పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాలుస్తుండడంతో స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. ఇజ్రాయిల్–ఇరాన్ పరస్పర ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు దిగారు. ఫలితంగా నిన్న దేశీయ స్టాక్‌మార్కెట్లో రూ.9.78 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఇందుకుగల కారణాలను మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.
నిపుణులు అంచనా ప్రకారం..హెజ్బొల్లా, హమాస్ అగ్రనేతలను ఇజ్రాయెల్ మట్టుపెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఈ సంస్థలకు మద్దతుగా నిలిచిన ఇరాన్ ప్రత్యక్ష దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్‌పై ఏకంగా 180కి పైగా క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్–ఇజ్రాయెల్‌ల మద్య పోరు భీకర యుద్ధానికి దారి తీయోచ్చనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు.
చిన్న ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు ఈక్విటీ మార్కెట్లో స్థిరత్వం కోసం సెబీ ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. డెరివేటివ్స్ కనీస కాంట్రాక్టు విలువను రూ.15–20 లక్షలకు పెంచింది. దీంతో విస్తృత మార్కెట్లో ట్రేడింగ్ వాల్యూమ్స్ భారీగా తగ్గే అవకాశం ఉంది. సెబీ కొత్త మార్గదర్శకాలు మార్కెట్‌పై ఒత్తిడి పెంచాయి.
పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో కొన్ని వారాలుగా నిలకడగా ఉన్న క్రూడాయిల్ ధరలు ఇటీవల మళ్లీ ఎగబాకాయి. గడిచిన 3 రోజుల్లో చమురు ధరలు 5% పెరిగాయి. ప్రస్తుతం భారత్‌కు దిగుమతయ్యే బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 77 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సరఫరా అవాంతరాల దృష్ట్యా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు నెలకొన్నాయి. దేశీయ ముడి చమురుల దిగుమతుల బిల్లు భారీగా పెరగొచ్చనే భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 14 పైసలు బలహీనపడి 83.96 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 23 పైసలు క్షీణించి 84.00 స్థాయిని తాకింది.
ఇదీ చదవండి: కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!
చైనా ప్రభుత్వం ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే సంస్కరణలు, ఉద్దీపన చర్యలు, వరుస వడ్డీరేట్ల కోతను ప్రకటించడంతో గతవారంలో ఆ దేశ స్టాక్ మార్కెట్ ఏకంగా 15 శాతం ర్యాలీ అయింది. ఇప్పటికీ అక్కడి షేర్లు తక్కువ ధరల వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ వంటి వర్ధమాన దేశాల మార్కెట్లో లాభాల స్వీకరణకు పాల్పడి, చైనా మార్కెట్లకు తమ పెట్టుబడులు తరలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment