ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ఈ వారం దేశ, విదేశీ అంశాలు ప్రభావితం చేసే అవకాశముంది. ప్రపంచ భౌగోళిక, ఆర్థిక పరిస్థితులు, ముడిచమురు ధరలు తదితర పలు అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మంగళవారం(24న) విజయదశమి పర్వదినం సందర్భంగా స్టాక్‌మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. విదేశీ అంశాలలో ప్రధానంగా మధ్యప్రాచ్యం పరిస్థితులపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ప్రభావితంకానున్నట్లు పలువురు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై అనిశ్చితి మేఘాలు, భారీగా పెరుగుతున్న యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్, భౌగోళిక, రాజకీయ వివాదాల కారణంగా ప్రస్తుతం ప్రపంచ స్టాక్ మార్కెట్లు అత్యంత అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు అభిప్రాయపడ్డారు.
రూపాయి కదలికలు
ఇటీవల తిరిగి డాలరుతో మారకంలో రూపాయి భారీగా ఊగిసలాడుతోంది. మరోవైపు మధ్యప్రాచ్యంలో నెలకొన్న వివాద పరిస్థితులు ముడిచమురు ధరలకు ఆజ్యం పోసే వీలుంది. ఇది దేశ, విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీయవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు. అక్టోబర్ నెల ఎఫ్‌అండ్‌వో సిరీస్ గడువు గురువారం(26న) ముగియనుంది. 24న సెలవుకాగా.. దీంతో మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదిలే వీలున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్– పాలస్తీనా యుద్ధం ఆధారంగా మార్కెట్లు కదిలే వీలున్నట్లు మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అర్విందర్ సింగ్ నందా తెలియజేశారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెడతారని కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్(రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ పేర్కొన్నారు.
ఇతర అంశాలు
విదేశీ అంశాలలో యూకే పీఎంఐ సర్వీసులు, యూఎస్ తయారీ, సర్వీసుల పీఎంఐ, యూఎస్ జీడీపీ గణాంకాలు ఈ వారం విడుదలకానున్నాయి. అంతేకాకుండా యూఎస్ నిరుద్యోగ గణాంకాలు సైతం వెలువడనున్నాయి. యూరోపియన్ కేంద్ర బ్యాంకు(ఈసీబీ) వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుంది. దేశీయంగా దిగ్గజాలు యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్‌సర్వ్, కెనరా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, పీఎన్‌బీ, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ2 ఫలితాలు విడుదల చేయనున్నాయి. గత వారాంతాన ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా క్యూ2 పనితీరును వెల్లడించాయి. ఈ ప్రభావం సోమవారం ట్రేడింగ్‌లో కనిపించే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా పేర్కొన్నారు. కాగా.. గత వారం ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ నికరంగా 885 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 208 పాయింట్లు చొప్పున కోల్పొయిన విషయం విదితమే.
ఎఫ్‌పీఐల వెనకడుగు
ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్ నుంచి నికరంగా రూ. 12,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రధానంగా యూఎస్ బాండ్ల ఈల్డ్స్ పెరుగుతుండటం, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధ పరిస్థితులు ఇందుకు కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో రుణ సెక్యూరిటీలలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు పుంజుకోవడం గమనార్హం! డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 5,700 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇకపై విదేశీ ఇన్వెస్టర్ల దేశీ పెట్టుబడులను ప్రపంచ ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లతోపాటు.. ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదాలు ప్రభావితం చేయనున్నట్లు మార్నింగ్‌స్టార్ అడ్వయిజర్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment