తయారీ రంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలు రానున్నాయి. పురుషులకు ఎక్కువ అవకాశాలు కల్పించే ఈ రంగంలో ఆటోమేషన్ (మెషినరీ సాయంతో పనుల నిర్వహణ)తో మహిళల నియామకాలు పెరుగుతాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ అంచనా వేస్తోంది. 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది భారత్ లక్ష్యంగా ఉంది. ఈ క్రమంలో తయారీ రంగం మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఆటోమేషన్‌ను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక తెలిపింది.
టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పి.సుబ్బురాతినమ్ మాట్లాడుతూ..‘దేశీయంగా చాలా కంపెనీలు దశలవారీ ఆటోమేషన్‌ను అమలు చేస్తున్నాయి. మహిళల నియామకాలు మొదలు పెట్టాయి. తయారీ రంగాల్లో ఆటోమేషన్ అమలు పెరుగుతున్న కొద్దీ కంపెనీలు మరింత మంది మహిళలను పనుల్లోకి తీసుకుంటున్నాయి. భారత తయారీ రంగంలో మహిళల ప్రాతినిధ్యం ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. మొత్తం శ్రామిక శక్తిలో మహిళలు 15–20 శాతంలోపే ఉంటారు. ఆటోమేషన్‌ను వేగంగా అమలు చేస్తున్న కంపెనీల్లో ఇప్పటికే మహిళల నియామకాలు పెరిగాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, టెలికం విడిభాగాల తయారీ సంస్థలు మరింత మంది మహిళలను తీసుకునేందుకు చర్యలు చేపట్టాయి. శ్రామికశక్తిలో లింగ సమతుల్యంపై కొన్ని కంపెనీలు దృష్టి సారించాయి’ అని అన్నారు.
ఇదీ చదవండి: కార్ల ధరపై భారీ డిస్కౌంట్లు
కొన్ని విభాగాల్లో మెరుగైన అవకాశాలు
తయారీలో కొన్ని రంగాలు మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తుండడడాన్ని టీమ్‌లీజ్ నివేదిక ప్రస్తావించింది. ఎలక్ట్రానిక్స్ తయారీలో కార్మికుల్లో 70–80 శాతం మహిళలు ఉన్నట్టు పేర్కొంది. అలాగే టెక్స్‌టైల్స్, వస్త్రాల తయారీలోనూ సహజంగానే మహిళల శాతం ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. ఫ్యాబ్రికేటెడ్, బేసిక్ మెటల్స్, మెషినరీ, ఎక్విప్‌మెంట్, మోటారు వాహనాలు, ఆటో విడిభాగాల తయారీ పరిశ్రమల్లో కఠినమైన పని పరిస్థితుల దృష్ట్యా పురుషులే ఎక్కువగా ఉంటున్నారని, వీటిల్లో ఆటోమేషన్ అమలు తక్కువగా ఉన్నట్టు టీమ్‌లీజ్ తెలిపింది. ఇక ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్‌లోనూ పురుషులే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment