
న్యూఢిల్లీ: రుణాల రివకరీకి వీలుగా తనఖాకు వచ్చిన 7 కంపెనీల షేర్లను ఆస్తుల పునర్‌నిర్మాణ సంస్థ(ఏఆర్‌సీ) జేసీ ఫ్లవర్స్‌కు బదిలీ చేసినట్లు ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. జాబితాలో డిష్ టీవీ, ఏషియన్ హోటల్స్, అవంతా రియల్టీ తదితరాలున్నట్లు పేర్కొంది. మొత్తం రూ. 48,000 కోట్ల రుణ రికవరీలో భాగంగా తాజా చర్యలు చేపట్టింది.
తనఖాకు వచ్చిన డిష్ టీవీ ఇండియాకు చెందిన దాదాపు 44.54 కోట్ల షేర్లు(24.19 శాతం వాటాకు సమానం) జేసీ ఫ్లవర్స్‌కు బదిలీ చేసినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. పొందిన రుణాలను ఎస్సెల్ గ్రూప్ తిరిగి చెల్లించడంలో విఫలంకావడంతో తాజా చర్యలు తీసుకున్నట్లు వివరించింది. ఇక ఇదే అంశంలో ఏషియన్ హోటల్స్(నార్త్)లో 7.21 శాతానికి సమానమైన 14 లక్షలకుపైగా షేర్లను జేసీ ఫ్లవర్స్ ఏఆర్‌సీకి బదిలీ చేసినట్లు తెలియజేసింది. ఈ బాటలో రియల్టీ కంపెనీ అవంతాకు చెందిన 30 శాతం వాటా(10 లక్షలకుపైగా షేర్లు), తులిప్ స్టార్ హోటల్స్‌కు చెందిన 20.61 శాతం వాటా(9.5 లక్షల షేర్లు), రోజా పవర్ సప్లై కంపెనీకి చెందిన 29.97 శాతం వాటా(12.73 కోట్ల షేర్లకుపైగా), డియాన్ గ్లోబల్‌కు చెందిన 14.11 శాతం వాటా(45.46 లక్షల షేర్లు), వడ్రాజ్ సిమెంట్‌కు చెందిన 20 శాతం వాటా(40 కోట్ల షేర్లు) బదిలీ చేసినట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment