
చెన్నై: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ బోర్డ్‌కు వెంకటస్వామి జగన్నాథన్ రాజీనామా ప్రకటించారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. 78 ఏళ్ల జగన్నాథన్ కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. తక్షణం తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు జూన్ 10న జగన్నాథన్ నుంచి ఈ మెయిల్ వచ్చినట్టు స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. జగన్నాథన్‌ను బీమా రంగం వెటరన్‌గా చెబుతారు. ప్రభుత్వరంగంలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌కు చైర్మన్, ఎండీగా పని చేసిన ఆయన, పదవీ విరమణ తర్వాత.. దుబాయికి చెందిన ఈటీఏ గ్రూప్ మద్దతుతో ప్రైవేటు రంగంలో స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌ను స్థాపించారు.
కొత్త బాట..
తన రాజీనామాపై జగన్నాథన్ స్పందించారు. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌కు రాజీనామా చేసినట్టు ధ్రువీకరించారు. ‘‘ప్రతీ ఆరంభానికి ముగింపు ఉంటుంది. అలాగే, ప్రతీ ముగింపునకు ఓ ఆరంభం ఉంటుందని నేను నమ్ముతాను. వచ్చే రెండు నెలల్లో ఏదో ఒకటి కొత్తగా ప్రారంభిస్తాను. అది ఏ రంగంలో అయినా ఉండొచ్చు. అది నా హృదయానికి దగ్గరగా ఉంటుంది’’అని చెప్పారు. 12 మందితో ఆయన ప్రారంభించిన స్టార్ హెల్త్ నేడు రూ.30వేల కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా అవతరించడం గమనార్హం