నాడు పండుగ.. నేడు దండగ
● రైతుకు దూరంగా సేవలు ● రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం ● రైతు ముంగిటకే అందని విత్తనాలు, ఎరువులు ● రేషనలైజేషన్ పేరుతో కూటమి కుట్ర
చిత్తూరు రూరల్ (కాణిపాకం): గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్నదాతలు ఊరు దాటకుండా విత్తనం నుంచి పంటల విక్రయం వరకు అన్ని రకాలుగా సేవలందించిన రైతు భరోసా కేంద్రాలకు ఉరి వేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆర్‌బీకేల ద్వారా అందించే ఎరువులు, పురుగు మందులు, తదితర సేవలను కుదించి ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసిన సర్కారు తాజాగా రేషనలైజేషన్ పేరుతో వాటికి మంగళం పాడేందుకు కసరత్తు చేస్తోంది.
పట్టణ ప్రాంతాలతో పాటు తీర ప్రాంతాల్లోని వాటిని ఎత్తివేయాలని నిర్ణయానికి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం ఆధారంగా రెండు, మూడింటిని విలీనం చేసి భారీగా కుదించాలని భావిస్తోంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
కొనుగోలు కేంద్రాలు
రైతులు పండించే ధాన్యం దళారుల పాలు కాకుండా ఆర్బీకేల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ–క్రాప్ బుకింగ్ చేయించుకున్న రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధరను అందజేసే పరిస్థితి ఉండేది. ఈ–క్రాప్ బుకింగ్ చేసుకున్న వారికి ఉచిత పంటల బీమా వర్తించేది. పంటలు నష్టానికి గురైన సమయంలో ఎన్యూమరేషన్ నిర్వహించి వీలైనంత త్వరగా రైతులకు పరిహారాన్ని అందజేయడంలో వీటి పాత్ర కీలకంగా ఉండేది. వ్యవసాయ అనుబంధ శాఖలైన పశుసంవర్థక, సూక్ష్మసేద్యం, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల్లో రాయితీలను పొందాలనుకునే రైతులు ఆర్బీకేల ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉండేది. వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఆర్బీకేల పనితీరును పరిశీలించి ప్రశంసించారు.
ఇది గత పరిస్థితి...
పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లోని మండలాల్లోని వరి, కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల సాగు అధికంగా ఉంది. గతంలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం పల్లెల నుంచి మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సి వచ్చేది. విత్తనాలు, ఎరువులకు డిమాండ్ అధికంగా ఉండే సందర్భాల్లో బ్లాక్‌లో అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చేది. దీంతో రైతులు అల్లాడిపోయే వారు. ఽలేకుంటే తమిళనాడుకు పరగులు పెట్టేవాళ్లు. దీనికి తోడు కల్తీ ఎరువుల కాటేయడంతో తమిళనాడులోని సరిహద్దు ప్రాంతాల వైపే చూసేవాళ్లు.
పెరిగిన సాగు విస్తీర్ణం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్‌బీకే వ్యవస్థను తీసుకురావడంతో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మారుమూల గ్రామాల్లోనూ ఆర్చీకేలను ఏర్పాటు చేయడంతో రైతులు గ్రామం దాటకుండానే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పొందడం, పండించిన పంటను దర్జాగా మద్దతు ధరకు అమ్ముకోవడం సాధ్యమైంది. దీంతో గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం 20 శాతానికి పైగా పెరిగింది.
ఎరువులు, విత్తనాలు అందుబాటులో..
చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గ వ్యాప్తంగా ఏటా ఖరీఫ్ సీజన్లో 12 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు, 300 క్వింటాళ్ల వరకు కంది, 600 టన్నుల వరకు జనుములు ఇతరా విత్తనాలను అందించేవారు. అలాగే ఏటా సుమారు 5 వేల టన్నులకుపైగా పైగా ఎరువులను కూడా రైతులకు అందించేవారు. అందుకు సంబంధించి ముందస్తుగా ఏటా సుమారు 1.14 లక్షల మంది రైతుల పంటల వివరాలను ఈ–క్రాప్‌లో నమోదు చేసేవారు. అలాగే భూసార పరీక్షలను నిర్వహించి సూక్ష్మ స్థూల పోషకాలను అంచనా వేసి రైతులకు ఏ పంటలు పండించుకోవాలి.. ఎంత మేర ఎరువులు వేయాలి.. తదితర అంశాలపై అవగాహన కల్పించడంతో పెట్టుబడులు గణనీయంగా ఆదా అవుతుండేవి. ఆర్బీకేల్లో ఉన్న రైతుల వివరాల ఆధారంగా సిబ్బంది పంటల బీమా చేయడంతో పాటు ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోతే వెంటనే పరిహారం అందించే వారు. ఇలా ఆర్బీకేల ద్వారా అందించే సేవలతో పాటు రైతు భరోసా పథకం ద్వారా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు భరోసాను ఇచ్చింది.
నేడు రైతులకు కష్టం...
కూటమి ప్రభుత్వం గద్దెనెక్కాక ఆర్బీకేల పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చారు. సేవలను అంతంత మాత్రంగానే అందిస్తున్నారని రైతులు వాపోతున్నారు. పంటల బీమా పథకం, రైతు భరోసా, వ్యవసాయ యాంత్రీకరణ తదితర పథకాలు అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రైతు సేవా కేంద్రాల సంఖ్యను కూటమి ప్రభుత్వం తగ్గించేందుకు కసరత్తు చేస్తుండడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక యూరియా దొరకని పరిస్థితి ఏర్పడింది. యూరియా కోసం రైతులు మండల ప్రాంతాల్లో బారులు తీరుతున్నారు. వ్యాపారులు సిండికేట్‌తో యూరియాను అధిక రేట్లకు విక్రయించుకుంటున్నారు. దీంతో రైతులు ఇబ్బందికి గురవుతున్నారు. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
గత ప్రభుత్వంలో వ్యవసాయం పండగ..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విత్తనాల పంపిణీ నుంచి పంట కొనుగోలు వరకూ ప్రతి దశలో రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం చేయూతను అందించడంతో వ్యవసాయం పండగలా సాగింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఆర్చీకేలు రైతు నేస్తాలుగా మారి వ్యవసాయంలో నూతన శకానికి నాంది పలికాయి. 2020 మేలో ప్రారంభించిన ఆర్బీకేలను దశల వారీగా బలోపేతం చేశారు. రైతులు ఊరు దాటకుండా వారికి అవసరమైన భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యంత్ర పరికరాలు, తదితర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
నాడు పండుగ.. నేడు దండగ
నాడు పండుగ.. నేడు దండగ
Comments
Please login to add a commentAdd a comment