వచ్చే వారంలో మార్కెట్ ఎలా ర్యాలీ అవ్వబోతుంది.. వారంతంలో అమెరికా ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలతో రానున్న రోజుల్లో మార్కెట్ ఎలా స్పందిస్తుంది.. దసరా పండగ సీజన్‌లో మార్కెట్ ఎలా ఉంటుందనే అంశాలపై సాక్షి బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు మాట్లాడారు.
అంతర్జాతీయ మార్కెట్‌లు అనిశ్చితిలో ఉన్నాయి. అదే తీరు కొనసాగనుంది. దసరా, దీపావళి పండగ సీజన్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది. గ్లోబల్‌గా విదేశీ సంస్థాగత పెట్టుబడులను ఉపసంహరించుకునే వీలుంది. గడిచిన వారంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. డాలర్ విలువ పెరుగుతుండడంతో రూపాయి మారకం పడిపోయి ధరలు పెరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారాలు, పండగ నేపథ్యంలో పెద్దగా నష్టపోయే అవకాశం ఉండదు. కేంద్రం అందిస్తున్న ప్రయోజనాల మూలంగా దేశీయ స్టాక్‌మార్కెట్లు బలంగా ఉన్నాయి. దేశంలో యువత ఎక్కువగా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడంతో తాత్కాలికంగా కొంత ఒడుదుడుకులు నెలకున్నా దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
యూఎస్ ట్రెజరీలు అనిశ్చితిలో ఉన్నాయి. భవిష్యత్తులో మార్కెట్ సంక్షోభానికి సంబంధించి పెట్టుబడిదారులు ఎలా స్పందిస్తారనే అంశాన్ని గమనించాలి. అమెరికా ట్రూప్‌లపై డ్రోన్‌లు దాడిచేసేందుకు ప్రయత్నించాయనే వార్తలు వచ్చాయి. ఇజ్రాయెల్, హమాస్‌కు మాత్రమే యుద్ధం కొనసాగితే మార్కెట్లు పెద్దగా స్పందించే స్థితిలో లేవు. కానీ వాటికి మద్ధతు ఇస్తున్న దేశాల స్పందించే విధానం వల్ల యుద్ధ భయాలు చెలరేగితే మార్కెట్లు నష్టాల్లోకి జారుకునే అవకాశం ఉంటుంది. అమెరికా వడ్డీ రేట్లు పెంచడంతో మదుపర్లు తమ సొమ్మును భద్రంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. యూఎస్ 10 ఏళ్లు ట్రెజరీ బాండ్‌లు ఏప్రిల్ నుంచి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన వారంలో గరిష్ఠాన్ని తాకాయి.
అమెరికా ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సి ఉందని పావెల్ సంకేతాలిచ్చారు. ఇందుకు రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెంచక తప్పదని ప్రకటించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా ఇంకా ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం రెండు శాతానికి పడిపోయేంత వరకు వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందన్నారు. ఈ అన్ని కారణాల వల్ల వచ్చేవారం మార్కెట్లు కొంత ఒడుదుడుకులకు లోనవచ్చు.
గతవారంలో నిఫ్టీ 19850 వద్దకు చేరి అక్కడి నుంచి ప్రతికూలంగా స్పందించింది. వారం మధ్యలో బెంచ్‌మార్క్ సూచీల్లో అమ్మాకాలు వెల్లువెత్తాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సూచీలు రెండూ వారంలో ఒక శాతం కంటే ఎక్కువ కరెక్ట్ అయ్యాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment