క్రికెట్‌లో ఒక ఆటగాడి శైలిని.. మరో ఆటగాడితో పోల్చి చూసే వ్యవహారం సహజం. కానీ, ఏ ఆటగాడి ప్రత్యేకత ఆ ఆటగాడికే ఉంటుంది కదా!. అలాగే టీమిండియా టాప్ ప్లేయర్ విరాట్ కోహ్లిని దిగ్గజాలతో పోల్చాలని ప్రయత్నించడం కష్టంతో కూడిన వ్యవహారమే. కోహ్లి అగ్రెసివ్ ఆటిట్యూడ్‌తో పాటు ఆటనూ ఇష్టపడే యంగ్ జనరేషన్‌కి.. అతని పట్ల ఉన్న అభిమానం ఎంతైనా ప్రత్యేకమే!.
Virat Kohli Brand Value Without T20 Captaincy?: వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో రకరరకాల చర్చలు.. కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. మరి కోహ్లి గనుక కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే.. అతని బ్రాండ్‌కు వచ్చే నష్టమేమైనా ఉంటుందా? అనే చర్చ కూడా మొదలైంది ఇప్పుడు. రకరకాల బ్రాండ్‌లు.. కోట్లలో వ్యాపారం కేవలం కోహ్లి బ్రాండ్‌నే నమ్ముకుని నడుస్తున్నాయి. అందుకు ప్రతిగా పారితోషకం సైతం కోహ్లికి భారీగానే ముట్టజెప్పుతున్నారు. మరి క్రికెట్ వ్యూయర్‌షిప్‌ను శాసిస్తూ.. ఊహకందని రీతిలో బిజినెస్ చేస్తున్న పొట్టిఫార్మట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచే తప్పుకుంటే.. అది ప్రచారాలపై, కోహ్లి ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపెట్టవా?. అసలు ఆ ఆలోచననే దరి చేరనీయట్లేదట సదరు కంపెనీలు.
ఫామ్‌కొస్తే కేకే..
ఇంతకీ ‘కోహ్లి బ్రాండ్’ అంటే ఏంటో చూద్దాం. క్రికెట్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా కోహ్లి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఇప్పుడు. ఎమ్ఆర్ఎఫ్, అమెరికన్ టూరిస్టర్, పూమా, వోలిని, అడీ, ఉబెర్ ఇండియా, రాయల్ ఛాలెంజ్.. ఇలా బోలెడు బ్రాండ్స్‌కు ఎండోర్సింగ్ చేస్తున్నాడు కోహ్లి. అయితే ప్రధాన బ్రాండ్‌లు క్యూ కట్టడానికి ప్రధాన కారణం.. కేవలం స్టార్ ఆటగాడు అని మాత్రమే కాదు.. జనాల్లో కోహ్లికి ఉన్న యాక్సెప్టెన్సీ కూడా. మీడియా, సోషల్ మీడియా, బుల్లితెర.. ఇలా వేదిక ఏదైనాసరే కోహ్లికి విపరీతమైన జనాదరణ ఉంది. ఇది కోహ్లి పర్‌ఫార్మెన్స్‌తో ఏమాత్రం సంబంధంలేని వ్యవహారమని చెప్తున్నారు ఇండిపెండెంట్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ రితేస్ నాథ్. అందుకని కెప్టెన్సీ నుంచి వైదొలిగినా కోహ్లి బ్రాండ్‌పై ఎలాంటి ప్రభావం చూపెట్టబోదని భావిస్తున్నారాయన.
ఒకవేళ విమర్శల సంగతే తీసుకున్నా.. కోహ్లి గనుక ఒక్కసారి ఫామ్ పుంజుకుంటే.. అన్నీ మరిచిపోతారని, అప్పుడు మరింత పుంజుకుని బ్రాండ్ వాల్యూ రెట్టింపు అయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారాయన. గతంలో కెప్టెన్సీ వదిలేసిన తర్వాత సచిన్ నాలుగేళ్లపాటు ఎలాగైతే రాణించాడో.. బ్రాండ్ మార్కెట్‌లో మళ్లీ పుంజుకున్నాడో కోహ్లి విషయంలోనూ అలాగే జరగొచ్చని, అయితే పరిస్థితి అంతదాకా రాకపోవచ్చని అంచనా వేస్తున్నారాయన.
కోహ్లి.. కనిపిస్తే చాలు
కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్‌లకు సంబంధించి చేసే ఒక్క పోస్ట్‌కి కోటి ఇరవై ఐదు లక్షలు తీసుకుంటాడు. ఒకప్పుడు ఇది 80 లక్షల రూపాయల దాకా ఉండేది. ఎండోర్స్‌మెంట్ కోసం ఒక్కో బ్రాండ్‌కి ఏడాదికి ఏడు కోట్లపైనే ఛార్జ్ చేస్తున్నాడు. ఇది ఒకప్పుడు ఐదు కోట్లు ఉండేది. ప్రస్తుతం కోహ్లి తర్వాత రోహిత్ శర్మ 3 కోట్ల దాకా అందుకుంటున్నాడు. అజింక్య రహానే, కేఎల్ రాహుల్ లాంటివాళ్లు కోటి నుంచి కోటిన్నర మధ్య తీసుకుంటున్నారు. ఈ లెక్కన బ్రాండ్‌ల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా.. కోహ్లితో పోటీపడే క్రికెట్ ప్లేయర్ ఎవరూ లేకపోవడం విశేషం.
కోహ్లి గత కొంతకాలంగా పూర్ పర్‌ఫార్మెన్స్ కనబరుస్తున్నప్పటికీ.. బ్రాండ్‌లు వెనక్కి పోకపోవడమే ఇందుకు మరో ఉదాహరణ. రెండేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదని కోహ్లిని విమర్శించే వ్యతిరేక వర్గం కూడా.. కోహ్లి బ్రాండ్ విషయానికొచ్చేసరికి సైలెంట్ అయిపోతోందని కోరెరో కన్సల్టింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఫౌండర్ సలిల్ వైద్యా అంటున్నారు. అలా తన ఇమేజ్‌తో ప్రత్యర్థుల నోళ్లు సైతం మూయించగల కెపాసిటీ కోహ్లిది. అలాంటిది ప్లేయర్‌గా పర్ఫార్మెన్స్ కనబరిస్తే.. కోహ్లి బ్రాండ్ దూసుకుపోతుందని చెప్తున్నారు సలిల్. ‘‘కోహ్లి అప్పీయరెన్స్‌కు జనాలు బాగా అలవాటు పడ్డారు. యూత్ అతనికి సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా ఆస్వాదిస్తుంది. అసలు క్రికెట్ జెర్సీలో అతని రూపం చాలు.. ప్రచారానికి. అందుకే సీనియర్లకు, క్రికెట్ దిగ్గజాలకు సైతం దక్కని బ్రాండ్ ఇమేజ్.. కోహ్లి పేరిట నడుస్తోంది ఇప్పుడు.
Comments
Please login to add a commentAdd a comment