
కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తూ, థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉన్న తరుణంలో టీకాల ఆవశ్యకత, ప్రాధాన్యం మరింతగా పెరిగింది. అందరికీ టీకాలు వేయాలని నిర్దేశించుకున్నప్పటికీ కొరత ఏర్పడుతోంది. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారి కోసం టీకాలు కొనుగోలు చేసి, వేసే భారాన్ని కేంద్రం రాష్ట్రాలపై మోపింది. ఇది సరికాదని, ప్రజలందరికీ వ్యాక్సిన్లు వేయాల్సిన అంశానికి సంబంధించి ఆర్థికపరమైన బాధ్యతలను కేంద్రమే తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ కేంద్రానికి డివిడెండుగా ఇస్తున్న నిధులను వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ చట్టం ప్రకారం మార్కెట్ లావాదేవీలు, పెట్టుబడులు మొదలైన వాటిపై వచ్చే లాభాలను కేంద్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ బదలాయిస్తుంది.
ఇదే క్రమంలో ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి రూ. 99,122 కోట్ల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదలాయించాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. మే 21న ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆర్‌బీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కేంద్రం బడ్జెట్‌లో అంచనా వేసిన రూ. 53,510 కోట్ల కన్నా ఇది దాదాపు 85 శాతం అధికం. కోవిడ్–19 వేళ ఈ నిధులు చర్చనీయాంశంగా మారాయి. 18–44 ఏళ్ల మధ్య వారికి టీకాలను కొనుగోలు చేసే బాధ్యతను రాష్ట్రాల మీద పెట్టడం వల్ల వాటిపై ఆర్థిక భారం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
డేటా జర్నలిజం సంస్థ ఇండియాస్పెండ్ అంచనాల ప్రకారం దీనివల్ల.. దేశంలోని 8 అత్యంత పేద రాష్ట్రాలు.. తమ హెల్త్ బడ్జెట్లకు కేటాయించిన నిధుల్లో ఏకంగా 30 శాతం దాకా నిధులను కేవలం కోవిడ్–19 టీకాల కొనుగోలు కోసమే వెచ్చించే పరిస్థితి ఉంటుంది. ఫలితంగా అవి మిగతా పథకాలకు కోత విధించుకోవాల్సి వస్తుంది. అలా జరగకుండా ప్రజలందరికీ సరిపడేంతగా టీకాలను కొనుగోలు చేసేంతగా కేంద్ర ప్రభుత్వానికి వనరులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంకా మిగులుతుంది ..
2021–22 ఆర్థిక సంవత్సరానికి కోవిడ్–19 వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 35,000 కోట్ల్ల నిధులను బడ్జెట్లో కేటాయించింది. మే దాకా గణాంకాలను బట్టి ఇందులో సుమారు 8.5 శాతమే వినియోగించిందని.. మరో రూ. 32,000 కోట్ల మేర నిధులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని అటుంచితే.. తాజాగా కేంద్రానికి ఆర్‌బీఐ బదలాయించే రూ. 99,122 కోట్లపై అందరి దృష్టి ఉంది. ఈ నిధుల్లో కొంత కేటాయించినా.. దేశ జనాభా మొత్తానికి కేంద్రమే ఉచిత టీకాలు వేయొచ్చని పరిశీలకులు లెక్కలు కడుతున్నారు.
కేరళ హైకోర్టు కూడా ఇదే అంశాన్ని పరిశీలించి, అభిప్రాయం చెప్పాలని ప్రభుత్వానికి సూచించింది. కేంద్ర ప్రభుత్వం రూ. 150 లేదా రూ. 250 రేటు చొప్పున టీకాలు కొన్నా.. దేశ జనాభా మొత్తానికి రూ. 34,000 కోట్లే అవుతుందని .. ఆర్‌బీఐ ఇచ్చే నిధుల్లో ఇంకా మిగులుతుందని ఒక వార్తా కథనాన్ని ఉటంకిస్తూ పేర్కొంది. తద్వారా రాష్ట్రాలపై భారం తగ్గుతుందని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment