ఇంటి నిర్మాణం అనేది సుదీర్ఘ ప్రక్రియ. శ్రామిక శక్తితో కూడుకున్నది. చాలా మంది కార్మికులు నెలలు, సంవత్సరాల తరబడి పనిచేస్తే కానీ నిర్మాణం పూర్తవ్వదు. కానీ టెక్నాలజీ సాయంతో ఇంటి నిర్మాణం రోజుల్లోనే పూర్తవుతోంది.
అన్నింటా ప్రవేశిస్తున్న రోబిటిక్ టెక్నాలజీ భవన నిర్మాణ రంగంలోనూ ప్రవేశించింది. 105 అడుగుల (32 మీటర్లు) టెలిస్కోపిక్ బూమ్ ఆర్మ్ కలిగిన రోబోటిక్ ట్రక్ ఆస్ట్రేలియా నుంచి ఫ్లోరిడాకు వచ్చింది. హాడ్రియన్ ఎక్స్ గా పిలిచే ఈ ట్రక్కును రోబోటిక్స్ కంపెనీ ఎఫ్ బీఆర్ అభివృద్ధి చేసింది. ఆ యంత్రం రెండు రోజుల్లో పూర్తి స్థాయి ఇంటిని పూర్తి చేయగలదు. గత సంవత్సరం ఇది యూఎస్‌ఏ ఫార్మాట్‌లో గంటకు 500 ఇటుకలను పేర్చి తన పనితీరు ఏంటో చూపించింది.
ఇటుకలతో కూడిన ప్యాలెట్ లను లోడ్ చేశాక ఈ రోబోటిక్ వెహికల్/కన్ స్ట్రక్షన్ ఆర్మ్ తన పనిని మొదలు పెడుతుంది. ప్యాలెట్ నుంచి ఒక్కో ఇటుక ఆర్మ్ కొనకు చేరుకుంటుంది. ఇక్కడ క్విక్ డ్రై నిర్మాణ మిశ్రమం ఉంటుంది. ఇది సిమెంట్ లాగా పనిచేస్తుంది. మిశ్రమం అంటిన ఒక్కొక్క ఇటుకను రోబో ఆర్మ్ చక్కగా పేరుస్తూ నిర్మాణం పూర్తి చేస్తుంది. అధిక పొడవు కారణంగా మూడు అంతస్తుల ఎత్తుతో సైతం ఇది నిర్మాణాలను చేపడుతుంది.
అమెరికాలో అతిపెద్ద కాంక్రీట్ బ్లాక్ సరఫరాదారుల్లో ఒకటైన సీఆర్‌హెచ్ పీఎల్సీ అనుబంధ సంస్థ ఎఫ్‌బీఆర్, సీఆర్‌హెచ్ వెంచర్స్ అమెరికాస్ ఇంక్ సంయుక్త భాగస్వామ్యంలో భాగంగా హాడ్రియన్ ఎక్స్‌ను ఫ్లోరిడాకు తీసుకొచ్చారు. ఈ రోబోటిక్ బిల్డర్ తన సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఫ్లోరిడాలోని ఫోర్ట్ మేయర్స్ లోని ఒక ఫెసిలిటీలో సైట్ అంగీకార పరీక్షను మొదట పూర్తి చేయాల్సి ఉంటుంది. అది సవ్యంగా జరిగితే, ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా హాడ్రియన్ ఎక్స్ ఐదు నుంచి 10 ఏక-అంతస్తుల గృహాలను నిర్మిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment