Sony Pictures Networks
-
జీ ఎంటర్టైన్మెంట్కు ఎన్సీఎల్ఏటీలో ఊరట
న్యూఢిల్లీ: సోనీతో విలీనానికి సంబంధించి జీ ఎంటర్టైన్మెంట్కు ఊరట లభించింది. ఈ డీల్‌కు అనుమతులను పునరాలోచన చేయాలంటూ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలను సూచిస్తూ ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వులను ఎన్సీఎల్ఏటీ తోసిపుచ్చింది. ఈ వ్యవహరంలో జీ ఎంటర్టైన్మెంట్ తన వాదనలు వినిపించేందుకే ఎన్సీఎల్టీ అవకాశం ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పే ర్కొంది. ఇరు పక్షాల వాదనలు విని కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలంటూ కేసును తిరిగి ఎన్సీఎల్టీకి పంపించింది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్, జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి 2021లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం విలీన సంస్థలో సోనీకి 50.86 శాతం, జీ వ్యవస్థాపకులకు 4 శాతం, మిగతా వాటా జీ ఎంటర్టైన్మెంట్ ఇతర షేర్హోల్డర్లకు ఉంటుంది. అయితే, షిర్పూర్ గోల్డ్ రిఫైనరీలో నిధుల మళ్లింపునకు సంబంధించి జీ ప్రమోటర్ల పేర్ల ప్రస్తావన ఉందన్న అంశంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈ .. విలీన స్కీముపై ఎన్సీఎల్టీకి సందేహాలను తెలియజేశాయి. దీనితో విలీనానికి గతంలో ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించుకుని, తదు పరి విచారణ తేదీలోగా, తగు నిర్ణయం తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) సూచించింది. దీన్ని సవాలు చేస్తూ జీ ఎంటర్టైన్మెంట్ పిటీషన్ వేయడంతో నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ తాజా ఆదేశాలు ఇచ్చింది. -
సోనీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) విలీన ప్రతిపాదనకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుంచి ఆమోదం లభించింది. ఈ విషయాన్ని జీల్ ప్రకటించింది. స్టాక్ ఎక్సే్చంజ్‌ల నుంచి ఆమోదం లభించడం బలమైన, సానుకూల ముందడుగుగా జీల్ పేర్కొంది. దీనివల్ల విలీనానికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని వివరించింది. అయితే, ఈ ప్రతిపాదిత విలీనం అన్నది ఇంకా నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. సెబీ, ఎన్‌సీఎల్‌టీల, సీసీఐ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. గతేడాది డిసెంబర్లో ఈ రెండు మీడియా సంస్థలు తప్పనిసరి విలీనానికి ఒప్పందం చేసుకోవడం గమనార్హం. నాడు ప్రకటించిన మేరకు విలీనానంతర సంస్థలో కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్‌కు 52.03% వాటా ఉంటే, జీ వాటాదారులకు 47.07% వాటా లభించనుంది. జీల్ ఎండీ, సీఈవోగా ఉన్న పునీత్ గోయెంకా.. విలీనం తర్వా త సంస్థకు ఎండీ, సీఈవోగా కొనసాగనున్నారు. -
జీ, సోనీ విలీనం దిశగా మరో ముందడుగు
న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్ఐ)లో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) విలీనం దిశగా మరో అడుగు ముందుకు పడింది. విలువ మదింపునకు సంబంధించి చర్చల ప్రక్రియకు గడువు ముగియడంతో నెట్‌వర్క్‌లు, డిజిటల్ అసెట్స్, ప్రొడక్షన్ కార్యకలాపాలు, ప్రోగ్రాం లైబ్రరీలు మొదలైన వాటిని విలీనం చేసే విధంగా ఇరు సంస్థలు నిర్దిష్ట ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జీల్, ఎస్పీఎన్ఐ ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఎస్‌పీఎన్‌ఐలో జీల్ విలీన డీల్‌ను సెప్టెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం విలీన సంస్థలో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ (ఎస్పీఈ) 1.575 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. దానికి ప్రతిగా 50.86 శాతం వాటాలు దక్కించుకుంటుంది. జీల్ ప్రమోటర్లకు (వ్యవస్థాపకులు) 3.99 శాతం, ఇతర జీల్ షేర్హోల్డర్లకు 45.15 శాతం వాటాలు ఉంటాయి. డీల్ పూర్తయ్యాక విలీన సంస్థను స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేస్తారు. జీల్ సీఈవో పునీత్ గోయెంకా ఎండీ, సీఈవోగా కొనసాగుతారు. ‘భారతీయ వినియోగదారులకు మెరుగైన వినోదం అందించేందుకు.. మీడియా రంగంలో అత్యంత పటిష్టమైన 2 టీమ్‌లు, కంటెంట్ క్రియేటర్లు, ఫిలిమ్ లైబ్రరీలను ఒక తాటిపైకి తెచ్చే దిశగా మా ప్రయత్నాల్లో ఇది కీలక అడుగు‘ అని ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఎస్పీఈ చైర్మన్ (గ్లోబల్ టెలివిజన్ స్టూడియోస్) రవి అహుజా తెలిపారు. వినియోగదారులకు విస్తృత స్థాయిలో కంటెంట్ అందించేందుకు ఈ డీల్ దోహదపడగలదని పునీత్ గోయెంకా పేర్కొన్నారు. -
సోనీకి ‘జీ’ హుజూర్!
న్యూఢిల్లీ: దేశీ ఎంటర్టైన్మెంట్ రంగంలో నయా డీల్‌కు తెరలేచింది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా(ఎస్పీఎన్ఐ)తో లిస్టెడ్ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్(జీల్) విలీనం కానుంది. ఒప్పందంలో భాగంగా విలీన సంస్థలో సోనీ 1.575 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,600 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. అంతేకాకుండా 52.93 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. మిగిలిన 47.07 శాతం వాటాను జీ పొందనున్నట్లు జీ ఎంటర్టైన్మెంట్ పేర్కొంది. డీల్ ప్రకారం విలీన సంస్థ నిర్వహణ పగ్గాలను జీల్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా చేపట్టనున్నారు. దీంతో ఇటీవల కొద్ది రోజులుగా జీ యాజమాన్య మార్పుపై చెలరేగిన వివాదాలకు చెక్ పడే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. విలీన సంస్థలో మెజారిటీ బోర్డు సభ్యులను సోనీ నియమించనుంది. ఓఎఫ్‌ఐగ్లోబల్ చైనా ఫండ్‌తో కలిపి 17.9 శాతం వాటా కలిగిన ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ గత వారం పునీత్ గోయెంకాతోపాటు.. జీ బోర్డులోని మరో ఇద్దరు సభ్యులను తప్పించమంటూ అత్యవసర సమావేశం కోసం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజా డీల్ నేపథ్యంలో జీలో తలెత్తిన సంక్షోభం ముగియడంతోపాటు.. దేశీయంగా సోనీ బిజినెస్ మరింత విస్తరించనుంది. 90 రోజులు.. ఎస్‌పీఎన్‌ఐతో తప్పనిసరికాని(నాన్‌బైండింగ్) కాలానుగుణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు జీల్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. డీల్ ద్వారా రెండు సంస్థల నెట్వర్క్స్, డిజిటల్ ఆస్తులు, ప్రొడక్షన్ కార్యకలాపాలు, ప్రోగ్రామ్ లైబ్రరీలు ఏకంకానున్నట్లు వెల్లడించింది. సంయుక్త సంస్థ 70 టీవీ చానళ్లు, 2 వీడియో స్ట్రీమింగ్ సరీ్వసులు(జీ5, సోనీ లివ్), రెండు స్టూడియోల (జీ, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా)ను కలిగి ఉంటుంది. వెరసి దేశంలో అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్‌గా ఆవిర్భవించనుంది. దీంతో దేశీ మార్కెట్లో సమీప ప్రత్యర్థి సంస్థగా స్టార్ డిస్నీ నిలవనుంది. ఒప్పందాన్ని తప్పనిసరి చేసుకునేందుకు 90 రోజుల గడువుంటుందని జీల్ వెల్లడించింది. వినియోగదారులకు మేలు జీల్, ఎస్‌పీఎన్‌ఐల విలీనంతో దేశీయంగా అతిపెద్ద మీడియా నెట్వర్క్ బిజినెస్ ఏర్పాటుకానుందని సోనీ పిక్చర్స్ పేర్కొంది. తద్వారా కంటెంట్, సినిమాలు, క్రీడలు తదితర విభాగాలలో వినియోగదారులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలియజేసింది. విలీన ముందస్తు ఒప్పందాన్ని బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు జీల్ వెల్లడించింది. వాటాదారులందరికీ ఇది మేలు చేయగలదని తెలియజేసింది. అధిక వృద్ధి, లాభదాయకతలను సాధించేందుకు ఈ డీల్ ఉపయుక్తం కాగలదని పేర్కొంది. మరోవైపు డీల్ ప్రకారం జీల్లో 4 శాతం వాటాగల ప్రమోటర్ సుభాష్ చంద్ర కుంటుంబం వాటాను పెంచుకునేందుకు వీలు చిక్కనుంది. నిబంధనల ప్రకారం ప్రస్తుత 4 శాతం నుంచి 20 శాతానికి పెంచుకునేందుకు అవకాశముంటుందని జీల్ పేర్కొంది. ప్రస్తుత ఈక్విటీ విలువల ఆధారంగా విలీన నిష్పత్తి జీల్‌కు అనుగుణంగా 61.25 శాతంగా ఉండవచ్చని అంచనా. షేర్ల దూకుడు యాజమాన్య మారి్పడి తదితర అంశాలపై ఇటీవల చెలరేగిన వివాదాలకు చెక్ పడటంతోపాటు.. సోనీ పిక్చర్స్‌తో విలీనంకానున్న నేపథ్యంలో జీ ఎంటర్టైన్మెంట్(జీల్) కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఎన్ఎస్ఈలో జీల్ షేరు 30 శాతంపైగా దూసుకెళ్లి రూ. 334 వద్ద ముగిసింది. ఒక దశలో గరిష్టంగా రూ. 355ను సైతం అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా..రూ. 281 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇంట్రాడేలో బీఎస్ఈలోనూ 39 శాతం జంప్‌చేసి రూ. 355 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 7,824 కోట్లు ఎగసి రూ. 32,379 కోట్లకు చేరింది. గ్రూప్ షేర్లు: జపాన్ దిగ్గజం సోనీ గ్రూప్ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థ ఎస్‌పీఎన్‌ఐతో విలీన వార్తల నేపథ్యంలో జీ గ్రూప్‌లోని ఇతర కౌంటర్లకూ డిమాండ్ పెరిగింది. జీ లెర్న్ 13 శాతంపైగా ఎగసి రూ. 16 వద్ద నిలవగా.. జీ మీడియా 5 శాతం బలపడి రూ. 12.30 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. -
జీ -సోనీ డీల్..! వారం రోజుల్లో సుమారు రూ. 50 కోట్ల లాభం..!
భారత మీడియా రంగంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా మధ్య విలీనం ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందానికి జీ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జీ ఎంటర్టైన్మెంట్కు 47.07 శాతం, సోనీ పిక్చర్స్ కు 52.93 శాతం మేర వాటాలు దక్కనున్నాయి. విలీనం తర్వాత సోనీ పిక్చర్స్ 1.575 బిలియన్ డాలర్ల నిధుల్ని పెట్టుబడిగా పెట్టనుంది. చదవండి: సోనీటీవీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం ! కాసుల వర్షం కురిపించిన ఒప్పందం...! జీ, సోనీ నెట్వర్క్స్ మధ్య జరిగిన ఒప్పందం...స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేశ్ జున్‌జున్‌వాలాకు కాసుల వర్షం కురిపించింది. జీ, సోనీ నెట్‌వర్క్స్‌ల విలీన వార్తలతో బుధవారం మార్కెట్లో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) షేర్లు 30% పైగా పెరిగాయి. దీంతో బిగ్‌బుల్‌కు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. గతవారం రాకేశ్ జున్‌జున్‌వాలా సుమారు 50లక్షల జీల్ షేర్లను కొనుగోలు చేశారు. జీల్ ఒక్కో షేర్‌ను రూ. 220.4 కు కొనుగోలు చేయగా ప్రస్తుతం వాటి విలువ ఏకంగా రూ. 337 పెరిగింది. దీంతో రాకేశ్ 50 శాతం మేర లాభాలను గడించారు. జీ మీడియా చీఫ్ పునీత్ గోయెంకా బోర్డు నుంచి తప్పుకున్న రోజునే రాకేశ్తోపాటుగా , యూరప్‌కు చెందిన బోఫా సెక్యూరిటీస్ సుమారు 50 లక్షల షేర్లను కొన్నారు. కాగా పలువురు ఈ డీల్ గురించి ముందే తెలిసి జీల్ భారీగా షేర్లను కొన్నట్లు సోషల్‌మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కచ్చితంగా ఇన్సైడర్ ట్రేండింగ్ జరిగి ఉండవచ్చునని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జీ సీఈఓగా ఉన్న పునీత్ గోయెంకా విలీన సంస్థకు ఐదేళ్ల పాటు ఎండీ, సీఈఓగా వ్యవహరించడం గమనార్హం. దక్షిణాసియాలో ప్రధాన మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీగా నిలబెట్టేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. అలాగే కంపెనీ వాటాదార్లకూ ఇది లాభదాయకమని జీ మీడియా వెల్లడించింది. చదవండి: చైనాకు కేంద్రం మరో షాక్ ఇవ్వనుందా..? -
సోనీటీవీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం !
భారత మీడియా రంగంలో రెండు సంస్థల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. సోనీ టీవీలో..జీ ఎంటర్ టైన్మెంట్ విలీనమైంది. కంటెంట్ క్రియేషన్‌లో గత మూడు దశాబ్దాలుగా వ్యూయర్స్‌ను ఆకట్టుకుంటున్న జీఎంటర్ టైన్మెంట్ పలు కీలక పరిణామల నేపథ్యంలో సోనీ టీవీలో విలీనం అయ్యేందుకు సిద్ధ పడింది. ఇందుకు జీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలపడంతో విలీనం ఖరారైంది. దీంతో విలీనం తర్వాత ఏర్పడే సంస్థలో జీ ఎంటర్టైన్మెంట్కు 47 శాతం, ఎస్పీఎన్ఐకు 52 శాతం వాటాలు దక్కనున్నాయి. ప్రస్తుతం జీ ఎంటర్ టైన్మెంట్ సీఈఓగా ఉన్న పునీత్ గోయెంకా విలీన సంస్థకు ఐదేళ్ల పాటు ఎండీ, సీఈఓగా వ్యవహరించనున్నారు. జీ లెర్న్, జీ మీడియాకూ సెగ! మరో వైపు జీ ఎంటర్టైన్మెంట్, డిష్ టీవీ తదుపరి జీ లెర్న్, జీ మీడియాలపై సుభాష్ చంద్ర కుటుంబానికి వాటాదారుల నుంచి అసమ్మతి సెగ తగలనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.తొలుత డిష్ టీవీలో సవాళ్లు ఎదురుకాగా..గత వారం జీ ఎంటర్టైన్మెంట్ నుంచి ప్రమోటర్లతో పాటు,పునీత్ గోయెంకా అధ్యక్షతన ఏర్పాటైన మేనేజ్మెంట్ను తొలగించడంపై ఈజీఏం ఏర్పాటుకు డిమాండ్లు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ లెర్న్, జీ మీడియా నుంచి సైతం సుభాష్ చంద్రకు చెందిన ప్రమోటర్ ఎస్సెల్ గ్రూప్‌నకు వ్యతిరేకంగా వాటాదారులు గళమెత్తే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈజీఎం ఏర్పాటుకు వాటాదారులు పట్టుబట్టే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డాయి. అయితే జీ ఎంటర్టైన్మెంట్లో సుభాష్ చంద్ర వాటా 3.99 శాతమేకాగా.. జూన్‌కల్లా జీ లెర్న్‌లో 21.69 శాతం, జీ మీడియా కార్పొరేషన్లో 14.72 శాతం చొప్పున ప్రమోటర్లు వాటాను కలిగి ఉన్నారు. -
మహేశ్ బ్యానర్లో శేష్
ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, హీరో మహేశ్‌బాబు నిర్మాణ సంస్థ జి.మహేశ్‌బాబు (జిఎంబి) ఎంటర్టైన్మెంట్ కలయికలో ‘మేజర్’ అనే భారీచిత్రం రూపొందనుంది. అడివి శేష్ హీరోగా నటించనున్నారు. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. అడివి ఎంటర్టైన్మెంట్, శరత్చంద్ర, ఎ+జి మూవీస్ సహ నిర్మాతలు. ఈ ఏడాది వేసవిలో షూటింగ్ ప్రారంభించి, 2020లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం ద్వారా సోనీ పిక్చర్స్ సంస్థ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ హెడ్ లెయినె క్లెయినె మాట్లాడుతూ– ‘‘ప్యాడ్ మాన్, 102 నాటౌట్’ వంటి బాలీవుడ్ చిత్రాలతోపాటు మలయాళ చిత్రం ‘9’ని ప్రేక్షకులకు అందించి వారికి దగ్గరయ్యాం. మన దేశంలోని వారిని, సరిహద్దులను దాటి ఉన్న భారతీయులను ఇన్స్పైర్ చేసే చిత్రం ‘మేజర్’’ అన్నారు. ‘‘మహేశ్‌గారు, నమ్రతగారితో అసోసియేట్ కావడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కృష్ణాని అన్నారు. జి.మహేష్‌బాబు ఎంటర్టైన్మెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ నమ్రత మాట్లాడుతూ– ‘‘ఇండియన్ సినిమాల్లోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సినిమాలను తీసుకొచ్చేలా సోనీ పిక్చర్స్‌తో కలిసి ముందుకు వెళ్తాం’’ అన్నారు. -
టాటా స్కై యూజర్లకు షాక్ : సోని ఛానల్స్ క్లోజ్
ముంబై : 1.6 కోట్ల టాటా స్కై సబ్స్క్రైబర్లకు షాకింగ్ న్యూస్. మీకు ఎంతో ఇష్టమైన, నిరంతరం చూసే సోని పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా(ఎస్పీఎన్)కు చెందిన 32 ఛానల్స్‌ను టాటా స్కై తన ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. అంతేకాక ఇండియా టుడే నెట్‌వర్క్‌కు చెందిన మూడు ఛానల్స్‌ను కూడా తన ప్లాట్‌ఫామ్‌ను నుంచి తొలగిస్తున్నట్టు టాటా స్కై వెల్లడించింది. ధరల సమస్యలతో ఈ ఛానల్స్‌ను తన ప్లాట్‌ఫామ్ నుంచి తొలగిస్తున్నట్టు టాటా స్కై ప్రకటించింది. టాటా స్కై ఆపివేసిన ఛానల్స్ల్లో పాపులర్ టీవీ ఛానల్స్ సోని ఎంటర్టైన్మెంట్ టెలివిజన్, ఎస్‌ఏబీ, మ్యాక్స్, ఏఎక్స్‌ఎన్, సోని పిక్స్, ఆజ్ తక్, ఇండియా టుడే ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి టాటా స్కైలో ఈ ఛానల్స్‌ను ప్రసారం చేయడం లేదు. ఈ విషయం తెలిసిన కొంతమంది సబ్స్క్రైబర్లు ఇప్పటికే టాటా స్కైపై మండిపడుతున్నారు. ట్విటర్, ఫేస్బుక్ వేదికగా విమర్శలు కురిపిస్తున్నారు. టాటా స్కై నిర్ణయం దురదృష్టకరమైనదని సోని పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా ప్రకటించింది. టాటా స్కైతో సోని పిక్చర్స్‌కు ఉన్న మూడేళ్ల డిస్ట్రిబ్యూషన్ డీల్ జూలై 31తో ముగిసింది. కొత్త డీల్‌పై ఇరు పార్టీలు చర్చించుకోవాల్సి ఉంది. కానీ ధరల విషయంలో ఈ రెండింటికీ పొంతన కుదరలేదు. మూడేళ్ల క్రితం టాటా స్కై సబ్స్క్రైబర్ల సంఖ్య కోటి వరకు ఉంటుంది. ప్రస్తుతం ఆ సంఖ్య 1.6 కోటికి పైగా చేరింది. టాటా స్కై తమకు ఎక్కువ రెవెన్యూ ఇవ్వాలని సోని పిక్చర్స్ డిమాండ్ చేసింది. దానికి టాటా స్కై ఆమోదించలేదు. ‘సోని పిక్చర్స్‌తో ఉన్న వాణిజ్య చర్చలు విఫలమయ్యాయి. ధరలు పెంచాలని వారు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో మేము కొన్ని ఛానల్స్‌ను తొలగించాలని నిర్ణయించాం. సబ్స్క్రైబర్లు అర్థం చేసుకోవాలి’ టాటా స్కై ఎండీ హరిత్ నాగ్‌పాల్ కోరారు. అయితే సోని పిక్చర్స్ మాత్రం టాటా స్కైపై తీవ్ర ఆరోపణలు చేసింది. వినియోగదారుల ఆసక్తికి తగ్గట్టు టాటా స్కై వ్యవహరించడం లేదని, వరల్డ్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ను, లైవ్ స్పోర్టింగ్ యాక్షన్‌ను చూసే అవకాశాన్ని యూజర్లకు టాటా స్కై ఇవ్వడం లేదని సోని పిక్చర్స్ అధికారి ప్రతినిధి ఆరోపించారు. తమ ఛానల్స్‌ను చూడాలనుకునే వారు, తమకు సెపరేటుగా మిస్డ్ కాల్ ఇవ్వాలని తెలిపింది. అయితే మిస్డ్ కాల్ ఇవ్వాలంటూ.. ఇచ్చిన నెంబర్ కలువడం లేదు. కస్టమర్ కేర్ సర్వీసు క్రాష్ అయింది. దీంతో సబ్స్క్రైబర్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. అయితే 10 సోని పిక్చర్స్ ఛానల్స్‌ను మాత్రం టాటా స్కై అలానే ఉంచింది. టాటా స్కై తన ప్లాట్‌ఫామ్‌పై తొలగించకుండా ఉంచిన ఛానల్స్ల్లో ఎస్ఈటీ, ఎస్ఈటీ హెచ్డీ, సోని ఎస్‌ఏబీ, మ్యాక్స్, సోని సిక్స్, సోని టెన్, టెన్ 1 హెచ్డీ, సోని టెన్ 2 హెచ్డీ, సోని టెన్ 3, పిక్స్ హెచ్డీ, వన్ ఇండియా టుడే ఛానల్(ఆజ్ తక్) ఉన్నాయి. -
సోనీ చేతికి టెన్‌స్పోర్ట్స్
స్పోర్ట్స్ నెట్వర్క్ విక్రయానికి జీ ఎంటర్టైన్మెంట్ ఒప్పందం * డీల్ విలువ రూ.2,579 కోట్లు... న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్ప్రైజ్(జీల్) తన స్పోర్ట్స్ చానెల్ నెట్వర్క్.. టెన్ స్పోర్ట్స్‌ను సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్(ఎస్పీఎన్)కు విక్రయించింది. ఈ ఒప్పందానికి సంబంధించి కంపెనీ డెరైక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్లు జీల్ బుధవారం వెల్లడించింది. పూర్తిగా నగదు రూపంలో జరిగే ఈ డీల్ విలువ 38.5 కోట్ల డాలర్లు(దాదాపు రూ.2,579 కోట్లు)గా పేర్కొంది. ఎస్పీఎల్తో ఈ మేరకు తమ సబ్సిడరీలతో పాటు ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు తెలిపింది. జీల్‌కు చెందిన స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ బిజినెస్ ప్రస్తుత సబ్సిడరీ తాజ్ టీవీ లిమిటెడ్-మారిషస్ నేతృత్వంలో ఉంది. టెన్ బ్రాండ్ టీవీ చానల్స్ ప్రసార, పంపిణీ కార్యకలాపాలన్నీ ఈ సంస్థే చూస్తోంది. అయితే, భారత్‌లో దీనికి సంబంధించిన డౌన్‌లింకింగ్, పంపిణీ, మార్కెటింగ్, యాడ్లు ఇతరత్రా అంశాలన్నీ ఎక్స్‌క్లూజివ్ ఏజెంట్ అయిన తాజ్ టెలివిజన్(ఇండియా) చేపడుతోంది. కాగా, టెన్ స్పోర్ట్స్ నెట్వర్క్ కొనుగోలుతో క్రికెట్, ఫుట్‌బాల్, ఫైట్ స్పోర్ట్స్ విభాగాల్లో తమ వీక్షకులకు మరింత కంటెంట్ అందుబాటులోకి వస్తుందని; దేశీ, విదేశీ స్పోర్టింగ్ ప్రాపర్టీకి అదనపు బలం చేకూరుతుందని ఎస్పీఎన్ ఇండియా సీఈఓ ఎన్పీ సింగ్ పేర్కొన్నారు. జీల్ 2015-16 కన్సాలిడేటెడ్ ఆదాయంలో స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ బిజినెస్ వాటా రూ.631 కోట్లుగా నమోదైంది. అయితే, ఈ విభాగం రూ.37.2 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. టెన్ స్పోర్ట్స్‌ను జీల్ దుబాయ్ పారిశ్రామికవేత్త అబ్దుల్ రహమాన్ బుఖాతిర్కు చెందిన తాజ్ గ్రూప్ నుంచి 2006లో కొనుగోలు చేసింది. ఈ నెట్‌వర్క్‌లో టెన్-1, 1హెచ్డీ, 2, 3, గోల్ఫ్ హెచ్డీ, క్రికెట్, స్పోర్ట్స్ ఉన్నాయి. భారత్ ఉపఖండం, మాల్దీవులు, సింగపూర్, హాంకాంగ్, మధ్య ప్రాచ్యం, కరేబియన్ తదితర దేశాల్లో ఈ చానెల్స్ ప్రసారం అవుతున్నాయి. కాగా, వివిధ నియంత్రణ సంస్థల ఆమోదానికిలోబడి ఒప్పందం పూర్తవుతుందని జీల్ వెల్లడించింది.