● రైతాంగాన్ని నిలువెల్లా మోసం చేసిన కూటమి సర్కారు ● పెట
కూటమి సర్కారు ‘అన్నదాత సుఖీభవ’ అని పేరు పెట్టి.. రైతన్న నోట్లో మట్టి కొట్టింది. ఇప్పటికే ఖరీఫ్, రబీ పంట కాలం ముగిసినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదు.. రైతులపై కనికరం చూపడం లేదు. పంటల సాగుకు పెట్టుబడి సాయం అందజేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీలు గుప్పించారు. తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెట్టుబడి సాయం ఊసే లేకపోవడంపై బాబు చేతిలో మరోసారి మోససోయామని అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
చిత్తూరు అర్బన్: అన్నదాత సుఖీభవ.. పేరు ఎక్కడో విన్నట్టుందనుకుంటున్నారా..! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతు పంట సాగు చేసుకోవడానికి పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు ఇస్తామని.. దానికి అన్నదాత సుఖీభవగా నామకరణం చేస్తున్నట్లు ఎన్నికలకు ముందు కూటమి నేతలు సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ పేరు ఇది. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల్లో రెండు సీజన్లు ముగిసిపోతున్నా.. రైతులకు ఒక్క రూపాయి పెట్టుబడి సాయం అందలేదు.
సాగు భారం
గత ఏడాది జూన్‌లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటికే జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యింది. జిల్లాలోని 36 మండలాల్లో ఖరీఫ్‌లో 81,169 హెక్టార్లలో వేరుశనగ, కంది, రాగి, ఉలవలు, సజ్జలు ఇతర పంటలు సాగు చేయాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం దగా చేసి, అన్నదాతకు అండగా నిలబడకపోవడంతో కేవలం 33,920 హెక్టార్లలో మాత్రమే పంటల సాగుకు పరిమితమయింది. ఇక నాలుగు నెలల క్రితం ప్రారంభమైన రబీ సీజన్.. మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఈ రబీలో జిల్లాలో 23,387 హెక్టార్లు వరకు వరి, మిరప, రాగి, ఉలవలు, వేరుశనగ, చెరకు లాంటి ప్రధాన పంటల సాగు చేయాల్సి ఉంటే.. సీజన్ ముగుస్తున్న వేళ 18,017 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నైరుతి రుతు పవనాల్లో జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడక.. రైతులకు కన్నీళ్లను మిగిల్చింది. రబీలోనైనా ప్రభుత్వం పంటలు వేసుకోవడానికి పెట్టబడి సాయం ఇస్తారని కోటి ఆశలతో ఎదురు చూసిన హాలికులకు ఈ సీజన్‌లోనూ నిరాశే మిగిలింది.
రూ.252 కోట్ల బకాయి
జిల్లాలో దాదాపు రెండు లక్షల మంది రైతులకు రూ.280 కోట్లకు పైనే పెట్టబడి సాయం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం బకాయి పడింది. కొందరు రైతులు అసలు పంట జోలికే వెళ్లకపోగా.. మరి కొందరు పంట వేసుకోవడానికి పెట్టుబడుల కోసం చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం అందకపోవడంతో వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు.
రూ.886 కోట్లు అందించిన గత ప్రభుత్వం
ఇచ్చిన మాటకు కట్టుబడడమే ధ్యేయంగా గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా ఖరీఫ్ ఆరంభంలోనే రైతులకు రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తూ వచ్చింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులు కష్ట నష్టాల్లో ఉంటే నాటి సీఎం వైఎస్ జగన్ అండగా నిలబడ్డారు. ఏటా క్రమం తప్పకుండా జూన్, అక్టోబర్, జవవరి నెలల్లో ప్రతి రైతుకు పీఎం కిసాన్‌తో కలిపి రూ.13,500 ప్రకారం జమ చేశారు. కౌలు రైతులు, దేవదాయ, అటవీ భూమి సాగుదారులకు కేంద్రంతో సంబంధం లేకుండా పూర్తి స్థాయి పెట్టుబడి సాయం అందించారు. జిల్లాలోని రైతాంగానికి ఆయన సీఎంగా ఉన్న అయిదేళ్లల్లో పెట్టుబడి సాయంగా ఏకంగా రూ.886.31 కోట్లు అందించి అన్నదాతలకు అండగా నిలిచారు.
కేంద్ర సాయం సంపూర్ణం
కూటమి ప్రభుత్వంతో పాటు అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని మోదీ సర్కారు రైతులకు ఇవ్వాల్సిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి జమ కావాల్సి రూ.6 వేలను మూ డు విడతలుగా చెల్లించేసింది. సోమవారం మూడో విడతగా 1,80,184 మందికి రూ.2 వేలు చొప్పున రూ.36.03 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో కేంద్ర సాయం సంపూర్ణంగా అందినట్లయ్యింది. కా నీ ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖరీఫ్, రబీ సీజన్లు వెళ్లిపోతున్నా.. అదిగో, ఇదిగో అంటూ అన్నదాతను దుఖఃపెట్టడమే ధ్యేయంగా పెట్టుకుంటూ ఏమారుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment