World Most Valuable Teapot Guinness World Records - Sakshi
Sakshi News home page

గిన్నిస్‌ రికార్డ్‌: టీపాట్‌ ధర రూ. 24 కోట్లు! దీని సృష్టికర్త మనోడే..

Published Fri, Aug 11 2023 7:55 PM | Last Updated on Fri, Aug 11 2023 8:39 PM

world most valuable teapot Guinness World Records - Sakshi

World most valuable teapot Guinness World Records: సాధారణంగా అందరి ఇళ్లలోనూ టీపాట్‌లు వాడుతూ ఉంటారు. వీటి ధర ఎంత ఉంటుంది? రూ.1000 వరకు ఉంటుంది. మరీ ప్రత్యేకమైనవైతే ఇంకొంచెం ఎక్కువ ధర ఉంటుంది. కానీ ఓ టీపాట్‌ ధర ఏకంగా రూ.24 కోట్లు. ఇది అత్యంత ఖరీదైన టీపాట్‌గా గిన్నీస్‌ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కింది. 

బ్రిటన్‌కు చెందిన ఎన్‌ సేథియా ఫౌండేషన్‌, లండన్‌లోని న్యూబీటీస్‌ సంయుక్తంగా తయారు చేయించిన ఈ టీపాట్‌ను ఇటాలియన్‌ స్వర్ణకారుడు ఫుల్వియో స్కావియా రూపొందించారు. 18 క్యారట్ల బంగారంతో తయారు చేసిన ఈ టీపాట్‌ చుట్టూ వజ్రాలను పొదిగారు. వాటి మధ్యలో 6.67 క్యారట్ల రూబీలను అమర్చారు.

 

ఈ టీపాట్‌ తయారీలో మొత్తం 1658 వజ్రాలు, 386 థాయ్‌, బర్మీస్‌ కెంపులు ఉపయోగించారు. ఈ అద్భుతమైన టీపాట్‌కు ‘ది ఇగోయిస్ట్‌’ (The Egoist) అని పెట్టారు. 2016లోనే దీని విలువ 3 మిలియన్‌ డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.24 కోట్లు. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీపాట్‌గా గిన్నిస్‌ బుక్‌ తాజాగా గుర్తించింది. ఈ టీపాట్‌ ఫొటోలను, వివరాలను ట్విటర్‌లో షేర్‌  చేయగా యూజర్లను అమితంగా ఆకర్షిస్తున్నాయి. 

చేయించింది మనోడే!
ఈ అత్యంత ఖరీదైన టీపాట్‌ను తయారు చేయించింది భారత సంతతి వ్యక్తి కావడం గమనార్హం. బ్రిటిష్-ఇండియన్ బిలియనీర్ నిర్మల్ సేథియా స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ఎన్ సేథియా ఫౌండేషన్ ఈ టీపాట్‌ను తయారు చేయించింది. మరో విశేషం ఏంటంటే దీని డిజైన్‌ను నిర్మల్ సేథియా స్వయంగా రూపొందించారు. టీ వ్యాపారి అయిన నిర్మల్ సేథియా ప్రపంచంలోని అత్యుత్తమ టీలకు అంకితమిచ్చేలా ఒక టీపాట్‌ను సృష్టించాలనుకుని దీన్ని తయారు చేయించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement