బఫెట్‌ సంపద రహస్యం అదే Warren Buffett, the chairman and CEO of Berkshire Hathaway, likes compound interest. Sakshi
Sakshi News home page

బఫెట్‌ సంపద రహస్యం అదే

Published Mon, Jun 3 2024 6:05 AM | Last Updated on Mon, Jun 3 2024 11:51 AM

Warren Buffett Loves Compound Interest

ముందుగా పెట్టుబడులు ఆరంభించాలి 

కాంపౌండింగ్‌తో దీర్ఘకాలంలో గొప్ప రాబడి 

స్వల్ప మొత్తమే అయినా చెప్పుకోతగినంత నిధి 

బఫెట్‌–జిమ్‌ సిమన్స్‌ మధ్య వైరుధ్యమే అది

జెండరీ హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్‌ జిమ్‌ సిమన్స్‌ సంపద విలువ 31.4 బిలియన్‌ డాలర్లు. విఖ్యాత ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ నెట్‌వర్త్‌ 139 బిలియన్‌ డాలర్లు. బఫెట్‌ కంటే సిమన్స్‌ సంపద 77 శాతం తక్కువ. వీరిద్దరి మధ్యనున్న సూక్ష్మ వైరుధ్యాన్ని ప్రతి ఇన్వెస్టర్‌ తప్పకుండా తెలుసుకోవాలి. జిమ్‌ సిమన్స్‌ స్థాపించిన హెడ్జ్‌ ఫండ్‌ ‘రెనైసెన్స్‌ టెక్నాలజీస్‌’ ఒకటి రెండేళ్లు కాదు.. 1988 నుంచి ఏటా 66 శాతం చొప్పున, నిరంతరాయంగా మూడు దశాబ్దాలకు పైనే ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచి్చపెట్టింది. 

అదే వారెన్‌ బఫెట్‌ స్థాపించిన బెర్క్‌షేర్‌ హాథవే ఏటా 19.8 శాతం కాంపౌండింగ్‌ వృద్ధినే నమోదు చేసింది. సిమన్స్‌ కంటే బఫెట్‌ సంపదే నాలుగు రెట్లు అధికం.  ఏటా ఎంత అధికంగా రాబడి తెచ్చుకున్నారనే దానికంటే.. ఎంత ముందుగా పెట్టుబడులు మొదలు పెట్టారు, వాటిని ఎంత కాలం పాటు కొనసాగించారు? అన్నవే సంపదను నిర్ణయిస్తాయని సిమన్స్‌–బఫెట్‌ జర్నీ చెబుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ వీలైనంత ముందుగా ఇన్వెస్ట్‌మెంట్‌ ఆరంభించి, దీర్ఘకాలం పాటు కొనసాగించినప్పుడే కాంపౌండింగ్‌ ప్రయోజనాన్ని గరిష్టంగా అందుకోగలరు. 

ఏటా 12 శాతం రాబడి 
సంపద సృష్టించాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా చేయాల్సిన పని.. సంపాదనను తీసుకెళ్లి వృద్ధి చెందే చోట పెట్టడం. ఎంత ముందుగా ఆరంభిస్తే, దీర్ఘకాలంలో అంత అధికంగా ప్రయోజనం పొందొచ్చు. బఫెట్‌ పెట్టుబడుల ప్రయాణాన్ని గమనించినా ఇదే బోధపడుతుంది. ముందుగా మొదలు పెట్టడం వల్ల అప్పుడు కాంపౌండింగ్‌ ప్రయోజనం గరిష్ట స్థాయిలో పొందడానికి కావాల్సినంత వ్యవధి ఉంటుంది.

 25 ఏళ్ల మహిమ ప్రతి నెలా రూ.1,000 చొప్పున తనకు 50 ఏళ్లు వచ్చే వరకు.. అంటే 25 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేసిందని అనుకుందాం. అప్పుడు 25 ఏళ్లలో మహిమ అసలు పెట్టుబడి రూ.3 లక్షలు అవుతుంది. ఏటా 12 శాతం రాబడి (ఈక్విటీలలో దీర్ఘకాల సగటు) అంచనా ప్రకారం సమకూరే మొత్తం రూ.18 లక్షలు. కేవలం వెయ్యి రూపాయలే.. 25 ఏళ్లలో రూ.18 లక్షలుగా మారడం కాంపౌండింగ్‌ వల్లే. 

ఇలా కాకుండా మహిమ కేసులో కాంపౌండింగ్‌ ప్రయోజనం తీసేసి చూస్తే.. అంటే అసలుతోపాటు, దానిపై వచి్చన వడ్డీని ఇన్వెస్ట్‌ చేయకుండా ఉంటే సమకూరే మొత్తం రూ.7.5 లక్షలుగానే ఉండేది. మొత్తం రూ.18 లక్షల్లో మిగిలిన రూ.10.5 లక్షలు కేవలం కాంపౌండింగ్‌ వల్లే సమకూరినట్టు అర్థం చేసుకోవచ్చు. 

ఒకవేళ పెట్టుబడికి ఇప్పుడేం తొందరొచి్చందిలే.. తర్వాత చూద్దామనుకుని, మహిమ పదేళ్లు ఆలస్యంగా తన 35వ ఏట నుంచి ఇన్వెస్ట్‌ చేయడం మొదలు పెట్టి ఉంటే ఏమయ్యేది? పైన చెప్పుకున్నట్టు 50 ఏళ్ల వయసుకు రూ.18 లక్షలు రావాలంటే అప్పటి నుంచి 15 ఏళ్ల పాటు ప్రతి నెలా ఆమె రూ.1,700 ఇన్వెస్ట్‌ చేయాల్సిందే. పదేళ్లు వృధా చేయడం వల్ల 70 శాతం అదనపు పెట్టుబడి అవసరం అవుతుందని ఇక్కడి ఉదాహరణ చెబుతోంది. పెట్టుబడి విషయంలో కాలం వృధా అవుతున్న కొద్దీ కాంపౌండింగ్‌ ప్రయోజనం అదే స్థాయిలో కోల్పోతారు.   

కాంపౌండింగ్‌
పెట్టుబడిపై వడ్డీ వస్తుందని తెలుసు. దీన్ని వడ్డీ రాబడిగా చెబుతారు. ఈ వడ్డీ కూడా తిరిగి పెట్టుబడిగా మారి దానిపైనా వడ్డీ సమకూరడమే కాంపౌండింగ్‌. దీన్నే చక్రవడ్డీ అని కూడా చెబుతారు. బ్యాంకులో వ్యక్తిగత రుణం, బంగారంపై రుణం తీసుకున్నప్పుడు ప్రతి నెలా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో ఒక నెల ఈఎంఐ చెల్లించడంలో విఫలమై, మరుసటి నెలలో చెల్లిస్తున్నప్పుడు నెల బకాయిపై వడ్డీని కూడా బ్యాంక్‌ రాబడుతుంది.

 దీన్నే వడ్డీ మీద వడ్డీగా చెబుతారు. రూ.100 ఇన్వెస్ట్‌ చేస్తే 10 శాతం రాబడి ప్రకారం ఏడాది తర్వాత రూ.110గా మారుతుంది. ఇందులో రూ.10 వడ్డీ రూపంలో సమకూరింది. రెండో ఏడాది రూ.110 కాస్తా రూ.121గా మారుతుంది. మొదటి ఏడాది వడ్డీ రూ.10పైనా రెండో ఏడాది రూపాయి వడ్డీ వచ్చినట్టు. ఇలా వడ్డీపై వడ్డీ రాబడి జమవుతుంది కనుకనే దీర్ఘకాలంలో భారీ మొత్తం సమకూరుతుంది.  

పెట్టుబడుల జర్నీ..
బఫెట్‌ ప్రస్తుత వయసు 90 ఏళ్లు. ఆయన సంపద విలువ 139 బిలియన్‌ డాలర్లు. నిజానికి బఫెట్‌ సంపదలో 99 శాతం ఆయనకు 65 ఏళ్లు వచి్చన తర్వాత సమకూరిందేనని ప్రముఖ రచయిత మోర్గాన్‌ హౌసెల్‌ ‘ద సైకాలజీ ఆఫ్‌ మనీ’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. ఒకవేళ బఫెట్‌ 65 ఏళ్లకే రిటైర్‌ అయి ఉంటే నేడు ఆయన గురించి అంతగా మాట్లాడుకునే వాళ్లం కాదని ఓ ఇంటర్వ్యూలో భాగంగా హౌసెల్‌ పేర్కొన్నారు. 

బఫెట్‌ 30 ఏళ్ల వయసులో పెట్టుబడులు మొదలు పెట్టి, 60 ఏళ్లకు రిటైర్మెంట్‌ తీసుకున్నాడన్నది చాలా మంది ఇన్వెస్టర్లకు తెలిసిన విషయం. కానీ, నిజానికి బఫెట్‌ 10 ఏళ్ల వయసులోనే పెట్టుబడి ఆరంభించారు. 30 ఏళ్ల నాటికి ఆయన 9.3 మిలియన్‌ డాలర్లు సమకూర్చుకున్నారు. వెనక్కి తీసుకోకుండా అలాగే జీవితకాలం పాటు కొనసాగించారు.

 సంపాదిస్తున్న మొత్తంలో కనీస అవసరాలకే తప్ప ఎప్పుడూ లగ్జరీ వ్యయాలకు పోలేదు. వీలైనంత పెట్టుబడి పెట్టడమే ఆయన చేసిన పని. నిజానికి దీన్నే బఫెట్‌ స్కిల్‌ (నైపుణ్యం)గా హౌసెల్‌ అభివర్ణిస్తారు. ఏటా 20 శాతం చొప్పున బఫెట్‌ సంపద కాంపౌండ్‌ అయింది. జిమ్‌ సిమన్స్‌ 1988 నుంచి పెట్టుబడులు ఏటా 66 శాతం చొప్పున వృద్ధి చెందేంత గొప్ప వ్యూహాలు అమలు చేసిననప్పటికీ.. తక్కువ సంపద కలిగి ఉండడానికి కారణం పెట్టుబడుల ప్రపంచంలోకి ఆలస్యంగా ప్రవేశించడమే.

 నిజానికి సిమన్స్‌ వార్షిక రాబడి 66 శాతంలో బఫెట్‌ వార్షిక రాబడి మూడింట ఒక వంతే. బఫెట్‌ ఎంతో ముందుగా మొదలు పెట్టడం వల్ల కాంపౌండింతో ఎక్కువ సంపద సమకూరింది. ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కానంత వార్షిక రాబడులను సిమన్స్‌ తెచ్చుకున్నా కానీ, ఆస్తుల్లో బఫెట్‌ కంటే దిగువన ఉండడానికి కారణం 50 ఏళ్లు వచి్చన తర్వాతే తన ఇన్వెస్ట్‌మెంట్‌ జర్నీ ఆరంభించడం. అందుకే ప్రతి ఇన్వెస్టర్‌ ముందుగా పెట్టుబడులు మొదలు పెట్టి, ఎక్కువ కాలం పాటు కొనసాగించడం ఆచరించాలని బఫెట్‌ విజయ గాధ తెలియజేస్తోంది. బఫెట్‌ మాదిరే సిమన్స్‌ కూడా 70 ఏళ్లపాటు ఏటా 66 శాతం చొప్పున రాబడులు తెచ్చుకుని ఉంటే.. ఆ మొత్తం కొన్ని వందల రెట్లు అధికంగా ఉంటుంది.  

బఫెట్‌ పంచ సూత్రాలు 
⇥ పెట్టుబడుల విషయంలో దీర్ఘకాల దృష్టి ఉండాలి. అవసరమైతే ఎప్పటికీ కొనసాగించాలి. 
⇥ నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. ఇక్కడ పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం. మంచి కంపెనీని అద్భుతమైన ధరలో (చాలా ఖరీదైన వ్యాల్యుయేషన్‌లో) కొనడం కంటే.. అద్భుతమైన కంపెనీని సరసమైన ధరలో కొనుక్కోవాలి. 
⇥ పెట్టుబడుల్లో ఉండే రిస్క్‌ తెలుసుకోవాలి. మీరు ఏం చేస్తున్నారో తెలియనప్పుడే రిస్క్‌ ఎదురవుతుంది. 
⇥ వ్యాపారంపై పెట్టుబడి పెడుతున్నారు. అసాధారణ యాజమాన్యం, అద్భుతమైన వ్యాపారంతో ఉంటే ఆ కంపెనీలో మీరు పెట్టే పెట్టుబడి కాల వ్యవధి జీవితకాలంగానే భావించాలి. 
⇥ ఈక్విటీ మార్కెట్లో ఓపిక ఉన్నవారికే అధిక రాబడులు సొంతమవుతాయి. దూకుడైన ఇన్వెస్టర్‌ నుంచి ఓపికగా వేచి చూసే ఇన్వెస్టర్‌కు సంపదను బదిలీ చేసే విధంగా స్టాక్‌ మార్కెట్‌ పనితీరు ఉంటుంది.  

జిమ్‌ సిమన్స్‌ ఏమి చెప్పారంటే..?
⇥ ఒక గొప్ప సిద్ధాంతం అందంగా ఎలా ఉంటుందో.. గొప్పగా, సమర్థవంతంగా పనిచేసే కంపెనీ కూడా అంతే అందంగా ఉంటుంది. 
⇥ వీలైనంత వరకు మీ చుట్టూ తెలివైన, ఉత్తమమైన వ్యక్తులు ఉండేలా చూసుకోవాలి. వారు మీకంటే తెలివైన వారు అయితే ఇంకా మంచిది. 
⇥ ఏదో ఒకటి వాస్తవికంగా చేయండి. మిగిలిన వారిని అనుసరించొద్దు. ఒకే సమస్యను పరిష్కరించేందుకు ఎక్కువ మంది ప్రయతి్నస్తుంటే మీరు దాన్ని చేయొద్దు. 
⇥ అంత సులభంగా వదిలేసుకోవద్దు. దానికే కట్టుబడి ఉండాలి. అలా అని శాశ్వతంగా కాదు. కానీ, ఫలితమిచ్చేంత సమయం దానికి ఇవ్వాలి.  
⇥ చివరిగా అదృష్టం కలసిరావాలి. ఇది చాలా ముఖ్యమైన సూత్రం.  
⇥ జేమ్స్‌ హారిస్‌ సిమన్స్‌ (జిమ్‌ సిమన్స్‌) గణితంలో దిట్ట. తనకున్న అసాధారణ ప్రతిభతో మార్కెట్ల తీరును కచి్చతంగా అంచనా వేసి, పెట్టుబడులపై అధిక ప్రతిఫలం పొందే దిశగా ఆయన అమలు చేసిన విధానాలు అద్భుత ఫలితాలను ఇచ్చాయి. 1980లోనే క్వాంట్‌ ఇన్వెస్టింగ్‌ విధానాన్ని ఆవిష్కరించి బఫెట్, జార్జ్‌ సోరోస్‌ వంటి దిగ్గజ ఇన్వెస్టర్లను అధిగమించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement