కులాంతరంపై కర్కశం
● పెద్దల సమక్షంలో పంచాయితీ ● జీర్ణించుకోలేని అమ్మాయి తండ్రి కత్తులతో దాడి ● గాయపడిన ప్రేమికులు.. అగరం కొత్తూరులో ఉద్రిక్తత
కుప్పం: అల్లారుముద్దుగా పెంచిన ఒక్కగానొక్క కూతురు కులాంతర వివాహం చేసుకోవడాన్ని తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి, రాజీ కుదుర్చుతుండగా అమ్మాయి తండ్రి ప్రేమికులపై దాడి చేశాడు. దీంతో ప్రేమికులతో పాటు మధ్యవర్తులకూ గాయాలయ్యాయి. ఈ సంఘటన కుప్పం పట్టణం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
గుడుపల్లె మండలం అగరం కొత్తూరు గ్రామానికి చెందిన శివశంకర్, కోదండప్ప అనే వ్యక్తులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు పక్కపక్క ఇళ్లలో నివసిస్తూ పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో కోదండప్ప కుమారుడు చంద్రశేఖర్, శివశంకర్ కుమార్తె కౌసల్య ఇరువురు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కౌసల్య ఒక్కగానొక్క కూతురు కావడంతో శివశంకర్ కూతుర్ని గారాబంగా పెంచి డిగ్రీ చదివిస్తున్నాడు. కౌసల్య, చంద్రశేఖర్‌ల ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో శివశంకర్ తన కూతురు కౌసల్యను పలుమార్లు మందలించాడు. డిగ్రీ వరకు చదువుకున్న అమ్మాయిని వ్యవసాయ కూలీకి ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేదంటూ కూతురికి పలుసార్లు నచ్చజెప్పాడు. కానీ కౌసల్య ససేమిరా అనడంతో పాటు గత రెండు రోజుల క్రితం చంద్రశేఖర్‌తో పరారై తమిళనాడులోని ఓ దేవస్థానంలో ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అగరం కొత్తూరు గ్రామస్తులు ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగా గురువారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద పంచాయితీ ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న శివశంకర్ కత్తులతో ఒంటరిగా ఉన్న ప్రేమికులపై దాడి చేశాడు. ఈ దాడిలో కౌసల్య చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి అడ్డువచ్చిన గ్రామస్తులు రమేష్, సీతారామప్పలకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వీరిని పక్కనే ఉన్న కుప్పం వంద పడకల ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment