ఇది రాజకీయ కక్ష కాదా బాబూ?
కార్వేటినగరం : ఎన్నికలప్పుడు అందరికీ న్యాయం చేస్తామని చెప్పి తీరా పదవి వచ్చాక పార్టీలకు అతీతంగా సేవలందించాల్సింది పోయి రాజకీయంగా కక్ష గట్టి కేవలం టీడీపీకి చెందిన వారికే లబ్ధి చేకూర్చేలా సీఎం చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదమని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గంగాధర నెల్లూరు పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు వైఎస్సార్‌సీపీకి చెందిన వారికి ఎలాంటి పనులు పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని చేయకూడదని పార్టీ నేతలు, అధికారులకు ఆదేశాలిచ్చేలా మాట్లాడడం ద్వారా తన వైఖరి ఏంటో ప్రజలకు అర్థమయిందన్నారు. అధికారంలోకి వచ్చన ఏ పార్టీ అయినా ప్రజలకు ఎలాంటి పనులు చేపట్టాలి..
పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలనే ఆలోచన ఉండాలే తప్ప ఇలాంటి దుర్మార్గపు ఆలోచనతో నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్నాడని చెప్పారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసే ఏ కార్యక్రమమైనా సంక్షేమ పథకాలైనా పార్టీలకు అతీతంగా అందించాలని పదే పదే చెప్పేవారని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నిరకాలుగా ఇబ్బందులకు గురి చేసినా మొక్కవోని దీక్షతో దీటుగా ఎదుర్కొంటామని తెలిపారు.
నేడు పోలీస్ గ్రీవెన్స్
చిత్తూరు అర్బన్ : చిత్తూరు వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment