న్యూఢిల్లీ: ప్లేస్టోర్‌లో ఎంపిక చేసిన కొన్ని ఫ్యాంటసీ, రమ్మీ గేమింగ్ యాప్స్‌ను ప్రయోగాత్మకంగా అనుమతించాలన్న గూగుల్ నిర్ణయాన్ని దేశీ గేమింగ్ ప్లాట్‌ఫాం విన్‌జో తప్పు పట్టింది. ఇది పూర్తిగా పక్షపాతపూరితమైన, అనుచితమైన, ఆంక్షాపూర్వక విధానమని వ్యాఖ్యానించింది. ప్లాట్‌ఫాంను తటస్థంగా ఉంచుతూ ఒక మధ్యవర్తిగానే వ్యవహరిస్తామనే గూగుల్ ధోరణిపై అనుమానాలు రేకెత్తుతున్నాయని విన్‌జో పేర్కొంది.
దశాబ్దకాలంపైగా గుత్తాధిపత్యం సాగిస్తున్న కొన్ని సంస్థలకే లబ్ధి చేకూర్చేలా గూగుల్ విధానం ఉందని తెలిపింది. ఇది పోటీని దెబ్బతీయడమే కాకుండా నవకల్పనలకు చావుదెబ్బలాంటిదని విన్‌జో వ్యాఖ్యానించింది. గతంలో ఫ్యాంటసీ గేమింగ్ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించినప్పటికీ సెప్టెంబర్ 28 నుంచి ఎంపిక చేసిన కొన్నింటిని పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన ఏడాది పాటు తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే విన్‌జో అభ్యంతరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
చదవండి: అన్నింటికీ ఒక్కటే కేవైసీ
Comments
Please login to add a commentAdd a comment