సోనీకి ‘జీ’ హుజూర్‌! | Zee Entertainments merger with Sony Pictures | Sakshi
Sakshi News home page

సోనీకి ‘జీ’ హుజూర్‌!

Published Thu, Sep 23 2021 1:21 AM | Last Updated on Thu, Sep 23 2021 1:21 AM

Zee Entertainments merger with Sony Pictures - Sakshi

న్యూఢిల్లీ: దేశీ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో నయా డీల్‌కు తెరలేచింది. సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా(ఎస్‌పీఎన్‌ఐ)తో లిస్టెడ్‌ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌(జీల్‌) విలీనం కానుంది. ఒప్పందంలో భాగంగా విలీన సంస్థలో సోనీ 1.575 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 11,600 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనుంది. అంతేకాకుండా 52.93 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. మిగిలిన 47.07 శాతం వాటాను జీ పొందనున్నట్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పేర్కొంది. డీల్‌ ప్రకారం విలీన సంస్థ నిర్వహణ పగ్గాలను జీల్‌ ఎండీ, సీఈవో పునీత్‌ గోయెంకా చేపట్టనున్నారు.

దీంతో ఇటీవల కొద్ది రోజులుగా జీ యాజమాన్య మార్పుపై చెలరేగిన వివాదాలకు చెక్‌ పడే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. విలీన సంస్థలో మెజారిటీ బోర్డు సభ్యులను సోనీ నియమించనుంది. ఓఎఫ్‌ఐగ్లోబల్‌ చైనా ఫండ్‌తో కలిపి 17.9 శాతం వాటా కలిగిన ఇన్వెస్కో డెవలపింగ్‌ మార్కెట్స్‌ ఫండ్‌ గత వారం పునీత్‌ గోయెంకాతోపాటు.. జీ బోర్డులోని మరో ఇద్దరు సభ్యులను తప్పించమంటూ అత్యవసర సమావేశం కోసం డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజా డీల్‌ నేపథ్యంలో జీలో తలెత్తిన సంక్షోభం ముగియడంతోపాటు.. దేశీయంగా సోనీ బిజినెస్‌ మరింత విస్తరించనుంది.

90 రోజులు..
ఎస్‌పీఎన్‌ఐతో తప్పనిసరికాని(నాన్‌బైండింగ్‌) కాలానుగుణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు జీల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. డీల్‌ ద్వారా రెండు సంస్థల నెట్‌వర్క్స్, డిజిటల్‌ ఆస్తులు, ప్రొడక్షన్‌ కార్యకలాపాలు, ప్రోగ్రామ్‌ లైబ్రరీలు ఏకంకానున్నట్లు వెల్లడించింది. సంయుక్త సంస్థ 70 టీవీ చానళ్లు, 2 వీడియో స్ట్రీమింగ్‌ సరీ్వసులు(జీ5, సోనీ లివ్‌), రెండు స్టూడియోల (జీ, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా)ను కలిగి ఉంటుంది. వెరసి దేశంలో అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌గా ఆవిర్భవించనుంది. దీంతో దేశీ మార్కెట్లో సమీప ప్రత్యర్థి సంస్థగా స్టార్‌ డిస్నీ నిలవనుంది. ఒప్పందాన్ని తప్పనిసరి చేసుకునేందుకు 90 రోజుల గడువుంటుందని జీల్‌ వెల్లడించింది.   

వినియోగదారులకు మేలు
జీల్, ఎస్‌పీఎన్‌ఐల విలీనంతో దేశీయంగా అతిపెద్ద మీడియా నెట్‌వర్క్‌ బిజినెస్‌ ఏర్పాటుకానుందని సోనీ పిక్చర్స్‌ పేర్కొంది. తద్వారా కంటెంట్, సినిమాలు, క్రీడలు తదితర విభాగాలలో వినియోగదారులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలియజేసింది. విలీన ముందస్తు ఒప్పందాన్ని బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు జీల్‌ వెల్లడించింది. వాటాదారులందరికీ ఇది మేలు చేయగలదని తెలియజేసింది. అధిక వృద్ధి, లాభదాయకతలను సాధించేందుకు ఈ డీల్‌ ఉపయుక్తం కాగలదని పేర్కొంది. మరోవైపు డీల్‌ ప్రకారం జీల్‌లో 4 శాతం వాటాగల ప్రమోటర్‌ సుభాష్‌ చంద్ర కుంటుంబం వాటాను పెంచుకునేందుకు వీలు చిక్కనుంది. నిబంధనల ప్రకారం ప్రస్తుత 4 శాతం నుంచి 20 శాతానికి పెంచుకునేందుకు అవకాశముంటుందని జీల్‌ పేర్కొంది. ప్రస్తుత ఈక్విటీ విలువల ఆధారంగా విలీన నిష్పత్తి జీల్‌కు అనుగుణంగా 61.25 శాతంగా ఉండవచ్చని అంచనా.  

షేర్ల దూకుడు
యాజమాన్య మారి్పడి తదితర అంశాలపై ఇటీవల చెలరేగిన వివాదాలకు చెక్‌ పడటంతోపాటు.. సోనీ పిక్చర్స్‌తో విలీనంకానున్న నేపథ్యంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌(జీల్‌) కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఎన్‌ఎస్‌ఈలో జీల్‌ షేరు 30 శాతంపైగా దూసుకెళ్లి రూ. 334 వద్ద ముగిసింది. ఒక దశలో గరిష్టంగా రూ. 355ను సైతం అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా..రూ. 281 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇంట్రాడేలో బీఎస్‌ఈలోనూ 39 శాతం జంప్‌చేసి రూ. 355 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 7,824 కోట్లు ఎగసి రూ. 32,379 కోట్లకు చేరింది.

గ్రూప్‌ షేర్లు: జపాన్‌ దిగ్గజం సోనీ గ్రూప్‌ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థ ఎస్‌పీఎన్‌ఐతో విలీన వార్తల నేపథ్యంలో జీ గ్రూప్‌లోని ఇతర కౌంటర్లకూ డిమాండ్‌ పెరిగింది. జీ లెర్న్‌ 13 శాతంపైగా ఎగసి రూ. 16 వద్ద నిలవగా.. జీ మీడియా 5 శాతం బలపడి రూ. 12.30 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement