తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పలు శాఖలతో వరుస సమీక్షలు నిర్వహించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ విషయంలో ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అల సత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించా రు. మొదటి ప్రాధాన్యత తాగునీటి సమస్య పరిష్కారానికి కేటాయించాలని చెప్పారు.
సమీక్ష నిర్వహిస్తే కానీ పనులు చేయరా?
సమీక్షలు నిర్వహిస్తే కానీ పనులు చేయరా? అని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఇది వరకే మండలాలకు అందిన నిధులతో కేటాయించిన పనులకు ఇప్పటివరకు నిధులు ఖర్చు చేయని ఎంపీడీఓలపై కలెక్టర్ మండిపడ్డారు. తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులను ఖర్చు చేస్తే అందుకు సంబంధించిన మూడు దశల(బోరు, పంపు సెట్, నీటి సరఫరా)లో జియో ట్యాగింగ్ ఫొటోలను అప్లోడ్ చే యాలన్నారు.
ఉపాధి కల్పనకు శిక్షణ ఇవ్వండి
జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు రూ. 544 కోట్లతో 59,044 మందికి ఉపాధి కల్పించేలా 14,761 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఉదయం పోర్టల్ దరఖాస్తులు స్వీకరించామన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ కింద 29 జనవరి 2025 నుంచి 4 మార్చి 2025 వరకు 78 దరఖాస్తులు స్వీకరించగా 61 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు అవగాహన కార్యక్రమాల నిర్వహణలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో ఇప్పటి వరకు 45,119 ఎంఎస్‌ఎంఈ యూనిట్లను సర్వే చేస్తున్నట్లు చెప్పారు. ఈ సర్వే ప్రక్రియను 15 మార్చి 2025 లోపు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, జీఎం ఇండస్ట్రీస్ వెంకట్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సుబ్బారావు, ఎల్‌డీఎం హరీష్, డీపీఓ సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment