
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఫార్మా రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ దిగ్గజ ఫార్మా కంపెనీ తన జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)ని ప్రారంభించింది. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన ‘ఆమ్‌జెన్’ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో తన కార్యకలాపాలను ప్రారంభించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఈ కేంద్రాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆమ్‌జెన్ సీఈవో రాబర్ట్ బ్రాడ్‌వే, ఆమ్‌జెన్ ఇండియా ఉన్నతాధికారి నవీన్ గుళ్లపల్లి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జీవశాస్త్ర రంగం, బయోటెక్నాలజీ, ఫారా, డేటాసైన్స్, కృత్రిమ మేథ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆమ్‌జెన్ లాంటి కంపెనీలు ఇక్కడ తమ జీసీసీలను ఏర్పాటు చేయడం ఎంతైనా ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు.

‘‘రోగుల జీవితాల్లో మెరుగైన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఆమ్‌జెన్‌కు స్వాగతం. బయోటెక్ హబ్‌గా హైదరాబాద్ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఆమ్‌జెన్ లాంటి కంపెనీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఏడాది క్రితం ఆమ్‌జెన్‌తో తొలిసారి మాట్లాడామని, ఆ తరువాత అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆమ్‌జెన్ కేంద్రాన్ని సందర్శించిన తరువాత హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుకు అంగీకరించారని ముఖ్యమంత్రి వివరించారు. ఆమ్‌జెన్ లాంటి కంపెనీలు తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, తెలంగాణ స్థూల జాతీయోత్పత్తిని లక్ష కోట్ల డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
అంతకుమునుపు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఆమ్‌జెన్ జీసీసీ కేంద్రం ఏర్పాటు ఉద్యోగావకాశాలు కల్పించడానికి మాత్రమే పరిమితం కారాదని, ఆకాంక్షించారు. హైదరాబాద్ పరిసరాల్లోని పరిశోధన సంస్థలు, యూనివర్శిటీలతో కలిసి సంయుక్తంగా పరిశోధనలు, ప్రాజెక్టులు చేపట్టాలని ముఖ్యమంత్రి కోరారు.

‘‘ఆమ్‌జెన్ లాంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ జీసీసీలు ఏర్పాటు చేస్తూండటం తెలంగాణ సామర్థ్యాన్ని మరింత పెంచేది.. మరిన్ని అవకాశాలను కల్పించేది. అలాగే బయోటెక్, టెక్నాలజీ రంగాలు రెండింటిలోనూ అత్యద్భుత ఆవిష్కరణలకు వీలు కల్పించేది’’ అని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
అంతర్జాతీయ కంపెనీలకు అనువైన సిబ్బందిని తయారు చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ద్వారా రేపటి తరం ఫార్మా ఉద్యోగుల తయారీకి తగిన శిక్షణ కార్యక్రమాలను తయారు చేసి అమలు చేయాలని కోరారు. ప్రస్తుత ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను అందించడం, అప్‌స్కిల్లింగ్ కూడా చేపట్టాలని సూచించారు. ఆమ్‌జెన్ పెద్ద ఎత్తున చేపట్టిన పరిశోధనలు వ్యక్తిగత వైద్యాన్ని మనిషికి మరింత దగ్గర చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

‘‘తెలంగాణ అభివృద్ధి ఆకాంక్షలకు ఆమ్‌జెన్ ఇండియా ఒక నిదర్శనం. అలాగే ప్రపంచ స్థాయిలో ఆరోగ్య పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నాల దిశగా పడిన మరో ముందడుగు. భారత్‌లోని ప్రపంచస్థాయి బయోటెక్ ఎకోసిస్టమ్‌కు మా వంతు తోడ్పాటు అందించేందుకు మేము సిద్ధం. అలాగే భారత నైపుణ్యానికీ స్వాగతం పలుకుతున్నాం.’’ అని ఆమ్‌జెన్ ఇండియా నేషనల్ ఎగ్జిక్యూటివ్ సోమ్ ఛటోపాధ్యాయ అన్నారు.
200 కోట్ల పెట్టుబడి..
ఆమ్‌జెన్ హైదరాబాద్ జీసీసీ కోసం 200 కోట్ల పెట్టుబడి పెడుతున్నామని.. రానున్న రోజుల్లో ఈ మొత్తం మరింత పెరుగుతుందని కంపెనీ ఛైర్మన్, సీఈవో రాబర్ట్ బ్రాడ్‌వే తెలిపారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 300 మంది పని చేస్తూండగా.. మరో 300 మంది చేరబోతున్నారని, ఈ ఏడాది చివరికల్లా ఉద్యోగుల సంఖ్య రెండు వేలకుపైబడి ఉంటుందని ఆయన వివరించారు.
1980లో దక్షిణ కాలిఫోర్నియాలో ప్రారంభమైన ఆమ్‌జెన్ ప్రస్తుతం వంద దేశాలకు విస్తరించింది, మొత్తం 28 వేల మంది ఇందులో పని చేస్తున్నారని రాబర్ట్ తెలిపారు. బయోటెక్‌తోపాటు అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీలు, ఏఐల సాయంతో ఎన్నో వ్యాధులకు మెరుగైన మందులను సృష్టించి తయార చేశామని, సుమారు 36 ఉత్పత్తులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని అన్నారు. తాజాగా అరుదైన వ్యాధులకు మందులు కనుక్కునే ప్రయత్నాలూ మొదలుపెట్టామని, హైదరాబాద్ కేంద్రం ఇందుకు ఎంతో ఉపయోగపడనుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment