దర్జాగా ప్రభుత్వ భూముల ఆక్రమణ
– పట్టించుకోని రెవెన్యూ అధికారులు
పాలసముద్రం : మండలంలోని వనదుర్గాపురం పంచాయతీ తమిళనాడు సరిహద్దులో ఆదివారం ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలు వెనుకుండి తమిళనాడు వాసులతో చదును చేయించారు. తమిళనాడు సరిహద్దులో భూముల ధరలు రూ.లక్షల్లో పలుకుతున్నాయి. ఈ ప్రభుత్వ భూములపై కన్నేసిన కూటమి నేతలు కుట్రకు తెర తీశారు. ప్రభుత్వ భూములను చదును చేయించి తమిళనాడు వాసులకు పట్టాలు ఇప్పించి ముందే వారితో డబ్బులకు మాట్లాడుకొని ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. ఎలాగూ ఇళ్లు నిర్మించుకున్నారని అధికారులకు చెప్పి వారికే పట్టాలు కట్టబెడితే చేతికి మట్టి అంటకుండా పోతుందని భవిష్యత్తు అక్రమాలకు ముందు చూపుతో వ్యవహరించడం కొసమెరుపు. వనదుర్గాపురం గ్రామానికి చెందిన టీడీపీ బడా నాయకుడు అండదండలతోనే ఈ భూ ఆక్రమణ జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దుర్మార్గపు ఆలోచనతో చేస్తున్న కూటమి నేతల పన్నాగాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment