ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగడంతో చమురు ధరలు మండిపోతున్నాయి. ఈ మంటను చల్లార్చేందుకు అమెరికా ఆచితూచీ వ్యవహరిస్తోంది. సున్నితమైన అంశం కావడంతో రిస్క్ తీసుకునేందుకు వెనుకాడుతోంది. తాజాగా రష్యా దిగుమతుల విషయంలోనూ స్వరం తగ్గించి మాట్లాడుతోంది అమెరికా.
పది రోజులు గడిచినా ఉక్రెయిన్‌పై దాడుల విషయంలో రష్యా వెనక్కి తగ్గడం లేదు. దీంతో అమెరికాతో పాటు యూరప్‌లో ఉన్న దాని మిత్రదేశాలు రష్యాను మరింత ఒత్తిడిలోకి నెట్టేందుకు రష్యా నుంచి ముడి చమురు, దిగుమతిని నిషేధించాలని చర్చించాయి. ఈ సమావేశానికి సంబంధించిన వార్తలు బయటకి పొక్కడంతో ఒక్కసారిగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 140 డాలర్లను టచ్ చేసింది.
మరోవైపు రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ మాట్లాడుతూ.. యుద్ధ అనంతర పరిణామాలకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతూ.. రష్యా నుంచి చమురు, ఆయిల్ దిగుమతి చేసుకోకూడదని యూరప్ దేశాలు భావిస్తే .. దాని వల్ల వారికే నష్టమంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు బ్యారెల్ చమురు ధర 300 డాలర్లకు పెరగొచ్చంటూ బాంబు పేల్చారు.
క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం రష్యాకు మరో ప్రత్యామ్నాయ చమురు ఉత్పత్తి దేశం ఏదీ కనుచూపు మేరలో కనిపించకపోవడంతో అమెరికా దాని మిత్రదేశాలు పునరాలోచనలో పడ్డాయి. లిబియా, వెనుజువెలా, ఇరాన్‌లలో ఇప్పటికిప్పుడు ఉత్పత్తి పెరిగే అవకాశం లేకపోవడంతో రష్యా దిగుమతుల విషయంలో అమెరికా దూకుడు తగ్గించింది.
తాజగా వైట్‌హౌజ్ మీడియా ప్రతినిధి జేన్‌సాక్ మాట్లాడుతూ... రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ దిగుమతులపై నిషేధం విధించే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే నిషేధం అంశంపై మిత్రపక్ష దేశాలతో చర్చలు జరిగిందని తెలిపింది. రష్యా దాడులను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని చెబుతూనే చమురు దిగుమతులపై కఠిన వైఖరి తీసుకోవడానికి అమెరికా మీనమేషాలు లెక్కపెడుతోంది.
చదవండి: రష్యా బెదిరింపులు.. పెట్రోల్ రేట్లు ఊహించనంత పెరుగుతాయ్!
Comments
Please login to add a commentAdd a comment