్త మైక్ ఇద్దరూ వారి ఉద్యోగాలను విడిచిపెట్టారు. టక్కర్, దాని పిల్ల టాడ్‌ను చూసుకునేందుకే అంకితమయ్యారు. 2018లో కేవలం ఎనిమిది వారాల వయసున్న ఆ కుక్కను ఇంటికి తీసుకువచ్చిన రోజున కోర్ట్నీ దాని కోసం ఇన్‌స్టాగ్రామ్ పేజీని సృష్టించడంతో టక్కర్ స్టార్‌డమ్ మొదలైంది. తర్వాతి నెలలో టక్కర్ మొదటి వీడియో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం టక్కర్‌కు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో దాదాపు 25 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. టిక్‌టాక్‌లో 11.1 మిలియన్లు, యూట్యూబ్‌లో 5.1 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 4.3 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.4 మిలియన్లు, ట్విటర్‌లో 62,400 మంది ఫాలోవర్లను ఈ కుక్క సంపాదించుకుంది.
ఇదీ చదవండి: Tax Exemption: పన్ను మినహాయింపు.. లీవ్ ఇన్‌క్యాష్‌మెంట్‌పై ఆర్థిక శాఖ కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment