రన్నింగ్ లారీపై నుంచి పడి క్లీనర్ మృతి
పలమనేరు : లారీపైనున్న టార్పాలిన్ పట్టను కడుతూ కాలుజారి కిందపడి క్లీనర్ మృతి చెందిన సంఘటన పలమనేరు మండలంలోని కాలువపల్లి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ నుంచి లారీ లోడ్‌తో బయలుదేరి తమిళనాడులోని గుడియాత్తంలో అన్‌లోడ్ చేసి తిరిగీ బయలు దేరింది. ఈ నేపథ్యంలో మండలంలోని కాలువపల్లి వద్ద వస్తుండగా లారీ అద్దాలకు పైనున్న టార్పాలిన్ అడ్డుగా వస్తోందని గమనించిన డ్రైవర్ ఉస్మాన్ క్లీనర్ మంజునాథ్‌కు చెప్పాడు. దీంతో క్లీనర్ లారీ రన్నింగ్‌లో ఉండగానే దాన్ని తాడుతో కట్టి కిందకు దిగే సమయంలో కాలుజారి కిందపడ్డాడు. పై నుంచి కిందపడిన మంజునాథ్(42) తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ సమీపంలోని కళాడియి గ్రామంగా తెలిసింది. పలమనేరు పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి కేసు దర్యాపు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో
బాలుడి మృతి
గంగాధరనెల్లూరు : విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కట్టకిందపల్లి హరిజనవాడలోని దినకరన్, మాధవీల మూడో కుమారుడు సూరి అలియాస్ సీమోను (13) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదివారం ఉదయం 10 గంటలకు గ్రామంలోని చర్చిలో మైక్‌లో అందరినీ చర్చి ప్రార్థనకు రావాలని పిలుస్తుండగా షార్ట్ సర్య్కూట్ కావడంతో అక్కడికక్కడే కింద పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు అతనిని హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతడి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సూరి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పుష్పపల్లకిలో ఊరేగిన ఆదిదంపతులు
తవణంపల్లె: కాలభైరేశ్వర ఆలయంలో కొనసాగుతున్న మహా శివరాత్రి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం స్వామికి ఉఽభయదారులు అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజలు చేసి ధూపదీప నైవేద్యం సమర్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రిలో పుష్పపల్లకిలో సేవను ఉభయదారులు ఘనంగా నిర్వహించారు. ఉభయదారులు స్వామికి పూజా సామగ్రి, ప్రసాదాలు, పట్టువస్త్రాలు, సుగంధ పరిమళ పుష్పాలను ఊరేగింపుగా తీసుకొచ్చి సమర్పించారు. ఉత్సవమూర్తులు అర్చకులు అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు. పుష్పపల్లకిలో కొలువుదీరిన ఆదిదంపతులు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. భక్తులు ఇంటింటా పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
రన్నింగ్ లారీపై నుంచి పడి క్లీనర్ మృతి
Comments
Please login to add a commentAdd a comment