
● కుశస్థలిని కుళ్లబొడిచేస్తున్నారు ● ఉచితమని ఊడ్చేస్తున
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆ పార్టీలోని ఇసుకాసురులు బరితెగించారు. ఉచిత ఇసుక పథకం కూటమి నేతలకు వరంగా మారింది. నగరి కుశస్థలి నది నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా
విచ్చలవిడిగా రవాణా చేస్తూ ఉచితం పేరుతో ఇసుకను ఊడ్చేస్తున్నారు. వాల్టా చట్టాన్ని ఉచిత ఇసుక ముసుగులో బోల్తా
కొట్టిస్తున్నారు. ఇసుకాసురుల ఆగడాలతో నది గట్టుకు కాల కృత్యాలకు వెళ్లే మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. దీంతో గ్రామస్థులు కన్నెర్ర చేశారు. రోడ్డెక్కి రాస్తారోకో చేస్తూ సమస్య పరిష్కారం అయ్యే దాకా
లేవమంటూ భీష్మించుకూర్చున్నారు.
రోడ్డుపై కూర్చొని రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులు
నగరి : కూటమి పాలన వచ్చినప్పటి నుంచి ఇసుకపైనే ఆ పార్టీ నేతలు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇసుక దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఉచిత ఇసుక పేరుతో కుశస్థలి నదిని కుళ్లబొడిచేస్తున్నారు. సత్రవాడ ప్రాంతంలో రాత్రి, పగలు తేడా తెలియకుండా ఇసుకను దోచేస్తుండటం, ఉదయాన్నే కుశస్థలి నది గట్టుపైకి కాల కృత్యాలకు వెళ్లే మహిళలపై ఇసుక తరలింపుదారులు అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో మున్సిపల్ పరిధి సత్రవాడ, వినాయకపురం గ్రామస్థులు తీవ్ర ఆగ్రహంతో రోడ్డెక్కారు. ఇసుక తరలింపుదారుల ఆగడాలు తట్టుకోలేకపోతున్నామంటూ ట్రాక్టర్లు ప్రయాణించే దారిలో రాస్తారోకో చేశారు. అనంతరం సచివాయం ఎదురుగా రోడ్డుపై కూర్చొని ఆందోళన చేపట్టారు. ఇసుక తరలింపునకు అడ్డుకట్ట వేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. వేలాపాలా లేకుండా రాత్రింభవళ్లు ఇసుక తరలింపు జరుగుతోందన్నారు. ప్రభుత్వం అవసరాలకు ఇసుక ఉచితం అంటే దాన్ని వ్యాపారంగా మార్చేసి తరలించేస్తున్నారన్నారు. వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కేశారని వాపోయారు. వంతెన సమీపంలో విచ్చల విడిగా ఇసుకను అక్రమంగా తరలించి లక్షలు ఆర్జిస్తున్నారని తెలిపారు. నది నుంచి ఇసుక తరలించే మార్గం అధ్వానంగా తయారైందన్నారు. ఆ దారిలో వాహనాల్లో వెళ్లేవారు అదుపు తప్పి పడిపోతున్నారన్నారు. మితి మీరిన వేగంతో ట్రాక్టర్లు వెళుతున్నాయని పిల్లలను బయటకు పంపడానికి భయమేసే పరిస్థితులు దాపురించాయన్నారు. మహిళలు వేకువ జామున కాలకృత్యాలకు నది గట్టుకు వెళితే ఇసుక తరలింపుదారులు సెల్‌ఫోన్ల ద్వారా ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గట్టుపై గుంపుగా కూర్చొనిమద్యం తాగుతూ అటువైపు వచ్చే ఆడ పిల్లలను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రశ్నిస్తే దుర్భాషలాడుతూ.. భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారని వాపోయారు. ఈ సమస్యలకు ముగింపు పలికే దాకా ధర్నా విరమించమంటూ భీష్మించు కూర్చున్నారు. ఇంతగా ధర్నా చేస్తున్నా ఉన్నతాధికారులైన ఆర్డీవో, డీఎస్పీ ఎందుకు ఇక్కడికి రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ధర్నా జరిగే ప్రాంతానికి చేరుకొని నిరసన కారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని వారు పట్టుబట్టారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ సయ్యద్ మహ్మద్ అజీజ్ నిరసన కారులతో చర్చించారు. ఇకపై ఈ ప్రాంతం నుంచి ఇసుక తరలింపు జరగదని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో నిరసన కారులు రోడ్డుపై నుంచి లేచారు.

● కుశస్థలిని కుళ్లబొడిచేస్తున్నారు ● ఉచితమని ఊడ్చేస్తున

● కుశస్థలిని కుళ్లబొడిచేస్తున్నారు ● ఉచితమని ఊడ్చేస్తున
Comments
Please login to add a commentAdd a comment