అనధికార విద్యుత్ కోతలు..రైతులకు వాతలు
● గంటకోసారి విద్యుత్ సరఫరా ఆపివేత ● అధికారులపై రైతుల కన్నెరర్ర ● పట్టించుకోని ప్రభుత్వం
కరెంటు లేకపోవడంతో బాధపడుతున్న రైతు
తోటకనుమ సబ్‌స్టేషన్‌లో ఉన్న ఒకటే ట్రాన్స్‌ఫార్మర్
కర్షకులకు జీవనం నిత్యం పరీక్షగా మారుతోంది. అనధికారిక విద్యుత్ కోతలు.. ఎప్పుడు ఎంత సమయం ఆగిపోతుందో తెలియని దుస్థితితో కంటి మీద కునుకులేకుండా పోతోంది. దీంతో ఆశల పంట తడారిపోకుండా జీవ‘తడులు’ ఇచ్చుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. అడిగినా సమాధానం చెప్పే అవసరం లేదన్న ధీమాతో కూటమి సర్కారు పుడమి పుత్రుల కష్టం.. పంట భవితవ్యంతో చెలగాటమాడుతోంది. హలధారులకు విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వంతోపాటు అధికారుల అలసత్వంతో అన్నదాతల ఆ‘శని’పాతంగా మారుతోంది. ఫలితంగా కర్షకుడికి గుండెకోత మిగులుతోంది.
వి.కోట: బైరెడ్డిపల్లి–వి.కోట మండలాలకు శాశ్వతంగా లోవోల్టేజ్ సమస్యకు చరమగీతం పాడాలన్న సంకల్పంతో గత వైఎస్సార్‌సీపీ ఫ్రభుత్వం మండలంలో తోటకనుమ గ్రామం వద్ద 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మించింది. ప్రస్తుత పాలకులు తామే గొప్ప అని ఆ సబ్‌స్టేషన్‌ను ఆడంబరంగా ప్రారంభించారు. సరఫరా మొదలైంది. అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సమస్యకు అడ్డుకట్టపడిందని సంబరపడ్డారు. అది కాస్త మూన్నాళ్ల ముచ్చటగా మిగిలింది. కేవలం మూడు నెలలు మాత్రమే విద్యుత్ సరఫరా కొనసాగింది. ఫిబ్రవరిలోనే అనధికారిక కోతలు మొదలయ్యాయి. సబ్‌స్టేషన్‌లో 31.5 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడంతో 24 మెగావాట్ల విద్యుత్ లోడ్ వినియోగించుకోవచ్చు. దీని నుంచి వి.కోట మండలంలో 7 సబ్‌స్టేషన్లకు విద్యుత్ సరఫరా ఇవ్వాల్సి ఉంది. అలాగే కస్తూరినగరం, వి.కోట. పాపేపల్లిమిట్ట, యాలకల్లు, పాముగానిపల్లి తదితర 33/11 కేవీ సబ్టేషన్‌కు విద్యుత్ సరఫరా చేయాల్సిఉంది. అలాగే బైరెడ్డిపల్లి మండలంలో 6 సబ్‌స్టేషన్లకు తోటకనుమ నుంచి సరఫరా అందిస్తున్నారు. ఇందులో బైరెడ్డిపల్లి, తీర్థం, కడపనత్తం, తదితర మూడు సబ్‌స్టేషన్లకు సరఫరా ఇచ్చారు. ఫలితంగా రైతులకు 7 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా అందించాలి. ఇందులో పగటిపూట 4 గంటలు, రాత్రి పూట నిరంతరాయంగా అందించాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి నెల నుంచే అనధికారిక కోతలు మొదలయ్యాయి.
ఒకే ట్రాన్స్‌ఫార్మర్‌తో అగచాట్లు
సబ్‌స్టేషన్‌లో ఒకే ట్రాన్స్‌ఫార్మర్ ఉండడంతో అధిక లోడ్డు కారణంగా బ్రేకర్ పడిపోతోంది. దీంతో విద్యుత్ సిబ్బంది కోతలకు సిద్ధమయ్యారు. రెండు ఫీడర్లకు సరఫరా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక ఫీడర్ లో ఒక గంట సమయం విద్యుత్ సరఫరా ఆపివేస్తున్నారు. అనంతరం మరో ఫీడర్‌కు విద్యుత్ సరఫరా నిలిపేసి, మరో ఫీడర్‌కు విద్యుత్ పునరుద్ధరిస్తున్నారు. ఇలా అనధికారిక కోతలు విధిస్తున్నారు. ఈ అనధికారిక కోతలు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రైతుల కోసం ప్రభుత్వం నిర్దేశించిన ఏడు గంటల విద్యుత్ అందడం లేదు. దీంతో సబ్‌స్టేషన్‌కు రైతులు ఫోన్ చేసి, అధికారులను నిలదీసినా సమాధానం దొరకడం లేదు.
కర్షకులకు ఇక్కట్లు
వేసవి ప్రారంభంలోనే అనధికారిక కోతలు విధిస్తున్నారు. దీంతో కర్షకులు ఇక్కట్లు పడుతున్నారు. పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పంటల పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో 31.5 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అనువుగా రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే వీటి ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం కానీ, అధికారులు కానీ దృష్టి సారించడం లేదు. ఫలితంగా నిత్యం ఉన్న ఒక్క ట్రాన్స్‌ఫార్మర్ బ్రేకర్ పడిపోతోంది. దీంతో పంటలకు నీరందకుండాపోతోంది.
అధికారుల కాలయాపన
మంజూరు చేశాం.. విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పుకుంటున్న పాలకులు ఎటుపోయారని రైతులు నిలదీస్తున్నారు. నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెప్పిన మాటలు నీటమూటలుగా మిగిలాయని రైతులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ సరఫరాపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపామంటూ స్థానిక అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఏపీ ఏస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు తక్షణమే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
కుప్పంలోనూ ఏడు గంటలే !
శాంతిపురం: సీఎం చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యంవహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ రైతులకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్ ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. వాస్తవంలో సరఫరా ఆరు నుంచి 6.30 గంటలకు మించటం లేదు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 వరకూ అన్ని ఫీడర్లలో త్రీఫేజ్ సరఫరా ఇస్తున్నారు. తర్వాత ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఓ ఫీడర్‌లో, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 వరకూ మరో ఫీడర్లో సరఫరా ఇస్తున్నారు. ఏకధాటిగా ఐదు గంటల పాటు విద్యుత్ ఉంటున్న సమయంలో కనీసం అర గంటకు తగ్గకుండా అప్రకటిత విద్యుత్ కోత అమలవుతోంది. దీంతో తమ పంటలు ఎండిపోకుండా చూసేందుకు రైతులు ఆపసోపాలు పడుతున్నారు. దండికుప్పం పంచాయతీలోని నిమ్మనపల్లెకు చెందిన రైతు 30 సొన్నేగానిపల్లి వద్ద పొలం లీజుకు తీసుకుని దాదాపు 3.5 ఎకరాల్లో బంగాళాదుంప సాగు చేశారు. కరెంటు కోతలతో నీరు ఇవ్వలేని స్థితిలో ఆ రైతు జనరేటర్‌ను ఏర్పాటు చేసుకుని పంటను కాపాడుకుంటున్నాడు.
పంట ఎండిపోతోంది
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు నిరంతరాయంగా తొమ్మిది గంటలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పగలు 5 గంటలు, రాత్రి పూట రెండు గంటలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటి కరెంటు కోతలతో రైతులు పంటలను పండించడం అటుఉంచితే, చేతికొచ్చిన పంటలకు సమయానికి నీరు అందించలేక, పంటలను ఎండిపోతోంది. ఎండుతున్న పంటలను చూస్తే గుండే పిండేస్తుంది. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రైతులకు నిరంతరాయంగా 9 గంటలు కరెంటు ఇవ్వాలి.
– రమేష్, రైతు, దాసార్లపల్లి గ్రామం, వి.కోట
కర్షక గుండెకోత
కర్షక గుండెకోత
కర్షక గుండెకోత