ముంబై : 1.6 కోట్ల టాటా స్కై సబ్‌స్క్రైబర్లకు షాకింగ్ న్యూస్. మీకు ఎంతో ఇష్టమైన, నిరంతరం చూసే సోని పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా(ఎస్‌పీఎన్)కు చెందిన 32 ఛానల్స్‌ను టాటా స్కై తన ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. అంతేకాక ఇండియా టుడే నెట్‌వర్క్‌కు చెందిన మూడు ఛానల్స్‌ను కూడా తన ప్లాట్‌ఫామ్‌ను నుంచి తొలగిస్తున్నట్టు టాటా స్కై వెల్లడించింది. ధరల సమస్యలతో ఈ ఛానల్స్‌ను తన ప్లాట్‌ఫామ్ నుంచి తొలగిస్తున్నట్టు టాటా స్కై ప్రకటించింది. టాటా స్కై ఆపివేసిన ఛానల్స్‌ల్లో పాపులర్ టీవీ ఛానల్స్ సోని ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్, ఎస్‌ఏబీ, మ్యాక్స్, ఏఎక్స్‌ఎన్, సోని పిక్స్, ఆజ్ తక్, ఇండియా టుడే ఉన్నాయి.
అక్టోబర్ 1 నుంచి టాటా స్కైలో ఈ ఛానల్స్‌ను ప్రసారం చేయడం లేదు. ఈ విషయం తెలిసిన కొంతమంది సబ్‌స్క్రైబర్లు ఇప్పటికే టాటా స్కైపై మండిపడుతున్నారు. ట్విటర్, ఫేస్‌బుక్ వేదికగా విమర్శలు కురిపిస్తున్నారు. టాటా స్కై నిర్ణయం దురదృష్టకరమైనదని సోని పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా ప్రకటించింది. టాటా స్కైతో సోని పిక్చర్స్‌కు ఉన్న మూడేళ్ల డిస్ట్రిబ్యూషన్ డీల్ జూలై 31తో ముగిసింది. కొత్త డీల్‌పై ఇరు పార్టీలు చర్చించుకోవాల్సి ఉంది. కానీ ధరల విషయంలో ఈ రెండింటికీ పొంతన కుదరలేదు. మూడేళ్ల క్రితం టాటా స్కై సబ్‌స్క్రైబర్ల సంఖ్య కోటి వరకు ఉంటుంది. ప్రస్తుతం ఆ సంఖ్య 1.6 కోటికి పైగా చేరింది. టాటా స్కై తమకు ఎక్కువ రెవెన్యూ ఇవ్వాలని సోని పిక్చర్స్ డిమాండ్ చేసింది. దానికి టాటా స్కై ఆమోదించలేదు.
‘సోని పిక్చర్స్‌తో ఉన్న వాణిజ్య చర్చలు విఫలమయ్యాయి. ధరలు పెంచాలని వారు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో మేము కొన్ని ఛానల్స్‌ను తొలగించాలని నిర్ణయించాం. సబ్‌స్క్రైబర్లు అర్థం చేసుకోవాలి’ టాటా స్కై ఎండీ హరిత్ నాగ్‌పాల్ కోరారు. అయితే సోని పిక్చర్స్ మాత్రం టాటా స్కైపై తీవ్ర ఆరోపణలు చేసింది. వినియోగదారుల ఆసక్తికి తగ్గట్టు టాటా స్కై వ్యవహరించడం లేదని, వరల్డ్ క్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను, లైవ్ స్పోర్టింగ్ యాక్షన్‌ను చూసే అవకాశాన్ని యూజర్లకు టాటా స్కై ఇవ్వడం లేదని సోని పిక్చర్స్ అధికారి ప్రతినిధి ఆరోపించారు. తమ ఛానల్స్‌ను చూడాలనుకునే వారు, తమకు సెపరేటుగా మిస్‌డ్ కాల్ ఇవ్వాలని తెలిపింది. అయితే మిస్‌డ్ కాల్ ఇవ్వాలంటూ.. ఇచ్చిన నెంబర్ కలువడం లేదు. కస్టమర్ కేర్ సర్వీసు క్రాష్ అయింది. దీంతో సబ్‌స్క్రైబర్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
అయితే 10 సోని పిక్చర్స్ ఛానల్స్‌ను మాత్రం టాటా స్కై అలానే ఉంచింది. టాటా స్కై తన ప్లాట్‌ఫామ్‌పై తొలగించకుండా ఉంచిన ఛానల్స్‌ల్లో ఎస్‌ఈటీ, ఎస్‌ఈటీ హెచ్‌డీ, సోని ఎస్‌ఏబీ, మ్యాక్స్, సోని సిక్స్, సోని టెన్, టెన్ 1 హెచ్‌డీ, సోని టెన్ 2 హెచ్‌డీ, సోని టెన్ 3, పిక్స్ హెచ్‌డీ, వన్ ఇండియా టుడే ఛానల్(ఆజ్ తక్) ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment