వాషింగ్టన్: ముందస్తు సంకేతాలను నిజం చేస్తూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజాగా వడ్డీ రేటును 0.25 శాతంమేర పెంచుతున్నట్లు ప్రకటించింది. వెరసి ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల ఫెడ్.. 2018 తదుపరి మళ్లీ రేట్ల పెంపు బాట పట్టింది. రెండు రోజులపాటు నిర్వహించిన సమావేశంలో చివరికి ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) కఠిన విధానాలకే మొగ్గు చూపింది. కోవిడ్–19 ప్రభావం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఫెడ్ పాలసీ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఫెడ్ తాజా నిర్ణయంతో ఫండ్స్ రేట్లు 0.25–0.5 శాతానికి చేరాయి.
ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణ వార్షిక రేటు 40 ఏళ్ల గరిష్టం 7.9 శాతానికి చేరడం ప్రతికూల అంశంకాగా.. నిరుద్యోగిత భారీగా తగ్గి 3.8 శాతానికి పరిమితం కావడంతో రేట్ల పెంపునకు అనువైన పరిస్థితులు ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో 2.18 శాతానికి చేరిన 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ మరింత బలపడనున్నట్లు తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రతీ నెలా బాండ్ల కొనుగోలు ద్వారా వ్యవస్థలోకి భారీగా విడుదల చేస్తున్న నిధులను మార్చి నుంచి ఫెడ్ పూర్తిగా నిలిపివేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడనుండగా.. పసిడి, స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేసే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment