టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలు రెండో రోజూ యూఎస్ మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో గురువారం డోజోన్స్ 130 పాయింట్లు(0.5%) నీరసించి 27,902 వద్ద నిలిచింది. ఎస్‌అండ్‌పీ 28 పాయింట్లు(0.8%) క్షీణించి 3,357 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్ మరింత అధికంగా 140 పాయింట్లు(1.3%) నష్టంతో 10,910 వద్ద స్థిరపడింది. ధరలు పుంజుకునేటంతవరకూ నామమాత్ర వడ్డీ రేట్ల కొనసాగింపునకే కట్టుబడనున్నట్లు ఫెడరల్ రిజర్వ్ తాజా పాలసీలో స్పష్టం చేసింది. నిరుద్యోగిత తగ్గడం, కొన్నిరంగాలలో కనిపిస్తున్న డిమాండ్.. ఆర్థిక రికవరీ సంకేతాలను ఇస్తున్నట్లు అభిప్రాయపడింది. అయితే ఫెడ్.. సహాయక ప్యాకేజీల విషయాన్ని విస్మరించినట్లు ఆర్థికవేత్తలు వ్యాఖ్యానించారు. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విస్తరిస్తూనే ఉండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొన్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో బుధవారం సైతం ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్ వెనకడుగు వేయడం గమనార్హం!
టిక్‌టాక్ ఐపీవో
చైనీస్ వీడియో మేకింగ్ యాప్.. టిక్‌టాక్ పబ్లిక్ ఇష్యూ చేపట్టాలని యోచిస్తోంది. ఇందుకు వీలుగా టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇది సాకారమైతే 50 బిలియన్ డాలర్ల విలువతో టెక్నాలజీ రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలిచే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. భద్రతా కారణాలరీత్యా ప్రెసిడెంట్ ట్రంప్.. టిక్‌టాక్ కార్యకాలపాలపై నిషేధాన్ని విధించిన విషయం విదితమే. టిక్‌టాక్‌కు అమెరికాలో 10 కోట్లమంది యూజర్లుండటం విశేషం! దీంతో టిక్‌టాక్ యూఎస్ విభాగంపై ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ కార్పొరేషన్ కన్నేశాయి. ఇందుకు అనుగుణంగా టిక్‌టాక్ ప్రమోటర్ బైట్‌డ్యాన్స్‌కు సాఫ్ట్‌వేర్ భాగస్వామిగా ఒరాకిల్ ఒప్పందాన్ని కుదుర్చుకుందికూడా. కాగా.. టిక్‌టాక్ యూఎస్ బిజినెస్ కొనుగోలుకి అటు మైక్రోసాఫ్ట్, ఇటు ఒరాకిల్ కార్పొరేషన్ రేసులో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
టెక్ డీలా..
ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ టెక్ కౌంటర్లలో ఫేస్‌బుక్ 3.3 శాతం, నెట్‌ఫ్లిక్స్ 3 శాతం, అమెజాన్ 2.3 శాతం, యాపిల్ ఇంక్, అల్ఫాబెట్ 1.6 శాతం, మైక్రోసాఫ్ట్ 1 శాతం చొప్పున క్షీణించాయి. టెస్లా ఇంక్ 4.2 శాతం పతనమైంది. ద్వితీయార్థం నుంచీ టర్న్‌అరౌండ్ ఫలితాలను సాధించనున్నట్లు సీఈవో లారీ కల్ప్ పేర్కొనడంతో ఇంజినీరింగ్ దిగ్గజం జనరల్ ఎలక్ట్రిక్ 4.4 శాతం జంప్‌చేసింది. మిచిగాన్ ప్లాంటు నుంచి కొత్త తరం పికప్ ట్రక్ F-150 తయారీని ప్రారంభించినట్లు వెల్లడించడంతో ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్ 3.7 శాతం ఎగసింది. కోవిడ్-19 వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు తిరిగి ప్రారంభించిన ఆస్ట్రాజెనెకా 1.5 శాతం లాభపడింది.
Comments
Please login to add a commentAdd a comment