
న్యూఢిల్లీ: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్ న్యూట్రల్ డెలివరీలను చేపడుతున్నట్టు ప్రకటించింది. అంటే డెలివరీల్లో భాగంగా వినియోగించిన ప్లాస్టిక్‌కు సమాన మొత్తాన్ని 100 శాతం రీసైకిల్ చేస్తారు. ఇందుకోసం ఐఎస్‌వో ధ్రువీకరణ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సంస్థలతో చేతులు కలుపుతోంది.
ఈ సంస్థలు ప్లాస్టిక్‌ను సేకరించి ప్రాసెస్ చేస్తాయి. స్థిర ప్యాకేజింగ్ విధానంలో మూడేళ్లలో 10 కోట్ల ఆర్డర్లను పూర్తి చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు జొమాటో ఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. ‘ప్రస్తుతం ప్లాస్టిక్ లభిస్తున్న ధరలో అందుబాటులోకి వచ్చేలా బయోడీగ్రేడబుల్, ఇతర ప్లాస్టికేతర ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం ముఖ్యమని కంపెనీ గుర్తించింది. ఫుడ్ డెలివరీలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం, తొలగించడం కోసం మరింత కృషి జరగాల్సి ఉంది.
అన్ని రకాల వంటకాలకు స్థిరమైన ప్యాకేజింగ్‌ను అభివృద్ధి చేయడానికి, ప్రోత్సహించడానికి ప్రయత్నాలను పెంచుతున్నాం. ఈ చొరవతో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చవుతుంది. ఆదాయం, లాభంపైనా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. భూమికి ఏది మంచిదో అది వ్యాపారానికీ మంచిదని నేను గట్టిగా నమ్ముతున్నాను. మిగతావన్నీ సరిగ్గా చేసినప్పుడు లాభాలు వస్తాయని కూడా విశ్వసిస్తున్నాను. ఇది ఖచ్చితంగా సరైన దిశలో ఒక అడుగు’ అని ఆయన అన్నారు.
చదవండి: జొమాటో కంటే ముందుగానే...10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ ప్రారంభించిన గ్రాసరీ సంస్థ..!
Comments
Please login to add a commentAdd a comment