
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో తీవ్ర రూపం దాల్చింది. 7.39 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 మార్చితో పోల్చితే 2021 మార్చిలో టోకు బాస్కెట్‌లోకి ఉత్పత్తుల ధరలు 7.39 శాతం పెరిగాయన్నమాట. గడచిన ఎనిమిది సంవత్సరాల్లో (అక్టోబర్ 2012లో 7.4 శాతం) ఈ స్థాయి ద్రవ్యోల్బణం రేటు ఇదే తొలిసారి. క్రూడ్ ఆయిల్, మెటల్ ధరలు భారీగా పెరగడం మొత్తం బాస్కెట్‌పై ప్రభావం చూపింది. అలాగే గత ఏడాది అతి తక్కువ ధరలు (బేస్ ఎఫెక్ట్) కూడా ‘భారీ పెరుగుదల రేటు’కు కారణంగా ఉంది. 2020 మార్చిలో టోకు ద్రవ్యోల్బనం 0.42 శాతం కావడం గమనార్హం. 2021 ఫిబ్రవరిలో ఈ రేటు 4.17 శాతంగా ఉంది. గడచిన మూడు నెలలుగా టోకు ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది.
► ఫుడ్ ఆర్టికల్స్‌లో 3.24% టోకు ద్రవ్యోల్బణం నమోదయ్యింది. పప్పు దినుసుల ధరలు 13.14%, పండ్లు, ధాన్యం విషయంలో ధరాభారం వరుసగా 16.33%, 1.38%గా ఉన్నా యి. కూరగాయల ధరలు 5.19% తగ్గాయి.
► ఫ్యూయెల్ అండ్ పవర్ బాస్కెట్ టోకు ధరలు 10.25 శాతం పెరిగాయి.
► మొత్తం సూచీలో దాదాపు 55 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ద్రవ్యోల్బణం 7.34 శాతంగా నమోదైంది.