– కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో స్కానింగ్ సెంటర్లపై డెకాయి ఆపరేషన్‌లు నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుపై సమీక్ష నిర్వహించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం–1994 (పీసీపీఎన్‌డీటీ) అమలును జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లాలో ప్రతి 1000 మంది మగ శిశువులకు 954 మంది ఆడ శిశువులు ఉన్నారన్నారు. ఆడ పిల్లలను కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
భ్రూణ హత్యలకు పాల్పడితే చర్యలు
చట్టవిరుద్ధమైన కార్యకలాపాలైన లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు, న్యాయపరమైన శిక్షలు అమలు చేయాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ, పోలీసు, విజిలెన్స్ శాఖలు నిఘా పెట్టాలన్నారు.
డెకాయి ఆపరేషన్‌లు చేపట్టండి....
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో డెకాయి ఆపరేషన్‌లు చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా డీఎంఅండ్‌హెచ్‌ఓ వద్ద అనుమతులు పొందాలన్నారు. సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి, డీసీహెచ్‌ఎస్ ప్రభావతి, డీఈఓ వరలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చెన్నయ్య, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment