Vedanta Anil Agarwal Shared His Life Time Memories In Twitter - Sakshi
Sakshi News home page

ఆ నిర్ణయంతోనే నా దశ తిరిగింది.. లేదంటే.. ఆ కథే వేరుగా ఉండేది

Published Mon, Mar 28 2022 3:51 PM | Last Updated on Mon, Mar 28 2022 8:23 PM

Vedanta Anil Agarwal Shared His Life Time Memories In Twitter - Sakshi

వేదాంత గ్రూపు చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ గత కొద్ది రోజులుగా తన జీవితంలో చోటు చేసుకున్న కీలక ఘటనలు, మలుపు తిప్పిన రోజులను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంటున్నారు. కెరీర్‌ ఆరంభంలో తాను చేసిన రిస్క్‌లు వాటి  వల్ల ఎదురైన అనుభవాలు, అక్కడ నేర్చుకున్న పాఠాలు తనకెలా ఉపయోగపడ్డాయో కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు. గత వారం షంషేర్‌ కేబుల్‌ కంపెనీని ఎలా సొంతం చేసుకున్నది వివరించిన అనిల్‌ అగర్వాల్‌ ఈసారి ఆ కంపెనీ నిర్వాహాణలో తాను పడిన ఇబ్బందులను మనతో పంచుకున్నారు.


బ్యాంకులు, బంధువుల నుంచి రూ. 16 లక్షలు అప్పు తెచ్చి 1970వ దశకంలో షంషేర్‌ కేబుల్‌ కంపెనీని అనిల్‌ అగర్వాల్‌ కొనుగోలు చేశారు. అప్పటి వరకు షంషేర్‌ కంపెనీలోని స్క్రాప్‌ని అమ్మేవారు అనిల్‌ అగర్వాల్‌. అలాంటిది ఒక్కసారిగా అదే కంపెనీకి యజమాని అయ్యారు. అయితే అక్కడి నుంచి వ్యాపార నిర్వాహణ పూలబాట కాలేదు.. ఎక్కువగా మాట్లాడితే ముళ్లబాటనే అయ్యింది.

జీతం ఇవ్వలేక
అందినకాడికల్లా అప్పులు చేసి షంషేర్‌ కంపెనీని కొనుగోలు చేశారు అనిల్‌ అగర్వాల్‌. కానీ ఆ సమయంలో కేబుళ్లకు మార్కెట్‌లో ఆశించిన స్థాయి డిమాండ్‌ లేదు. దీంతో నెల తిరిగే సరికి ముడి సరుకు కొనేందుకు డబ్బులు లేకపోగా కార్మికులు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి వచ్చేది. వ్యాపారం లేకపోయినా ప్రతీ నెల జీతాలు చెల్లించడం తలకు మించిన పనయ్యేది అనిల్‌ అగర్వాల్‌కి. పొద్దస్తమానం రుణాల కోసం బ్యాంకుల దగ్గరే పడిగాపులు కాయాల్సి వచ్చేది.

9 రకాల వ్యాపారాలు
కేవలం ఉద్యోగులకు జీతాలు సర్థుబాటు చేయడం కోసం కేబుళ్ల వ్యాపారంలో కొత్త పద్దతులు తెర తీశాడు అనిల్‌ అగర్వాల్‌. మాగ్నెటిక్‌ కేబుల్స్‌, అల్యూమినియం రాడ్స్‌, వివిధ రకాలైన వైర్లు ఇలా తొమ్మిది రకాలైన బిజినెస్‌లలో వేలు పెట్టాడు. ఎక్కడా లాభం రాకపోగా అప్పులు మరింతగా పెరిగాయి. దాదాపు మూడేళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది.

యోగా, జిమ్‌లు
పెరిగిన అప్పులు ఆర్థిక భారం కారణంగా విపరీతమైన ఒత్తిడి ఎప్పుడూ నాపై ఉండేది. కానీ స్ట్రెస్‌గా ఫీలవుతున్నానంటే ఒప్పుకోబుద్ది అయ్యేది కాదు అనిల్‌ అగర్వాల్‌కి. మానసికంగా తాను ఎంత ఒత్తిడికి లోనవుతున్నాననే విషయం బయటి ప్రపంచానికి తెలియనిచ్చేవాడు కాదు. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు యోగా, ఎక్సర్‌సైజులు బాగా చేసేవాడినంటూ స్వయంగా ఆయనే వివరించారు. 
ఏ దేవున్ని వదల్లేదు
ఎన్ని ప్రయత్నాలు చేసినా కష్టాలు వీడకపోవడంతో ఒక్కోసారి భవిష్యత్తు మీద నమ్మకం కోల్పోయేది. కానీ ఇది నాకో పరీక్షా సమయం అంటూ తనకు తానే సర్థిచెప్పుకునే వాడు. ఆ సమయంలో ధైర్యం కోసం ముంబైలో ఉన్న ముంబాదేవి ఆలయం నుంచి మొదలుపెడితే సిద్ధి వినాయకుడు, హాజి అలీ దర్గా, మహిమ్‌ చర్చ్‌ వరకు ప్రతీ చోటుకి వెళ్లి ప్రార్థనలు చేసే వాడినంటూ ఆనాటి గడ్డు రోజులను నెమరు వేసుకున్నారు అనిల్‌ అగర్వాల్‌.

వాస్తవం తట్టుకోలేక
ఒక్కోసారి ఈ ఒత్తిడి తట్టుకోలేక... వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా ఎటైనా వెళ్లాలని అనిపించేదని.. అలాంటి సందర్భాల్లో రంగులకలైన సినిమాలకు వెళ్లేవాడినంటూ చెప్పుకొచ్చారు అనిల్‌ అగర్వాల్‌. ఇలా ఓసారి షోలే ప్రీమియం ప్రదర్శనకు వెళ్లగా... లోనికి రానివ్వలేదు. బయటే నిలబడి  అమితాబ్‌ బచ్చన్‌, జయాబాధురి, ధర్మేంధ్రలు రెడ్‌ కార్పెట్‌పై నడుస్తుంటే చూసి.. ఈ జన్మకు ఇది చాలులే అనుకుని సరిపెట్టుకున్నాడు.

దశ తిరిగింది
టెలిఫోన్‌ రంగంలో ప్రైవేటు కంపెనీలు తయారు చేసిన కేబుళ్లను కూడా వినియోగించవచ్చంటూ 1986లో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు అంటే దాదాపు పదేళ్ల పాటు కేవలం కష్టాల కడలినే ఓపికగా ఈదినట్టు వెల్లడించారు అనిల్‌ అగర్వాల్‌. 1986 తర్వాత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదంటున్నారు. 

ఆ పాఠాల వల్లే
ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా ఓ కలలా ఉంది. నా జీవితంలో బిగ్గెస్ట్‌ అచీవ్‌మెంట్‌గా చెప్పుకునే వేదాంత గ్రూపు స్థాపించడంలో షంషేర్‌ కేబుల్‌ నేర్పిన పాఠాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని కచ్చితంగా చెప్పగలను. అందుకే గెలుపు కోరుకునే వారు ఓసారి ఓటమిని కూడా రుచి చూడాలి అని చెబుతున్నారు.

చదవండి: ఇంగ్లీష్‌ రాదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ ఇప్పుడు రూ.33 వేల కోట్లకు అధిపతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement