భారతదేశంలో పండుగ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది, అయితే ఇప్పటికే అనేక కంపెనీలు ఆధునిక మోడల్స్ (కార్లు & బైకులు) విడుదల చేశాయి. రానున్న రోజుల్లో మరిన్ని కార్లు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో టాటా పంచ్ ఈవీ, ఫోర్స్ గూర్ఖా 5-డోర్, హోండా ఎలివేట్ మొదలైన మోడల్స్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
టాటా పంచ్ ఈవీ (Tata Punch EV)
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఇప్పటికే ఉత్తమ అమ్మకాలు పొందుతున్న టాటా పంచ్ మైక్రో ఎస్‌యువిని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ సమయంలో అనేక సందర్భాల్లో కనిపించింది. కావున ఇది 2023 సెప్టెంబర్ నాటికి భారతీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది చూడటానికి స్టాండర్డ్ మోడల్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది.
ఫోర్స్ గూర్ఖా 5-డోర్ (Force Gurkha 5 Door)
అత్యంత శక్తివంతమైన ఆఫ్ రోడర్ ఫోర్స్ గూర్ఖా కూడా త్వరలో 5 డోర్స్ వెర్షన్‌లో విడుదలకావడానికి సిద్ధంగా ఉంది. కేరళ మార్కెట్లో విపరీతమైన అమ్మకాలు పొందిన ఈ SUV మరిన్ని ఆధునిక హంగులతో విడుదలైతే తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని తెలుస్తోంది. ఇది 5 డోర్ మోడల్ కాబట్టి సీటింగ్ కాన్ఫిగరేషన్ మారుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
హోండా ఎలివేట్ (Honda Elevate)
2023 సెప్టెంబర్ నాటికి దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ కారు మిడ్ సైజ్ విభాగంలో మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది మన దేశంలో విడుదలైన తరువాత హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.
(ఇదీ చదవండి: మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 మొబైల్స్!)
టాటా ఆల్ట్రోజ్ రేసర్ (Tata Altroz Racer)
2023 ఆటో ఎక్స్‌పో వేదికపై కనిపించిన టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి అధికారికంగా మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇది హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ హ్యాచ్‌బ్యాక్ ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు 1.2 లీటర్ త్రీ సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందిస్తుందని భావిస్తున్నారు.
(ఇదీ చదవండి: భారత్‌లో ఎక్కువ జీతం వారికే.. సర్వేలో హైదరాబాద్ ఎక్కడుందంటే?)
టయోటా రూమియన్ (Toyota Rumion)
ఎమ్‌పివి విభాగంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి మాత్రమే కాకుండా వినియోగదారుల కోసం టయోటా కొత్త 'రూమియన్' విడుదల చేయనుంది. మారుతి ఎర్టిగా బేస్డ్ రూమియన్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 2021 ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో విడుదలైన ఈ కారు 2023 సెప్టెంబర్ నాటికి భారతీయ గడ్డపై అడుగుపెట్టనుంది. దీని కోసం కంపెనీ ట్రేడ్‌మార్క్‌ను కూడా దాఖలు చేసింది.
ఇవి మాత్రమే కాకుండా మార్కెట్లో విడుదలకావడానికి హ్యుందాయ్ ఐ20 పేస్‌లిఫ్ట్ (2023 నవంబర్), ఫోక్స్‌వ్యాగన్ పోలో (2023 నవంబర్), ఎంజి 3 (MG 3) హ్యాచ్‌బ్యాక్ కూడా విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment