ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌తో పోలిస్తే అధిక భద్రతనిస్తూనే, పూర్తి హామీతో కూడిన రాబడులను ఇచ్చే సాధనాలు ఏవైనా ఉన్నాయా? – కవాన్‌జైన్
మీరు సీనియర్ సిటిజన్ అయితే (60 ఏళ్లు నిండినవారు) సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్), ప్రధానమంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (పీవో ఎంఐఎస్) పథకాలను పరిశీలించొచ్చు. ఇవన్నీ భద్రతతో కూడిన పెట్టుబడి సాధనాలు. వీటికి ప్రభుత్వ హామీ ఉంటుంది. వీటి తర్వాత షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు.
ఇవి తక్కువ నాణ్యత (రేటెడ్) సాధనాల్లో ఇన్వెస్ట్ చేయవు. ఒకవేళ మీరు చిన్న వయసులో ఉండి, దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటుంటే.. కొంత మొత్తాన్ని ఈక్విటీకి కూడా కేటాయించుకోవాలి. రిస్క్ ఏ మాత్రం తీసుకోకపోతే చెప్పుకోతగ్గ రాబడులను పొందలేరు. రిస్క్ తీసుకోని ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల విలువ వృద్ధి చెందుతుందని అనుకుంటారు కానీ.. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసి చూస్తే వాస్తవ విలువ తగ్గిపోతుంది. ద్రవ్యోల్బణ రేటు కంటే తక్కువగా మీ పెట్టుబడులు వద్ధి చెందుతుంటే కనుక.. చూడ్డానికి పెరిగినట్టు అనిపించినా వాటి విలువ తగ్గిపోయినట్టే. కనుక దీర్ఘకాలానికి పెట్టుబడుల్లో కొంత మేర రిస్క్ తీసుకోవచ్చు.
నా వయసు 50 ఏళ్లు. స్మాల్‌క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాను. ప్రస్తుత పరిస్థితుల్లో స్మాల్‌క్యాప్‌నకు, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాల మధ్య కేటాయింపులు ఎలా ఉండాలి? – ఎస్‌కే శర్మ
మీ వయసు ప్రకారం చూస్తే.. స్మాల్‌క్యాప్ విభాగంలో (మార్కెట్ విలువ పరంగా చిన్న కంపెనీలు) ఇన్వెస్ట్ చేయడం మంచిదే. గణనీయంగా విలువ పడిపోయినా ఫర్వాలేదనుకుంటే మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అద్భుత రాబడులను ఇచ్చినా.. స్వల్పకాలంలో ఇవి ఎంతో నిరుత్సాహపరుస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో వీటిల్లో పతనం చాలా స్వల్పకాలంలోనే గణనీయంగా ఉంటుంది.
అయితే ప్రతీ ఇన్వెస్టర్ కూడా కనీసం 20–25 శాతం వరకు అయినా స్థిరాదాయ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇందుకు ఎటువంటి సూత్రం అవసరం లేదు. ఇలా చేయడం వల్ల స్మాల్‌క్యాప్స్ నుంచి సంపాదించుకున్న మొత్తానికి కొంత రక్షణ కల్పించుకోవచ్చు. స్మాల్‌క్యాప్ పెట్టుబడులు గణనీయంగా పెరగొచ్చు లేదా పడిపోవచ్చు. దానికి తగినట్టు పెట్టుబడుల కేటాయింపులను మార్చుకోవాలి. ఉదాహరణకు స్మాల్‌క్యాప్‌లో 75 శాతం, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాలకు 25 శాతంగా అస్సెట్‌అలోకేషన్‌ను నిర్ణయించుకున్నారనుకుంటే.. స్మాల్‌క్యాప్ పెట్టుబడుల విలువ మొత్తం పెట్టుబడుల్లో 90 శాతానికి చేరితే.. అప్పుడు తిరిగి 75 శాతానికి తగ్గించుకోవాలి. అంటే ఆ మేరకు స్మాల్‌క్యాప్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.
ఒకవేళ స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 75 శాతం కంటే తగ్గిపోయి, డెట్ సాధనాల విలువ పెరిగిన సందర్భాల్లో.. డెట్ పెట్టుబడులను 25 శాతానికి తగ్గించుకుని, మిగిలిన మేర స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులు పెంచుకోవాలి. డెట్ సాధనాలకు కనీసం 20–25 శాతం అయినా కేటాయించుకుంటేనే అర్థవంతంగా ఉంటుంది. ఇంతకంటే తక్కువ కేటాయింపులు చేసుకుని.. పోర్ట్‌ఫోలియోలను మార్చుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం నెరవేరదు.
చదవండి: డీమ్యాట్ అకౌంట్ల స్పీడ్, స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న పెట్టుబడులు
Comments
Please login to add a commentAdd a comment