టీడీపీ కంచుకోటకు బీటలు
● కేవీపీఆర్‌పేటలో మార్పునకు తొలి అడుగు ● ‘రోజా’కు జననీరా‘జనం’
నగరి : కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయకపోవడం, హామీలు అమలు చేయలేమని చేతులెత్తేయడంతో ఓట్లేసిన ప్రజలు విస్తుపోతున్నారు. బాబు చేతిలో మరోసారి మోసపోయామని ప్రజలకు అర్థమవుతోంది. ఆలోచించకుండా మంచి చేసిన ప్రభుత్వాన్ని చేజేతులా వదులుకున్నామే అంటూ ఆవేదనకు లోనవుతున్నారు. దీంతో మున్సిపల్ పరిధిలో టీడీపీకి కంచుకోటగా ఉన్న కేవీపీఆర్ పేట నుంచి అయ్యప్పన్ అనే టీడీపీ నాయకుడు ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగనన్న నేతృత్వంలో మాజీమంత్రి ఆర్కే రోజా నాయకత్వాన్ని బలపరిచారు. తమ ప్రాంతంలో నిర్వహించే శివరాత్రి ఉత్సవాలకు మాజీ మంత్రి ఆర్కేరోజాకు ఆహ్వానం పలికారు. ఉత్సవాలకు హాజరైన ఆమెకు దారి పొడవునా ప్రవాహంలా వచ్చిన జనం డప్పు వాయిద్యాలు, నృత్యాల నడుమ నీరాజనం పలికారు. స్వతాగా జనం కదలివచ్చిన తీరు కూటమి పాలనపై విసుగు చెందారని, మార్పువైపుగా ప్రజలు పయణిస్తున్నారనే విషయం తేటతెల్లం అయింది. అరుణాచలేశ్వరుని దర్శనానంతరం మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. జగనన్న నేతృత్వంలోని తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజాసంక్షేమాన్ని ఆలోచించే పనిచేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలను ప్రలోభాలకు గురిచేసి అనుకున్నది సాధించి ఆపై ప్రజలను నట్టేట వదిలేశారన్నారు. ఇప్పటికే ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఆ మార్పునకు కేవీపీఆర్ పేటలోనే బీజం పడిందన్నారు. ఆమె వెంట మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, కౌన్సిలర్లు గంగాధరం, బీడీ భాస్కర్, మురుగ, బాబు, ఇంద్రయ్య, మోహన్‌రాజ్, భూపాలన్, బాలన్, స్థానిక నాయకులు ఈవీ బాలకృష్ణ, ఏజీ భాస్కర్, టీపీ సురేష్, కన్నాయిరం, సంబంధం, తనికాచలమొదలి, భూపతి, షణ్ముగం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment